జుక్కల్ నియోజకవర్గంలో జోరుగా రీసైక్లింగ్ దందా..

by Disha Web Desk 20 |
జుక్కల్ నియోజకవర్గంలో జోరుగా రీసైక్లింగ్ దందా..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రైస్ మిల్లులకు ఇచ్చిన ధాన్యం మిల్లింగ్ ను వేగవంతం చేయాలని గడువులోపల ఎఫ్ సీఐకి కస్టమ్ మిల్లింగ్ రైస్ ను అప్పగించాలని అధికారులు చెపుతున్నా గడువుల మీద గడువులు పొడగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తంతు జరుగుతునే ఉంది. ఇప్పటికి రైస్ మిల్లర్ల వద్ద రెండు సీజన్ లకు సంబంధించిన ధాన్యం పోగై ఉంది. తాజాగా వానాకాలం పంటను అప్పగించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కానీ మిల్లర్లు మాత్రం ధాన్యం తిరిగి అప్పగించేందుకు అపసోపాలు పడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో సీఎంఆర్ కోసం జోరుగా రీసైక్లింగ్ దందా జరుగుతుంది. రేషన్ దుకాణాల వద్ద, రేషన్ తీసుకున్న ప్రజల వద్ద సేకరించి బియ్యం కోసం వ్యాపారులు ఎదురు చూస్తున్నారు.

ఎందుకంటే ఇప్పటికే మిల్లర్లకు కేటాయించిన ధాన్యం సరిహద్దులు దాటిందన్నది బహిరంగ రహస్యం. దానికి తోడు మిల్లర్లు మిల్లింగ్ చేయకుండా ధాన్యం అమ్ముకుని తిరిగి సీఎంఆర్ ను ఎఫ్ సీఐకి అప్పగించే అపసోపాలు పడుతున్నారు. ఇటీవల అధికారులు గడువును పొడగించేది లేదని, రోజుకు 460 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేయాలని లక్ష్యం విధించడం మిల్లర్లకు మింగుడు పడడం లేదు. కామారెడ్డి సరిహద్దు ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గంలో సీఎంఆర్ కోసం రేషన్ బియ్యం సేకరణ జోరుగా సాగుతుంది. జుక్కల్ నియోజకవర్గంలో చాలా మంది నిత్య ఆహారంగా రొట్టెలు తినే అలవాటు.

ఈ నేపథ్యంలో చాలా మంది బియ్యంను బ్లాక్ లోనే అమ్మేసుకుంటున్నారు. చాలా మంది రేషన్ దుకాణాల వద్ద తీసుకోకుండా విక్రయించేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దానికి తోడు పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకకు ఇక్కడి నుంచే ధాన్యం సరిహద్దులు దాటడంతో బియ్యం సేకరణకు ఇక్కడనే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఎఫ్ సిఐ అధికారులు మూడు నెలల క్రితం రైస్ మిల్లులలో తనిఖీలు చేసినప్పుడు ఉండాల్సిన ధాన్యం లేకపోవడంతో వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.

దానిని జిల్లా అధికారులు బహిర్గతం చేయక పోవడంతో రైస్ మిల్లులు సీఎంఆర్ కొరకు రీసైక్లింగ్ ద్వారా రేషన్ బియ్యాన్ని అప్పజెప్పేందుకు పీడీఎస్ బియ్యం కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. దాదాపు కిలో బియ్యం ద్వారా 15 నుంచి 20 రూపాయల లాభం ఉండడంతో పీడీఎస్ రైస్ ను సేకరించి తిరిగి ఎఫ్ సీఐకి అప్పగించేందుకు ఈ దందా జోరుగా సాగుతున్నట్లు సమాచారం. నియోజకవర్గంలోని పలు రైస్ మిల్లులు కేంద్రంగా ధాన్యం పక్కదారి పట్టగా ఇప్పుడు సంబంధిత మిల్లుల యజమాన్యాలు దానిని పూడ్చుకునేందుకు రేషన్ బియ్యం వెంట పడుతున్నట్లు సమాచారం.

అధికారులు ఇచ్చిన గడువు సమీపించడం, మిల్లింగ్ కు టన్నుల లక్ష్యం విధించడంతో రేషన్ బియ్యాన్ని ఎక్కువ ధరకైనా కొనేందుకు నానా తంటాలు పడుతున్నారు. కామారెడ్డిలో అత్యధికంగా ఉన్న మిల్లులకు ఇక్కడి నుంచే బియ్యం సేకరించి తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జిల్లాలో విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల దాడిలో టన్నుల కొద్ది రేషన్ బియ్యం పట్టుబడిన విషయం అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.

రేషన్ బియ్యాన్ని సీఎంఆర్ గా మార్చి అప్పగించేందుకు మిల్లర్లు చేస్తున్న ప్రయత్నాల కాలంలో చిన్నచిన్నగా పీడీఎస్ బియ్యం రవాణా చేస్తూ లోకల్ పోలీసులకు, సివిల్ సప్లయ్, ఎన్ ఫోర్స్ మెంట్ కు దొరుకుతున్న పెద్ద మొత్తంలో మాత్రం బియ్యం లభించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. చాలా రైస్ మిల్లులో మిల్లింగ్ చేసేందుకు సామర్థ్యం లేకపోయినా సామర్థ్యాన్ని మించి కేటాయించడం వారు ధాన్యాన్ని బ్లాక్ లో విక్రయించడంతో మిల్లింగ్ జరుగకుండానే సీఎంఆర్ ను అప్పగించేందుకు జరుగుతున్న తంతును అధికారులు గుర్తించకపోవడం విడ్డూరం.

Next Story

Most Viewed