- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కమ్మర్‌పల్లి అడవుల్లో కలప మాఫియా దందా
కమ్మర్‌పల్లి రేంజ్ పరిధిలో కలప మాఫియా విలువైన టేకు చెట్లను నరికి రాత్రివేళ తరలిస్తోంది. అటవీ అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థులు మండిపడుతున్నారు.

దిశ, కమ్మర్ పల్లి : కొందరు కలపను అక్రమంగా తరలిస్తున్నారు. చెట్లను సంరక్షించాల్సిన అధికారులే చోద్యం చూస్తుండడంతో కలప వ్యాపారం జోరుగా సాగుతోంది. అడవుల్లో దొంగచాటుగా చెట్లను మాయం చేస్తున్నారు. కొందరు అక్రమార్కులు ఆయా ప్రాంతాల్లో ఏపుగా పెరిగిన విలువైన చెట్లను యథేచ్ఛగా నరికేస్తున్నారు. కంటికి రెప్పలా అడవిని కాపాడాల్సిన అటవీశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో నిత్యం అక్రమంగా కలప తరలిపోతూనేఉంది. ఫలితంగా పచ్చటి చెట్లతో కళ కళలాడుతున్న అడవులు అక్రమ వ్యాపారురులకు వరంగా మారాయని చెప్పవచ్చు.
గృహ అవసరాలకు కలపను వినియోగిస్తుండడంతో మార్కెట్‌లో దీనికి డిమాండ్ పెరుగుతోంది. దీంతో అక్రమార్కుల కన్ను కలపపై పడింది. అటవీ ప్రాంతంలో కలపను నరికి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కమ్మర్ పల్లి రేంజ్ పరిధిలో ప్రధానంగా అమీర్‌నగర్, నర్సాపూర్, ఇనాయత్‌నగర్, కొనసముదర్, కోనాపూర్ గ్రామాల పరిసర అటవీ ప్రాంతాల నుంచి విలువైన చెట్లను రాత్రివేళల్లో అక్రమంగా నరికి టింబర్ డిపోలకు తరలిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కోనాపూర్, అమీర్ నగర్, నర్సాపూర్ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా అనేక చెట్లు ధ్వంసమయ్యాయి. ఇప్పటికీ విలువైన వృక్ష సంపదను బహిరంగంగా మాయం చేస్తున్నారు. పగలు చెట్లను నరికి రాత్రివేళ దర్జాగా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో పురాతన వృక్షాలు సైతం నేలకొరిగిపోతున్నాయి. బహిరంగంగా ఈ విధ్వంసం జరుగుతున్నా అటవీశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో ట్రాక్టర్లు, ఇతర వాహనాల ద్వారా కలపను తరలిస్తున్న అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. అడవులు కనుమరుగైతే భవిష్యత్తులో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, వర్షాభావ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల పర్యవేక్షణ లోపం..
అటవీ అధికారుల పర్యవేక్షణ లోపంతోనే విలువైన టేకు అంతరించిపోతుందని, ఈ అక్రమ రవాణా సాగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. అక్రమార్కుల పై కఠిన చర్యలు తీసుకుంటేనే అడవులకు రక్షణ ఉంటుంది. విలువైన చెట్లను నరికి వేసిన వ్యక్తులను గుర్తించి ప్రాథమిక విచారణ చేసి చేతులు దులుపుకొంటున్నారు. అటవీ నరికివేతలో కొందరు అటవీ ఉద్యోగులు అక్రమార్కులకు సహకరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. రాత్రిపూట బ్లేడ్ ట్రాక్టర్లతో దుక్కి చేసి అటవీ భూమిని చదును చేస్తున్న పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆయా గ్రామాల అటవీ ప్రాంతాలను ప్రత్యక్షంగా సందర్శించి పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమ కలప రవాణాకు సహకరిస్తున్న వారిపై, అవినీతికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుని అడవులను రక్షించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.






