- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజామాబాద్ జిల్లాలో వడ్డీ జలగలు!
నిజామాబాద్‌లో వడ్డీ రాక్షసుల వికృత క్రీడ. నెలకు రూ.200 కోట్ల అక్రమ దందా. వేధింపులతో సామాన్యుల విలవిల. సీపీ సార్ మరోసారి నజర్ పెట్టాలి!

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతోంది. అడ్డూ అదుపు లేకుండా వడ్డీ వసూలు చేస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. అధిక వడ్డీలతో అప్పులు ఇస్తూ వడ్డీల పేరుతో నానా రకాలుగా మానసిక హింసకు గురిచేస్తున్నారు. అప్పులు తిరిగి కట్టని వారికి, సకాలంలో వడ్డీలు చెల్లించని వారికి చుక్కలు చూపిస్తున్నారు. తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించడంలో కాస్త ఆలస్యమైనా, వడ్డీలు సకాలంలో చెల్లించకపోయినా అప్పు చేసి నోళ్లకు యమ దర్శనం కలిగేలా చేస్తున్నారు. ఎందుకురా ఈ బతుకు ఇంత కన్నా చావే నయమన్న రీతిలో భయపెడుతున్నారు. అప్పు తీసుకున్న వారితో వడ్డీ వ్యాపారులు అనుచితంగా వ్యవహరిస్తున్నారు.
వడ్డీ వ్యాపారులు తమ రికవరీ ఏజెంట్లతో ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. తీసుకున్న అప్పులకు వడ్డీలు సక్రమంగా చెల్లిస్తున్నా, డబ్బులు సర్దుబాటు కాని సమయంలో ఆలస్యమైతే నానా హంగామా చేసి దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారని చెబుతున్నారు. ఇంట్లో ఆడవాళ్ల ఎదుటే, విని భరించలేనంత బూతు మాటలతో పరువు తీసేలా తిడుతున్నారు. బూతులు తిడుతూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. వారి వేధింపులు భరించే కంటే ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకోవడం, లేదంటే పురుగుల మందు తాగి చావడమో నయమని చాలా సార్లు అనిపించిందని పలువురు వాపోతున్నారు. కన్న బిడ్డలు, కట్టుకున్న భార్య గుర్తుకొచ్చి చావు ఆలోచన మానుకున్నానని ఓ బాధితుడి మాటలు వడ్డీ వ్యాపారుల ఆగడాలను చెప్పకనే చెపుతున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో ప్రతి నెలా ఎంత లేదన్నా రూ.200 కోట్లకు పైగా జీరో అకౌంట్ డబ్బులు వడ్డీ వ్యాపారుల చేతులు మారుతున్నాయని, ఈ డబ్బంతా అధికారిక లెక్కల్లో లేని నల్లడబ్బేనన్నది బహిరంగ రహస్యం. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రముఖ వైద్యులు, బడా వ్యాపారులు, పెద్ద మొత్తంలో వేతనాలు, ముడుపుల రూపంలో ప్రతి నెలా రూ. లక్షల్లో సంపాదించే కొందరు ప్రభుత్వ అధికారులు తమకు నమ్మకమైన ప్రైవేట్ ఏజెంట్లను మెయింటెన్ చేస్తూ వారి ద్వారానే అత్యవసరంగా డబ్బులు అవసరమున్న వారికి ఆస్తి పత్రాలు కుదువ పెట్టుకుని అప్పులు ఇస్తున్నారు. తిరిగి వారి ద్వారానే అప్పులను, వడ్డీలను రికవరీ చేయిస్తున్నారు.
గతంలో పలుమార్లు పలువురు వైద్యులపై అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించిన దాఖలాలు కూడా ఉన్నాయి. హాస్పిటల్స్ వ్యాపారంలో రెండు చేతులా సంపాదిస్తున్న డబ్బును రియల్ ఎస్టేట్ లో పెట్టడం, అభివృద్ధి చెందుతున్న నగరాల్లో భూములు కొనడంతోపాటు సైడ్ గా వడ్డీ వ్యాపారం కూడా జిల్లాలో చాలా మంది డాక్టర్లు చేస్తున్నారు. ఆదాయపన్ను శాఖకు పంగనామం పెట్టి తెర చాటున పెద్దయెత్తున డాక్టర్లు చేస్తున్న వడ్డీ వ్యాపారం గురించి బయటి ప్రపంచానికి తెలియకుండా ఏజెంట్ల ద్వారా ఈ తతంగం అంతా నడిపిస్తున్నారు. డాక్టర్ల సైడ్ దందా గురించి బయటి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడేందుకు మీడియాలో కూడా కొందరికి ముడుపులు ముట్టజెప్పి మేనేజ్ చేస్తున్నారని తెలుస్తోంది. అప్పులు రికవరీ చేసే సమయంలో ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు, ఇతర అవసరమైన సందర్భాల్లో వారిని స్మార్ట్ గా వాడుకుంటున్నారు.
డాక్టర్లే కాకుండా పలువురు రైస్ మిల్లర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారులు, మోతుబరి రైతులు, జిల్లా, రీజినల్ స్థాయిలో విధులు నిర్వహిస్తున్న కొందరు ప్రభుత్వ అధికారులు కూడా ఏజెంట్ల ద్వారానే ఈ వడ్డీ వ్యాపారాన్ని పెద్ద యెత్తున చేస్తున్నారు. చాలా పెద్ద వ్యాపారులు, అడ్డదారిలో ఎక్కువ మొత్తంలో సంపాదించే అవకాశాలున్న పలువురు అధికారులు కూడా కలిసి పెద్ద పెద్ద ఆసాములతో పాటు కొందరు రైతులకు , సామాన్యులకు సైతం వడ్డీలకు పెద్ద యెత్తున డబ్బులు ముట్ట చెబుతున్నారు. వివిధ రాజకీయ పార్టీలతో సంబంధాలున్న వివిధ పార్టీల నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బంగారం వ్యాపారులు వివిధ వ్యాపార మార్గాల్లో ఉన్న ఎందరో వడ్డీ వ్యాపారాన్ని సైడ్ బిజినెస్ గా ప్రారంభించి దీన్నే ప్రధాన వ్యాపారంగా కొనసాగిస్తున్నారు.
ఇటీవల కాలంలో ఎక్కువైన ఆగడాలు..
దాదాపు పదేళ్ల కిందట ఆర్మూర్, నిజామాబాద్ పాంత్రాల్లో వడ్డీ వ్యాపారులంటే వడ్డెర కులానికి చెందిన వారని ఉండేవారు. వీరి దగ్గర అప్పు తీసుకుంటే యమ ధర్మరాజు చూసేందుకు షో టికెట్ కొన్నట్టేనని చాలా మంది అప్పులు తీసుకున్నోళ్లు అనుకుంటున్నారు. ఆ కమ్యూనిటీకి చెందిన వారు అప్పులు వసూలు చేసే పద్ధతులు చాలా భయానకంగా ఉంటాయని అంటుంటారు. రుణం తీసుకున్న వ్యక్తి ఎవరైనా, ఎంతటివారైనా డబ్బులు రికవరీ చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. వడ్డీ వ్యాపారుల వేధింపులు కూడా ఇటీవల ఎక్కువయ్యాయని పలువురు ఆత్మహత్యాయత్నం చేసుకోగా పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి.
వడ్డీ వ్యాపారుల ఇళ్లపై దాడులు..
నిజామాబాద్ సీపీ గా పోతరాజు సాయి చైతన్య ఛార్జ్ తీసుకున్నాక పలు సందర్భాల్లో వడ్డీ వ్యాపారులపై పంజా విసిరారు. అక్రమ వడ్డీ దందా చేసే వారిపై ఫోకస్ పెట్టి వారి ఆఫీసులు, ఇళ్ల పై రైడ్ లు నిర్వహించారు. వడ్డీ దందాకు సంబంధించిన అనేక ఆస్తి పత్రాలు. ఇతర బాండ్లు, నగదును స్వాధీనం చేసుకుని పలువురిపై కేసులు కూడా నమోదు చేశారు. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ డివిజన్ పరిధిలోని వడ్డీ వ్యాపారుల ఇళ్లపైన, ఆఫీసులపైనా ఏకకాలంలో టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఇంటిపై కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. పలువురు వడ్డీ వ్యాపారులను అరెస్టులు కూడా చేశారు. దీంతో కొంత కాలం వడ్డీ వ్యాపారుల ఆగడాలు సద్దుమణిగినా మళ్లీ వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు.
సీపీ సార్.. మరోసారి నజర్ పెడితే బాగుండు..
నిజామాబాద్ జిల్లా అంతటా విస్తరించుకున్న అక్రమ వడ్డీ వ్యాపార సామ్రాజ్యంపై సీపీ సాయి చైతన్య మరోసారి నజర్ పెడితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పులు తీసుకున్నోళ్లు పోలీసులను ఆశ్రయిస్తే వారు కుదువ పెట్టిన ఆస్తులను వ్యాపారులే జప్తు చేసుకుంటారనే భయంతో ఎవరూ ముందుకు వచ్చి పోలీసులను ఆశ్రయించడం లేదు. ఈ విషయంలో పోలీసులే చొరవ చూపి వడ్డీ వ్యాపారుల ఆగడాలను నియంత్రించాలని కోరుతున్నారు.






