నేతల మధ్య మాటల యుద్ధం.. అగ్రనేతలకు అగ్నిపరీక్ష

by I. Sairam |

నిజామాబాద్ కార్పొరేషన్ లో ఎలక్షన్ సీనరీ రోజుకో తీరున హీటెక్కుతోంది. పార్టీల మధ్య కాక రేపుతోంది.

నేతల మధ్య మాటల యుద్ధం.. అగ్రనేతలకు అగ్నిపరీక్ష
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ కార్పొరేషన్ లో ఎలక్షన్ సీనరీ రోజుకో తీరున హీటెక్కుతోంది. పార్టీల మధ్య కాక రేపుతోంది. రాజకీయ విమర్శల వైపు నుండి వ్యక్తిగత విమర్శల వరకు దారి తీస్తోంది. ఎవరికి వారే ప్రత్యర్థుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా, ప్రజల్లో వారిని తక్కువ చేసి ఓట్లు రాబట్టుకునేలా చేస్తున్న ప్రచారాలకు, విమర్శలకు పదును పెట్టి దూకుడుగా వెళుతున్నారు. శుక్రవారం డిచ్ పల్లి మండలం బర్దిపూర్ శివారులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఎక్కువగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి నే టార్గెట్ చేసినట్లుగా అనిపించింది. ఆయన రాజకీయ విమర్శలు కూడా ఆయనను టార్గెట్ చేసుకుని చేసినవే కావడం విశేషం.

బీజేపీ, బీఆర్ఎస్ బంధం ఫెవికాల్ బంధం అని, వీణావాణిల బంధంతో పోల్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కేసీఆర్ కు దత్త పుత్రుడనేశారు. ఓ రకంగా సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ సభకు హాజరైన జనంతో పాటు, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఎనలేని జోష్ ను నింపిందనే టాక్ వినిపిస్తోంది. కానీ, సీఎం స్పీచ్ లో స్థానిక ఎంపీ అర్వింద్ ధర్మపురినే టార్గెట్ గా చేసి మాట్లాడిన తీరుతో నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఫైట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గా జరుగుతోందా? లేదంటే కాంగ్రెస్ వర్సెస్ అర్వింద్ ధర్మపురిలా కొనసాగుతోందా? అనే అంశంపైనే ఎక్కువగా నగరవాసులు చర్చించుకుంటున్నారు.

బీజేపీలో ఒకే ఒక్కడు..

ఆపరేషన్ కార్పొరేషన్ మేయర్ సీట్ అన్నట్లుగా దూకుడుగా వెళుతున్న బీజేపీ ఎలక్షన్ క్యాంపేయిన్ ను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఒక్కడే ముందుకు తీసుకెళుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ నేతల విమర్శలకు ధీటుగా టిట్ ఫర్ టాట్ అన్న రీతిలో కౌంటర్లు ఇస్తూ కాంగ్రెస్ విమర్శల ధాటికి పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు పదునైన కౌంటర్లు ఇవ్వడంతో అర్వింద్ నిష్ణాతుడిగా మారాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి లు ఉన్నప్పటికీ, వారితో పాటు ఇతర నాయకులు కూడా ప్రచారంలో పాల్గొంటున్నప్పటికీ ఎంపీ అర్వింద్ ధర్మపురి తన దూకుడుతో, బీజేపీలో ఒకే ఒక్కడిగా ప్రత్యర్థి పార్టీల నాయకుల విమర్శలకు పదునైన కౌంటర్లతోదూసుకెళుతున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరిస్తుండటంతో పార్టీలో మిగతా నాయకులు కూడా భారమంతా ఆయనపైనే వేసినట్లు కనిపిస్తోంది.

కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా నిజామాబాద్ స్మార్ట్ సిటీ అంశం..

ఎట్టి పరిస్థితుల్లో నిజామాబాద్ కార్పొరేషన్ ను కైవసం చేసుకోవాలనే సంకల్పంతో టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు గట్టిగా కృషి చేస్తున్నారు. మహేశ్ కుమార్ గౌడ్ జిల్లా వాస్తవ్యుడే కావడంతో ఆయనపై కార్పొరేషన్ ను గెలుచుకోవడమనేది ప్రతిష్టాత్మకంగా మారింది. ఇది ఆయనపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. అయినప్పటికీ ఆయనకున్న అపార రాజకీయానుభవంతో పాటు, క్షేత్రస్థాయి సమస్యలపై ఉన్న అనుభవంతో పార్టీలో అంతర్గతంగా కార్యకర్తలు, నాయకుల మధ్య ఉన్న విభేధాలను పరిష్కరిస్తూ ముందుకెళుతున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపును అడ్డుకోవడానికి కొరకరాని కొయ్యలా మారిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురిని టార్గెట్ చేస్తున్నారు.

ఏడేళ్లుగా ఎంపీ గా ఉన్న అర్వింద్ నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీ కిందకు తేలేకపోయారని, అది ఆయన వైఫల్యంగా ప్రజల ముందు ప్రచారం చేస్తున్నారు. దీన్ని తిప్పి కొడుతున్న అర్వింద్ స్మార్ట్ సిటీ గా కేంద్రానికి ప్రతిపాదనలు పంపాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఎంపీ కాదనే విషయం తెలియకుండా రాజకీయం చేస్తున్న వీరిని ఏమనాలో తెలియడం లేదంటూ అర్వింద్ తిప్పికొడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిజామాబాద్ కార్పొరేషన్ బీఆర్ఎస్ చేతిలోనే ఉన్నా, కేంద్రానికి నిజామాబాద్ ను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చాలని ఎందుకు ప్రతిపాదనలు పంపలేదో బీఆర్ఎస్ ను ప్రశ్నించాల్సింది పోయి వారి అసమర్థతను నా అసమర్థతగా చూపి బెనిఫిట్ పొందాలని చూస్తున్నారని అర్వింద్ అంటున్నారు. పైగా నిజామాబాద్ అభివృద్ధి కోసం కేంద్రం నుండి అమృత్ పథకాన్ని తీసుకొచ్చిన విషయాన్ని కాంగ్రెస్ మరిచిపోయినట్లుందని గుర్తు చేస్తున్నారు.

గెలుపుకోసం చెమటోడుస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌లు..

రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలెలా ఉన్నా నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని విధంగా అగ్రనేతల ప్రచారంతో హోరెత్తుతోంది. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ కార్పొరేషన్ లోని 60 డివిజన్లలో ప్రచారం ఊపందుకుంది. గెలుపు కోసం అన్ని పార్టీలు చెమటోడుస్తున్నాయి. గతం కన్నా ఎంతో చైతన్యం పొందిన ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం, మాయ మాటలు చెప్పి ఓటర్లను బోల్‌తా కొట్టించడం అంత వీజీ కాదనే విషయం అభ్యర్థులతో పాటు పార్టీలకు కూడా అర్థమైంది.

అందుకు తగ్గట్లుగా స్థానిక సమస్యలను పరిష్కరిస్తామనే హామీలిస్తూ కాంగ్రెస్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని ఆరాట పడుతోంది. కార్పొరేషన్ లో అవినీతి రహిత పాలనను నగర ప్రజలకు అందిస్తామని బీజేపీ ప్రజలకు ప్రచారం చేస్తూ ఓట్లడుగుతోంది. బీఆర్ఎస్ మాత్రం తమ హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప ఇప్పటికీ నగరంలోని ఏ అభివృద్ధి జరగలేదని, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయాలని కోరుతోంది. మరో పక్క ఏఐఎంఐఎం పార్టీ మాత్రం తనకు పక్కాగా ఉన్న ఓటు బ్యాంకును నమ్ముకుని కూల్ గా ప్రచారం చేసుకుంటుంది. కార్పొరేషన్ మేయర్ ఎంపికలో ఎప్పటిలాగే తామే కీలకం కావాలనే ఆలోచనతో ముందుకెళుతున్నాయి.

Next Story