మైన‌ర్ బాలిక పై అఘాయిత్యం.. 20 ఏళ్ల జైలు శిక్ష

by Ratna Kumari |

మైనర్ బాలికపై ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి, కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి కామారెడ్డి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు గురువారం సంచలన తీర్పునిచ్చింది.

మైన‌ర్ బాలిక పై అఘాయిత్యం.. 20 ఏళ్ల జైలు శిక్ష
X

దిశ, తాడ్వాయి : మైనర్ బాలికపై ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి, కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి కామారెడ్డి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు గురువారం సంచలన తీర్పునిచ్చింది. నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు, ఒక లక్ష రూపాయల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి వరప్రసాద్ తీర్పు వెలువరించారు. పోలీసులు తెలిపిన ​కథనం ప్రకారం.. తాడ్వాయి గ్రామానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ రహీం (20) ఆటో నడుపుతూ, టెంట్ హౌస్‌లో పనిచేసేవాడు. టెంట్ హౌస్ సమీపంలోని ఐస్‌క్రీమ్ దుకాణానికి వచ్చే పదో తరగతి మైనర్ బాలికను లక్ష్యంగా చేసుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. బాలిక నిరాకరించినప్పటికీ భయపెట్టి, లొంగదీసుకుని లైంగిక వేధింపులకు గురిచేశాడు.​ ఈ క్రమంలోనే 2022 ఆగస్టు 5న స్కూల్‌కు వెళ్లిన బాలికను మాయమాటలతో కామారెడ్డి రైల్వే స్టేషన్‌కు రప్పించి, అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లాడు. అక్కడ వివిధ ప్రాంతాల్లో ఉంచుతూ ఆమె పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. స్కూల్‌కు వెళ్లిన కుమార్తె తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

​చాకచక్యంగా రక్షించిన పోలీసులు

​చిన్నారుల కేసు కావడంతో పోలీసులు దీనిని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని సమగ్ర దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాల సాయంతో ఢిల్లీలో ఉన్న మైనర్ బాలికను గుర్తించి సురక్షితంగా రక్షించారు. బాలిక ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిందితుడు మహమ్మద్ అబ్దుల్ రహీంను అరెస్ట్ చేశారు. సమగ్ర సాక్ష్యాధారాలు,వైద్య నివేదికలను సేకరించి కోర్టులో పోక్సో, ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద పక్కాగా చార్జ్‌షీట్ దాఖలు చేశారు.​కోర్టులో నేరం పక్కాగా నిరూపితం కావడంతో న్యాయమూర్తి నిందితునికి 20 ఏళ్ల కఠిన శిక్ష, జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అధికారులకు అభినందించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర‌ బాధితురాలికి భరోసా కల్పించి, నేరస్తుడికి శిక్ష పడేలా అంకితభావంతో పని చేసిన అప్పటి డీఎస్పీ ఏ. శ్రీనివాసులు, ప్రస్తుత డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు,అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కె. శేషు, సూర్యప్రసాద్, తాడ్వాయి ఎస్‌హెచ్‌ఓ వై. నరేష్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్‌ఐ రామేశ్వర్ రెడ్డి, కోర్టు కానిస్టేబుల్ టి. సాయిబాబులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Next Story