రిజర్వేషన్లపై నో క్లారిటీ..! ZPTC అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌లో అనిశ్చితి

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్​పార్టీకి లోకల్ బాడీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై సంకట స్థితి ఏర్పడినట్లు కనిపిస్తోంది.

రిజర్వేషన్లపై నో క్లారిటీ..! ZPTC అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌లో అనిశ్చితి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్​పార్టీకి లోకల్ బాడీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై సంకట స్థితి ఏర్పడినట్లు కనిపిస్తోంది. బీసీ రిజర్వేషన్ల అంశంలో వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో పార్టీకి, ప్రభుత్వానికి ఒక రకంగా బూస్ట్​ వచ్చినా ఈ నెల 8న హైకోర్టులో రిజర్వేషన్లపై కీలక విచారణ జరిగే అవకాశం ఉంది. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపై సందిగ్ధం ఏర్పడింది. రిజర్వేషన్ల అంశం హైకోర్టు పరిధిలోకి వెళ్లడంతో క్లియరెన్స్ దాకా వేచి చూసే ధోరణి అవలంభించాల్సి ఉన్నది. చాలా మండలాల్లో అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చినట్లుగా, ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితా ఆయా జిల్లాల నేతలు సిద్ధం చేసినట్లు సమాచారం. టీపీసీసీకి ఈ జాబితాను అందజేసే ప్రయత్నాల్లో కొన్ని జిల్లాల నేతలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

డీసీసీ చీఫ్‌ల ఎంపిక వాయిదా

ఏఐసీసీ నియమించిన 22 మంది పరిశీలకులు ఈ నెల 4 నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించి డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేయాల్సి ఉంది. వీరు ఆయా జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులతో సమావేమై ఈ ఎంపికను చేపట్టాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఆ ప్రక్రియ కాస్త వాయిదా పడింది. దీంతో డీసీసీ చీఫ్‌ పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు నిరాశలో పడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే వీరి నియామక ప్రక్రియ మొదలయ్యే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

Next Story