- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లింగంపేటలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ
లింగంపేట మండలంలో ఇసుక అక్రమ రవాణా దందా యథేచ్ఛగా కొనసాగుతోంది.

లింగంపేటలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ
రోజుకు 100 ట్రిప్పుల రవాణా.. వాల్టా చట్టానికి తూట్లు..
ట్రాక్టర్ ఇసుక రూ.5వేలు.. రూ.కోట్లలో దోచుకుంటున్న వైనం
అడుగంటుతున్న భూగర్భ జలాలు.. ఆందోళనలో అన్నదాతలు
పట్టించుకోని రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం
లింగంపేట మండలంలో ఇసుక అక్రమ రవాణా దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. శెట్పల్లి సంగారెడ్డి, మాలపాటి, పోల్కంపేట వాగుల నుంచి రోజుకు 100 ట్రిప్పుల ఇసుక తరలిపోతోంది. ఇసుక తోడడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 2002 వాల్టా చట్టాన్ని అమలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుకను రూ.5 వేలకు విక్రయిస్తుండగా రోజుకూ రూ.లక్షల్లో అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ లెక్కన ఒక నెలకు రూ.కోట్లలో అక్రమార్జన చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు లేని సెలవు రోజులను ఆసరాగా చేసుకుని భారీగా డంపులు నిర్వహిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల సాకుతో సరిహద్దు మండలాలకు ఇసుక తరలిస్తున్నారు. తక్షణమే అక్రమ డంపులను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
దిశ, లింగంపేట : కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. సంబంధిత శాఖల అధికారులు తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరించడంతో ఇసుకాసురులు బరితెగిస్తున్నారు. మండలంలోని శెట్‌పల్లి సంగారెడ్డి, మాలపాటి, పర్మల్ల, పోల్కంపేట, నల్లమడుగు, నాగారం గ్రామాల్లోని వాగుల నుంచి ఇసుకను యథేచ్ఛగా తోడేస్తున్నారు. రోజుకు వందలాది ట్రిప్పుల ఇసుకను తరలిస్తూ ట్రాక్టర్ల యజమానులు ఒక ట్రాక్టర్ కు రూ.5వేల చొప్పున రూ.కోట్లలో వెనకేసుకుంటున్నారు.
అడుగంటుతున్న జలాలు..
భూగర్భ జలాలను కాపాడేందుకు 2002లో ప్రవేశపెట్టిన ‘వాల్టా’ చట్టం లింగంపేటలో కేవలం కాగితాలకే పరిమితమైంది. గాంధారి నుంచి వచ్చే వరద నీటితో పెద్దవాగులో ఏర్పడే ఇసుక మేటలను అక్రమార్కులు రాత్రి, పగలు అనే తేడా లేకుండా తవ్వేస్తున్నారు. దీనివల్ల భూగర్భ జలమట్టం భారీగా పడిపోతోందని, భవిష్యత్తులో సాగునీరు అందక తమ పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో అక్రమార్కులకు అడ్డూఅదుపు లేకుండా పోయింది.
డిమాండ్‌ను బట్టి ధర.. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో దోపిడీ
ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఊపందుకోవడంతో ఇసుకకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు అక్రమార్కులు ఒక్కో ట్రాక్టర్ ఇసుకను రూ.5వేల వరకు విక్రయిస్తున్నారు. మండలంలోని వాగుల నుంచి ఇసుకను తోడి మెదక్, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. ముఖ్యంగా రెండో శనివారం, ఆదివారం వంటి సెలవు రోజుల్లో అధికారులు ఉండరనే ధీమాతో ఉదయం నుంచి రాత్రి వరకు ఇసుకను తరలించి గ్రామ శివార్లలో పెద్దఎత్తున డంపులు ఏర్పాటు చేస్తున్నారు.
పట్టించుకోని అధికారులు...
అక్రమ రవాణాపై స్థానిక రెవెన్యూ, పోలీస్, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఉన్నా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొందరి స్వార్థం కోసం వేలాది మంది రైతుల నోళ్లు కొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, గ్రామ శివార్లలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను సీజ్ చేయాలని, అక్రమ రవాణాను అరికట్టి భూగర్భ జలాలను కాపాడాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






