నిజామాబాద్ మార్కెట్ కు పోటెత్తిన పసుపు

by Naveena |

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ కు రెండు రోజులుగా పసుపు పోటెత్తుతోంది. అయినప్పిటికీ పసుపు రైతుకు ఆశించిన మేర ధర పలకడం లేదు.

నిజామాబాద్ మార్కెట్ కు పోటెత్తిన పసుపు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ కు రెండు రోజులుగా పసుపు పోటెత్తుతోంది. అయినప్పిటికీ పసుపు రైతుకు ఆశించిన మేర ధర పలకడం లేదు. ఎంత మొత్తుకున్నా వ్యాపారులు ఏవరేజ్ గా రూ.11 వేలు ధరను దాటించడం లేదు. దీంతో పసుపు రైతులు ధరపై నిట్టూరుస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నుండే కాకుండా జగిత్యాల్, కోరుట్ల తదితర ప్రాంతాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా పసుపును యార్డులో అమ్ముకునేందుకు రైతులు పెద్ద యెత్తున తీసుకొచ్చారు. సోమ, మంగళవారాలు రెండురోజుల్లో 39,684 క్వింటాళ్ల పసుపును రైతులు మార్కెట్ యార్డుకు తరలించారు. సోమవారం 27,576 క్వింటాళ్లు రాగా.. మంగళవారం 12,108 క్వింటాళ్ల పసుపును రైతులు యార్డుకు తేవడంతో యార్డులో ఎక్కడ చూసినా రాశులుగా పోసిన పసుపు దిగుబడులే దర్శనమిచ్చాయి. ఆదివారం మార్కెట్ కు సెలవు రోజు కావడంతో సోమవారం పెద్ద మొత్తంలో రైతులు పసుపును మార్కెట్ కు తీసుకొచ్చారు. సోమవారం మార్కెట్ కు వచ్చిన పసుపు కొమ్ము 16,256 క్వింటాల్స్, మండ 8,395 క్వింటాల్స్, చూర 2,925 క్వింటాల్స్ రాగా.. మంగళవారం వచ్చిన పసుపు కొమ్ము 7128 క్వింటాల్స్, మండ 3,885 క్వింటాల్స్, చూర 1,095 క్వింటాల్స్ వచ్చినట్లు మార్కెట్ యార్డు అధికారులు తెలిపారు. మంగళవారం మార్కెట్ యార్డులో పలికిన పసుపు ధరలు పరిశీలిస్తే కొమ్ముకు క్వింటాకు రూ. 11,050 లు పలికింది. మండకు క్వింటాకు రూ.9,434 లు, చూర కు క్వింటాకు 9,200 లు ధర పలికినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఆశించిన ధర రావడం లేదంటున్న రైతులు..

పసుపుకు ధర ఎంత గింజుకున్నా రూ. 12 వేలు కూడా రావడం లేదని, కనీసం రూ. క్వింటాకు రూ.15 వేలైనా ధర రాకపోతే పసుపు రైతులకు చాలా నష్టం వాటిల్లుతుందని రైతులు అంటున్నారు. గతేడాది పసుపు ధర బాగానే వచ్చినా ఈసారి ఇంత దారుణంగా ఎందుకు పడిపోయిందో అర్థం కావడం లేదని రైతులంటున్నారు. సిండికేటుగా మారిన వ్యాపారులు ఇలా పసుపు రైతులను నిలువునా దోచుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. రైతుల కష్టానికి సరైన ధర దక్కేలా చూసి న్యాయం చేయాల్సిన మార్కెట్ యార్డు అధికారులు, పాలక వర్గం కూడా ఏమీ పట్టనట్లు వ్యవహరించడంపై పసుపు రైతులు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. మార్కెట్ యార్డు అధికారులు, పాలక వర్గం వ్యాపారులతో కుమ్మక్కై పసుపు ధరను ఉద్దేశ పూర్వకంగానే తగ్గించి నిండా ముంచుతున్నారని ఆరోపిస్తున్నారు. పసుపు రైతుల బాధలను అర్థం చేసుకునే పెద్ద దిక్కుగా ఉన్న ఎంపీ అర్వింద్ ధర్మపురి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలు పసుపు ధర విషయంలో జరుగుతున్న మోసాలపై దృష్టి సారించాలని కోరుతున్నారు. ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కకపోతే జాతీయ పసుపు బోర్డు వచ్చినా లాభం లేకుండా పోయిందనే అభిప్రాయం పసుపు రైతుల్లో కలుగుతోందంటున్నారు. పసుపు రైతులకు మేలు కలిగేలా దశాబ్దాలుగా పోరాడినా దక్కని పసుపు బోర్డును సాధించి తెచ్చిన ఎంపీ అర్వింద్ ధర్మపురికి కూడా చెడ్డపేరు తెచ్చేలా సిండికేటు వ్యాపారుల వ్యవహారం ఉందని, మార్కెట్ యార్డులో వారి మోసాలే రాజ్యమేలుతున్నాయని రైతులు అంటున్నారు.

Next Story