తారు రోడ్డు తవ్వారు.. మట్టి పోశారు

by Taduka Kalyani |

మండల కేంద్రంలోని పాత జాతీయ రహదారి-7లో గాంధీ విగ్రహం సమీపంలోని కోటక్ మహీంద్రా బ్యాంకు ఎదుట మిషన్ భగీరథ పైప్‌లైన్ మరమ్మతుల అనంతరం రోడ్డును సరిగా పునరుద్ధరించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తారు రోడ్డు తవ్వారు.. మట్టి పోశారు
X

దిశ, ముప్కాల్: మండల కేంద్రంలోని పాత జాతీయ రహదారి-7లో గాంధీ విగ్రహం సమీపంలోని కోటక్ మహీంద్రా బ్యాంకు ఎదుట మిషన్ భగీరథ పైప్‌లైన్ మరమ్మతుల అనంతరం రోడ్డును సరిగా పునరుద్ధరించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొద్ది రోజుల క్రితం రహదారి కిందుగా వెళ్లే మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలిపోవడంతో అధికారులు మరమ్మతులు చేపట్టారు. అయితే తవ్విన తారు రోడ్డును తిరిగి బాగు చేయకుండా కేవలం మొరంతో పూడ్చివేయడంతో వర్షాకాలంలో ఆ ప్రాంతం బురదమయంగా మారింది. చిన్నపాటి వర్షానికే నీరు నిలిచి చిన్న చెరువును తలపిస్తుండటంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజుల్లోనే ఈ ప్రాంతంలో మూడు రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆర్ అండ్ బీ అధికారులు వెంటనే స్పందించి బురద నీటిని తొలగించి, మొరం స్థానంలో శాశ్వతంగా సీసీ రోడ్డు నిర్మించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story