పెట్టిందే తినాలి.. ఎదురు మాట్లాడొద్దు

by Ratna Kumari |

కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు భోజనం పెట్టే కాంట్రాక్ట్ సిబ్బంది తీరు పై రోగుల సహాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పెట్టిందే తినాలి.. ఎదురు మాట్లాడొద్దు
X

దిశ, కామారెడ్డి టౌన్ : కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు భోజనం పెట్టే కాంట్రాక్ట్ సిబ్బంది తీరు పై రోగుల సహాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్టిందే తినాలి, మెనూ అడగొద్దు, మేము వచ్చిన టైంకి లేకుంటే భోజనం లేనట్టే" అంటూ సిబ్బంది దురుసుగా సమాధానం చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు.

అది నిబంధనా.. నిర్లక్ష్యమా..?

ఆసుపత్రిలోని వార్డులకు భోజనం తీసుకొచ్చే సిబ్బంది ఒకేసారి వచ్చి వెళ్లిపోతున్నారు. ఆ సమయంలో రోగి పరీక్షల కోసం వేరే వార్డుకు వెళ్లినా, వాష్‌రూమ్‌కు వెళ్లినా తిరిగి వస్తే అన్నం పెట్టడం లేదు. "మేము వచ్చినప్పుడు మీరు లేరు. ఇప్పుడు పెట్టం. మీ వార్డులో ఇంతకుముందే పెట్టాం" అంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని రోగుల సహాయకులు చెబుతున్నారు.

ఆకలితో అలమటిస్తున్న రోగులు

ఒకవేళ సిబ్బంది వచ్చిన సమయానికి రోగి సహాయకుడు క్యాంటీన్‌కు వెళ్లినా, మందుల కోసం బయటకు వెళ్లినా ఆ పూట భోజనం అందని పరిస్థితి. "మేము వచ్చినప్పుడు తీసుకోవాలి, లేకపోతే లేదు" అంటూ కాంట్రాక్టర్ సిబ్బంది దబాయిస్తున్నారని, దీంతో రోగులు ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మెనూ పాటించరా?

ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోగులకు నిర్దేశిత మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి. కానీ ఇక్కడ "పెట్టిందే తిను, మెనూ దేవుడెరుగు" అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అన్నం, పప్పు, కూర నాణ్యతపై కూడా ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని రోగుల బంధువులు వాపోతున్నారు.

అధికారులు స్పందించాలి

ఆసుపత్రికి వచ్చే రోగులు అప్పటికే అనారోగ్యంతో బాధపడుతుంటారు. అలాంటి వారికి సమయానికి భోజనం అందకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ కాంట్రాక్టర్ సిబ్బంది తీరుపై విచారణ జరిపి, రోగులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారులను కోరుతున్నారు.

Next Story