పర్యాటకంపై పట్టింపేది

by Ajay Maddhiboyina |

రాష్ట్రవ్యాప్తంగా అనేక అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నా.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అవి వెలవెలబోతున్నాయి. ప్రతి సంవత్సరం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే పర్యాటక ప్రాంతాలను ప్రమోట్ చేయడంలో, ఆయా చోట్ల కనీస సౌకర్యాలు కల్పించడంలో పర్యాటక శాఖ తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి.

పర్యాటకంపై పట్టింపేది
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా అనేక అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నా.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అవి వెలవెలబోతున్నాయి. ప్రతి సంవత్సరం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే పర్యాటక ప్రాంతాలను ప్రమోట్ చేయడంలో, ఆయా చోట్ల కనీస సౌకర్యాలు కల్పించడంలో పర్యాటక శాఖ తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా సోమశిల లాంటి అందమైన ప్రాంతాల్లో ఆయా కాటేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడంపై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలోని చాలా చోట్ల నిర్వహణ వ్యయం భరించలేక టూరిజం శాఖ చేతులెత్తేస్తున్నట్లు తెలుస్తున్నది. దీంతో ప్రైవేటు కాటేజీల ఖర్చులు భరించలేనివిధంగా ఉన్నాయని పర్యాటకులు వాపోతున్నారు.

ప్రత్యేక ప్యాకేజీలు కరువు

పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యాలు, ఆకర్షణీయమైన టూరిజం ప్యాకేజీలు కల్పించడంలో ఆ శాఖ విఫలమైందనే చర్చ జరుగుతున్నది. తిరుమల శీఘ్రదర్శనం కోసం తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ హైదరాబాద్ నుంచి మంచి ప్యాకేజీతో మూడు బస్సులు నడిపేది. అయితే గత నవంబర్ లో వీటిని టీటీడీ రద్దు చేసింది. ఫలితంగా మూడు బస్సులు ఆగిపోయాయి. హైదరాబాద్ నుండి శ్రీశైలం, నాగార్జున సాగర్, వరంగల్ సహా మరికొన్ని ప్రాంతాలకు వీకెండ్ లలో ప్రత్యేక ప్యాకేజీలు కూడా అంతంతమాత్రంగానే నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. హైదరాబాద్ నుండి ఉదయం వెళ్లి రాత్రికి తిరిగి వచ్చేలా కొన్ని ప్యాకేజీలను తీసుకువస్తే డిమాండ్ ఉంటుందని పర్యాటక శాఖ అధికారులు భావిస్తున్నా.. ఆ దిశగా కార్యాచరణ చేపట్టడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు.

ఆచరణకు నోచుకోని ‘టూరిజం పాలసీ’

ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన నూతన టూరిజం పాలసీ-2025 ఆచరణకు నోచుకోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణను దేశంలోని ప్రధాన పర్యాటక కేంద్రంగా రూపుదిద్దడం, పర్యాటక రంగంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పాలసీని రూపొందించారు. రాష్ర్ట ఆదాయంలో 10 శాతం ఎక్కువగా టూరిజం నుండి రాబట్టాలని నిర్ణయించారు. ఈ పాలసీ ద్వారా రాష్ట్ర పర్యాటక రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని ప్రకటించారు. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నది. పర్యాటకరంగంలో అభివృద్ధి కార్యకలాపాలపై ఆ శాఖ దృష్టి సారించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

‘ప్రమోషన్’లోనూ నిర్లక్ష్యం

కొంతకాలంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, వాటి ప్రమోషన్ విషయంలో పర్యాటక శాఖ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడంలో కూడా అలసత్వం స్పష్టంగా కనిపిస్తున్నది. గత మే లో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీల్లో కూడా రాష్ట్ర పర్యాటక శాఖను ప్రమోట్ చేయడంలో కూడా వెనకబడ్డారనే వాదన ఉన్నది. అంతేకాకుండా రాష్ట్ర పర్యాటక శాఖ నిర్వహిస్తున్న అఫీషియల్ వెబ్ సైట్, సోషల్ మీడియా వేదికల్లోనూ పర్యాటక ప్రాంతాల సమాచారాన్ని అందించడంలో విఫలమవుతున్నారనే అభిప్రాయమున్నది. విదేశీ పర్యటనలకు వెళ్లినా, పెట్టుబడులను ఆకర్షించడంలోనూ పురోగతి లేదంటూ పలువురు పేర్కొంటున్నారు.

Next Story