- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో కవిత పార్టీ ప్రభావం చూపేనా..?
తెలంగాణ రాజకీయాల్లో తను ఓ ట్రెండ్ సెట్టర్. ప్రజా సమస్యలపై చక్కని అవగాహన కలిగిన మహిళా నేత.. ఎంపీగా పార్లమెంటులో ప్రజాసమస్యలపై విషయ పరిజ్ఞానంతో అనర్గళంగా మాట్లాడి సభ మెప్పు పొందిన పార్లమెంటేరియన్ కల్వకుంట్ల కవిత.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కల్వకుంట్ల కవిత.. ఆ పేరే ఒక బ్రాండ్.. మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ ముద్దుల తనయ, ఆయన గారాల పట్టి కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమంలో తండ్రి చాటు బిడ్డగా అడుగు పెట్టి తనదైన శైలిలో ఉద్యమానికి ఊపు తెచ్చింది. తెలంగాణ సంప్రదాయ పండగ బతుకమ్మను ఉద్యమంలో భాగం చేసి మహిళా శక్తిని కూడగట్టి తెలంగాణ ఉద్యమానికి మహిళాలోకం దన్నుగా నిలబడేలా చేసింది. బతుకమ్మ పండగకు విశేష ప్రాచుర్యం కలిగేలా ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ ను గుర్తించేలా చేసింది. ఒక దశలో బతుకమ్మ అంటే కవితమ్మ.. కవితమ్మ అంటే బతుకమ్మ అనేంతగా బతుకమ్మకు ప్రాచుర్యం కల్పించింది. బతుకమ్మ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది కవిత.
తను ఓ ట్రెండ్ సెట్టర్..
తెలంగాణ రాజకీయాల్లో తను ఓ ట్రెండ్ సెట్టర్. ప్రజా సమస్యలపై చక్కని అవగాహన కలిగిన మహిళా నేత.. ఎంపీగా పార్లమెంటులో ప్రజాసమస్యలపై విషయ పరిజ్ఞానంతో అనర్గళంగా మాట్లాడి సభ మెప్పు పొందిన పార్లమెంటేరియన్. ప్రజా సమస్యలపైన, ప్రజావసరాలపైన మైండ్ లో అనుకుంటే బ్లైండ్ గా వెళ్‌లిపోయే రకం కాదు.. ప్లాన్డ్ గా వెళ్‌లే రకం.. ఏదైనా ఇష్యూను తీసుకుని పోరాడితే దాన్ని సాధించే దాకా వదలని పట్టువదలని తత్‌వం. తండ్రి చాటు బిడ్డగా ఉద్యమంలోకి వచ్చినా, తెలంగాణ సాధన తరువాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన కవిత ఎంపీగా చేసిన ఐదేళ్లలో ఢిల్లీ లెవెల్ లాబీయింగ్ లో కూడా ఎంతో పరిణితి సాధించింది. దేశ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత అంటే తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు.
మసక బారిన కవిత గౌరవం..
కవిత రాజకీయ జీవితంలో నాణేనికి ఒక వైపు.. మరో వైపు అన్న చందంగా ఎన్నో అంశాలున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో కలిసి కవిత లిక్కర్ స్కాంలో చిక్కుకోవడం, సుదీర్ఘ కాలం జైలు జీవితాన్ని గడపడం ఆమె రాజకీయ జీవితంలోనే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ మాయని మచ్చగా మిగిలిపోయిన అంశంగా పొలిటికల్ వర్గాలు విశ్లేషిస్తాయి. తరువాత ఆమె సొంత కుటుంబంలోనే అంతర్గత పోరు, అన్నా, చెల్లెళ్ల మధ్య విభేదాలు, పార్టీలో ఆమె పై విమర్శలు ఇలా ఎన్నో అంశాలు ఆమెను ఊపిరి సలపనివ్వకుండా చేశాయి. వీటన్నింటి వెనక స్వయాన తన అన్న కేటీఆర్, బావ హరీష్ రావు, దగ్గరి బంధువు సంతోష్ రావులున్నారని, అన్నీ తెలిసి కూడా తన తండ్రి మౌనంగా ఉంటూ మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని కవిత భావించారు. తను అనుభవిస్తున్న బాధతో పాటు, పార్‌టీలో అంతర్గతంగా జరుగుతున్న అనేక అంశాలను ప్రస్తావిస్తూ తన తండ్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు రాసిన సుధీర్ఘ లేఖ బహిర్గతం కావడం, మీడియాలో వైరల్ కావడంతో కవిత మరింత కుంగిపోయారు. ఇక ఆపై పార్టీపైన, తన అన్న కేటీఆర్, బావ హరీష్ రావులతో పాటు దగ్గరి బంధువు సంతోష్ రావులపై బహిరంగ విమర్శలు, ఆరోపణలకు దిగారు. ఈ అంశం పార్టీకి, పార్టీతో పాటు కేసీఆర్ కుటుంబానికి కూడా మింగలేక.. కక్కలేక అన్న చందంగా మారింది. దీంతో పార్టీలోని పలువురు నాయకులు కవితపై బహిరంగ విమర్శలు చేస్తూ ఆమెను మరింత రెచ్చగొట్టారు.. పొమ్మన లేక పొగపెట్టినా, పార్టీని వీడకుండా పార్టీలోనే ఉంటూ తన గళం విప్పుతూ వచ్చారు. చివరికి చేసేది లేక పార్టీ క్రమశిక్షణా రాహిత్యం కింద కవితను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ పెద్దాయన కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో కవిత తన విమర్శలకు కత్తికిరువైపులా అన్న చందంగా పదును పెట్టారు. ఈ అంశాలన్నీ ఆమెను ప్రతిరోజు వార్తల్లో వ్యక్తిగా నిలిపినప్పటికీ, ఢిల్లీ లిక్కర్ స్కాం అంశం మాత్రం ఆమె రాజకీయ గుర్తింపును మసక బారేలా చేసింది.
రాజకీయంగా ఎదగాలంటే సొంత పార్టీయే
కల్వకుంట్ల కవిత ఎక్కడ పోగొట్టుకుందో అక్కడే వెతుక్కోవాలనే ధోరణితో రాజకీయంగా మరింతగా సొంతంగా ఎదగాలనుకుంటున్నారు. అందుకే తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ఢిల్లీ స్థాయిలో కూడా తనకున్న పలుకుబడి, పరపతి తో రాజకీయ పార్టీ పెట్టేందుకు నిర్ణయించుకున్నారు. ఇది చాలా కాలంగా ఆమె మనసులో అనుకున్న లక్ష్యమేనని, అవకాశం కోసమే ఇన్నాళ్లూ వేచి ఉన్నారనేది ఆమె సన్నిహితులు చెప్పే మాట.
తన ఎజెండాను ప్రజలను నమ్ముతారా?
ఇంతకాలం బీఆర్ఎస్ లోనే ఉండి, ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ చేసిన అన్యాయాలు, అవినీతి, అక్రమాలను చూస్తూ కూడా నోరు మెదపలేని కల్వకుంట్ల కవిత ఇప్పుడు చెపుతున్న మాటలను ప్రజలు విశ్వసిస్తారా? నీళ్లు, నిధులు, నియామకం నినాదంతో తెలంగాణ ను సాధించడమే కాకుండా అధికార పగ్గాలు కూడా చేపట్టి పదేళ్ల పాటు అధికారం వెలగబెట్టిన బీఆర్ఎస్ చేసిన నీళ్లు, నిధులు, నియామకం విషయంలో తెలంగాణ ప్రజలకు ఏం చేయలేదని కవిత చెపుతున్న మాటలను ఎవరు విశ్‌వసిస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు తన అన్న కేటీఆర్, బావ హరీష్ రావు, దగ్గరి బంధువు సంతోష్ రావు లతో పాటు ఇతర నాయకులు చేసిన అవినీతిని, అక్రమాలను, అధికార దుర్వినియోగంతో వెనకేసుకున్న రూ. వేల కోట్ల అక్రమ సంపాదన, వందల ఎకరాల విలుపైన భూముల కబ్జాల వంటి విషయాలన్నీ కవితకు గుర్తున్నా ఎందుకు నోరు మెదపలేదనేది ప్రజల మనసును తొలుస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆమెను పార్టీనుండి వెళ్‌లగొట్టగానే పౌరుషం, అభిమానం పొడుచుకొచ్చి ఇప్పడెందుకు బయటపెడుతోందన్న ప్రశ్నలకు కవిత చెప్పే సమాధానం తెలంగాణ ప్రజలు ఏ మేరకు నమ్ముతారు.. ఇవే ఆలోచనలు ఆనాడే ఉంటే తెలంగాణ ప్రజాధనం వృధా కాకుండా ఎందుకు కాపాడలేదు. అక్రమ భూకబ్జాల పర్వాన్ని ఎందుకు ఆపలేదు. నీళ్లు, నిధులు, నియామకాలు సాకారం కావడం లేదని పార్టీని వీడి ప్రత్యక్ష పోరాటానికి ఎందుకు రోడ్డుపైకి రాలేదని ప్రశ్‌నిస్తున్నారు. ఆడబిడ్డల భవిష్యత్, వారి రక్షణ గురించి మాట్లాడుతున్న కవిత బీఆర్ఎస్ అధికారంలో ఉండగా మహిళలపై జరిగిన దారుణాలు, అటెంప్ట్ మర్డర్లు, రేప్ లు, గ్యాంగ్ రేప్ ల గురించి ఏనాడూ మాట్లాడి ప్రభుత్వాన్ని విమర్శించని కవిత అప్పుడెందుకు మౌనంగా ఉన్నారో.. అప్పుడు కూడా ఆమె ఆడ బిడ్డే కదా.. జరిగిన దారుణాలన్నీ మహిళలు, ఆడబిడ్డలపైనే కదా? మరి అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు ఆడబిడ్డల ఆశీర్వాదం ఎందుకు కోరుతోంది.. ఆడబిడ్డలు ఆశీర్వదిస్తారని ఆమె నమ్ముతుందా?
జయశంకర్ సార్ ను గుర్తు చేసుకోవడం వెనక మతలబేంటి?
జయశంకర్ సార్ అంటే తనకు చాలా అభిమానమని చెపుతున్న కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉండగా ఆయన పట్ల పార్టీ, కేసీఆర్ ప్రదర్శించిన నిర్లక్ష్య ధోరణిపై ఎందుకు నోరు మెదపలేదంటే ఏం సమాధానం చెపుతోంది? జయశంకర్ సార్ పేరును తలచుకుని, ఆయన సామాజిక వర్గం మద్ధతును కూడ గట్టుకుని రాజకీయ ప్రయోజనం పొందాలనే ఆలోచన ఆమె మాటల్లో దాగి ఉందా అనేది రాజకీయ పరిశీలకులు విశ్లేషించుకుంటున్నారు.
కవిత పార్టీ రాజకీయాల్లో మార్పు తెస్తుందేమో.. మరి ప్రజల్లో మార్పు సాధిస్తుందా?
కల్వకుంట్ల కవిత కొత్తగా పెట్టబోయే రాజకీయ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో మార్పు తెస్తే తెస్తుండొచ్చు గాక, కానీ ఆ పార్టీ ద్‌వారా ప్రజల్లో మార్పు జరుగుతుందా? లేదా అనే విషయంలోనే ప్రజలు ఆలోచిస్తున్నారు. ఆమె రాజకీయ సామర్థ్యం పైన తెలంగాణలో ఎవరికీ సందేహాల్లేవు. అనుకుంటే సాధించే తత్వం.. విశేష రాజకీయ పరిజ్ఞానం.. ఎక్కడా నోరు జారకుండా డిగ్నిఫైడ్ గా మాట్లాడే పొలిటీషియన్ గా ఆమెకు గుర్తింపు ఉంది. తనపై ఎందరెన్ని విమర్శలు; ఘాటుగా చేసినా సంయమనంతోనే తిప్పి కొట్టే సామర్‌థ్యం ఆమె సొంతం. ఇవన్నీ ఆమెలోని క్వాలిటీస్. కానీ, పొలిటికల్ పార్టీ వెనక లక్ష్యం ఏందనేదే ఇప్పుడు జనాల్లో ఉన్న సందేహం. ఏదేమైనా దిశ కల్వకుంట్ల కవిత కు ఆల్ ది బెస్ట్ చెబుతోంది.






