- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైద్య విద్యార్థులను అనుమానంగా చూడవద్దు : NMC తీరుపై వైద్య విద్యార్థిసంఘాల మండిపాటు
నీట్-యూజీ 2026 పరీక్షల నేపథ్యంలో జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) జారీ చేసిన ఆదేశాలు దేశవ్యాప్తంగా వైద్య వర్గాల్లో దుమారం రేపుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : నీట్-యూజీ 2026 పరీక్షల నేపథ్యంలో జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) జారీ చేసిన ఆదేశాలు దేశవ్యాప్తంగా వైద్య వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. మే 2, 3 తేదీల్లో దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు సెలవులు ఇవ్వవద్దని ఆ రోజుల్లో కచ్చితంగా వారు కాలేజీల్లో ఉండాలంటూ ఎన్ఎంసీ మెడికల్ కాలేజీలకు సూచించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. పరీక్షల పారదర్శకతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎన్ఎంసీ చెబుతున్నప్పటికీ, వైద్య సంఘాలు మాత్రం దీనిని విద్యార్థులపై అనుమాన దృష్టితో తీసుకున్న చర్యగా అభివర్ణిస్తున్నాయి. వైద్య విద్యార్థులు అత్యంత క్రమశిక్షణ గల వర్గమని... భవిష్యత్ వైద్యులుగా దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో కష్టపడుతున్న విద్యార్థులను ముందుగానే అనుమానంతో చూడటం వారి గౌరవాన్ని దెబ్బతీసే చర్యగా వైద్య సంఘాలు భావిస్తున్నాయి. కొందరి తప్పిదాల పేరుతో అందరిపై ఒకే విధమైన ఆంక్షలు విధించడం అన్యాయంగా అభివర్ణిస్తున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా), హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) ఈ ఆదేశాలను తీవ్రంగా ఖండిస్తూ శనివారం ఎన్ఎంసీకి లేఖలు రాశారు. విద్యార్థులను అనుమానితులుగా చూడడం సరైంది కాదని సంఘాలు స్పష్టం చేశాయి. పరీక్షల సమగ్రతను కాపాడడం అనేది అధికార యంత్రాంగ బాధ్యత కాగా, నిర్దోషులైన విద్యార్థులపై ఆంక్షలు విధించడం ద్వారా బాధ్యతను వారిపై మోపడం సరికాదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ విధానం విద్యార్థుల స్వేచ్ఛను మాత్రమే కాకుండా వారి ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీస్తుందని పేర్కొంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పరీక్షల భద్రతను కట్టుదిట్టం చేయడం అవసరమే అయినా, అది విద్యార్థులను అనుమానంతో చూడటం ద్వారా కాకుండా వ్యవస్థపరమైన సంస్కరణల ద్వారా సాధించాల్సి ఉంది. లేకపోతే, భవిష్యత్ వైద్యులుగా తయారవుతున్న విద్యార్థుల్లో నెగెటివ్ భావన పెరిగే అవకాశం ఉంది.






