బీఆర్ఎస్ కంచు కోటను కాంగ్రెస్ బద్దలు కొట్టేనా ..?

by Thanuru Gopichand |

ప్రధాన పార్టీల భవిష్యత్తు తేల్చనున్న పట్టణ ప్రజానీకం.

బీఆర్ఎస్ కంచు కోటను కాంగ్రెస్ బద్దలు కొట్టేనా ..?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఉమ్మడి జిల్లాలో ఈ సారి జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో భీమ్‍గల్ మున్సిపాలిటీ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ కానుంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కనిపించనున్న పొలిటికల్ హైప్ ఇక్కడ కూడా కనిపించనుంది. అధికార కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం సైతం ఈ భీమ్‍గల్ మున్సిపాలిటీలో జరిగే ఎన్నికలపైనే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టనుందంటే మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఆ పార్టీకి ఎంత అవసరమనేది అర్థం చేసుకోవచ్చు. బాల్కొండ నియోజకవర్గం పరిధిలో ఉన్న భీమ్‍గల్ మున్సిపాలిటీ ఏర్పాటయ్యాక రెండో సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఇంతకు ముందు ఇక్కడి మున్సిపాలిటీ లోని 12 వార్డు స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గంప గుత్తగా గెలుచుకుని మిగతా పార్టీలను క్లీన్ స్వీప్ చేసింది. మున్సిపాలిటీలో ప్రతిపక్షమన్నదే లేకుండా బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో అన్ని స్థానాలను కైవసం చేసుకుని కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సగర్వంగా గులాబీ జెండాను ఎగరేసింది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఒక్క భీమ్‍గల్ లోనే బీఆర్ఎస్ క్లీన్ స్వీప్‍ చేసి గెలిచి రికార్డు సృష్టించింది. ఇంతటి ఘన విజయం వెనక అప్పటి మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పని చేసింది. ప్రస్తుతం ప్రశాంత్ రెడ్డి బాల్కొండ ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పటికీ, ఇప్పటికీ ఉన్న తేడా ఒక్కటే. అది బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం. భీమ్‍గల్ మున్సిపాలిటీ పరిధిలో ఓటు బ్యాంకు పరంగా ప్రశాంత్ రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణ, విశ్వాసం కారణంగా బీఆర్ఎస్ కు భీమ్‍గల్ కంచుకోటగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇది త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయానికి ముందుగానే బాట వేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భీమ్‍గల్ మున్సిపాలిటీలో జరగబోయే ఎన్నికల్లో పోటీ రాజకీయ పార్టీల మధ్యలో జరుగుతుందని భావిస్తే పొరపడ్డట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ జరిగే ఎన్నికలు స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణకు, అధికార కాంగ్రెస్ పార్టీకి మధ్యన జరుగుతాయంటున్నారు. దీన్ని కాంగ్రెస్ , బీజేపీ లు ఒప్పకోకపోయినా, జరగబోయేది అదేనంటున్నారు భీమ్‍గల్ ప్రజలు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా బాల్కొండ నియోజకవర్గానికి రూ. వందల కోట్ల నిధులను వరదలా పారించి, గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధిని చేసి చూపించారు. పక్క నియోజవర్గాల ఎమ్మెల్యేలు ఈర్ష్యపడేలా అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించారు. జిల్లాలో అతిపెద్ద గ్రామ పంచాయతీగా ఉన్న భీమ్‍గల్ ను ప్రభుత్వాన్ని ఒప్పించి మున్సిపాలిటీగా మార్చారు. భీమ్‍గల్ లో డబుల్ రోడ్ లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా, వంద పడకల ఆస్పత్రి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డునిర్‌మాణాలకు రూ. కోట్లాది రూపాయలు విడుదల చేయించడం, మున్సిపాటిటీ అభివృద్ధిలో భాగంగా డ్రైనేజీల నిర్మాణం, ఇంటర్నల్ రోడ్‌లు వంటి అనేక అభివృద్ధి పనులు చేసి నభూతో నభవిష్యత్.. అనిపించుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ప్రశాంత్ రెడ్డి భీమ్‍గల్ పట్టణంలో చేసిన అభివృద్ధితో ప్రజలకు చాలా దగ్గరయ్యారనే టాక్ ఉంది. బీఆర్ఎస్ హయాంలో ఆయన చేసిన అభివృద్ధే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన రెండేళ్‌లలో చెప్పుకోదగ్గ అభివృద్ధి చేసిందేం లేదని బీఆర్ఎస్ శ్రేణులు చెపుతున్నారు. అందుకే ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు మిగతా మున్సిపాలిటీలలో ఎన్నికలు ఎలా జరిగినా, భీమ్‍గల్ లో మాత్రం ప్రశాంత్ రెడ్డి ఇమేజ్ కు, కాంగ్రెస్ పార్టీకి మధ్య నువ్వా, నేనా అన్న రీతిలో టైట్ ఫైట్ జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు మాట్లాడుకుంటున్నారు.

ప్రజాదరణను సొమ్ము చేసుకోలేకపోతున్న బీజేపీ

హిందుత్వ నినాదరం ప్రజలను బీజేపీ కి దగ్గర చేస్తోంది. ఆ నినాదం ప్రజలను బీజేపీకి ఆకర్షితులను చేస్తోంది. భీమ్‍గల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల్లో ఎక్కువ శాతం యువకులు బీజేపీ పట్ల ఆకర్షితులై అధిక సంఖ్యలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ప్రజల్లోకి ఇంతలా దూసుకుపోయిన బీజేపీలో సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడంతో ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణను ఆ పార్టీ సొమ్ము చేసుకోలేకపోతుందనే నిరాశ ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఈ నిరాశ, నిస్పృహలు ప్రతిసారి ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల ఫలితాలనే వచ్చేలా చేస్తున్నాయి. సరైన దిశానిర్ధేశం చేసే నాయకత్వం, ప్రజాసమస్యలపై అధికార పార్టీతో గట్టిగా పోరాడే గళం లేకపోవడం, ప్రజా సమస్యలపై, హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యం వంటి అంశాలపై నిరసన గళం విప్పకపోవడం వంటి అనేక అంశాల్లో బీజేపీ పార్టీ వెనకబడి ఉంది అనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

నాయకులు, వారి గ్రూపులు కూడా ఏకం కావాలి..

భీమ్‍గల్ మున్సిపాలిటీని గెలవాలంటే కాంగ్రెస్ పార్టీలో స్వీయ మార్పులు చేసుకోవాలనే చర్చ పార్టీలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీ ఎన్నికలను కేవలం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే సరిపోదని, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అనే కొండను ఢీకొట్టాలంటే ముందుగా నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులంతా ఏకం కావాలని, వారి గ్రూపులన్నీ ఏకం కావాలనే అభిప్రాయాలు కాంగ్రెస్ లో వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఆయా నేతల గ్రూపుల్లో కొనసాగుతున్న కార్యకర్తలు, గ్రామ, మండల స్థాయి నాయకులు కూడా చెపుతున్నట్లు సమాచారం. దీంతో జిల్లా కాంగ్రెస్ కమిటీతో పాటు, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ తో పాటు, జిల్లా మంత్రి సీతక్క, మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి కూడా ఇదే విషయాన్ని నిజామాబాద్ నేతల ద్వారా బాల్‌కొండ సెగ్మెంట్ కు చెందిన కాంగ్రెస్ నాయకులకు చెప్పినట్లు తెలుస్తోంది. జల్లా మంత్రి సీతక్క బుధవారం భీమ్‍గల్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఇదే విషయాన్ని ఇక్కడి నాయకులకు సూచించినట్లు సమాచారం.

Next Story