- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తహసీల్దార్ కుర్చీ ఖాళీ.. భీమ్‌గల్‌లో ప్రజల కష్టాల పర్వం!
వ్యవసాయ భూములు, అసైన్మెంట్, పట్టా భూముల పంచాయతీలు, వివిధ రకాల సర్టిఫికెట్లు, భూముల రిజస్ట్రేషన్లు వంటి అనేక ప్రజావసరాలతో ముడిపడి ఉన్న రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ లేక జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్: వ్యవసాయ భూములు, అసైన్మెంట్, పట్టా భూముల పంచాయతీలు, వివిధ రకాల సర్టిఫికెట్లు, భూముల రిజస్ట్రేషన్లు వంటి అనేక ప్రజావసరాలతో ముడిపడి ఉన్న రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ లేక జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలతో కార్యాలయానికి వచ్చే వారు అధికారి లేకపోవడంతో సమస్యలు పరిష్కారం మాట దేవుడెరుగు, సమస్యను వినిపించుకునే వారు లేక అవస్థలు పడుతున్నారు. పాత తాలూక కేంద్రమైన భీమ్ గల్ రెవెన్యూ కార్యాలయంలో 40 రోజులుగా తహసీల్దార్ కుర్చీ ఖాళీగానే ఉంది. ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేసిన షబ్బీర్‌ను ఉన్నతాధికారులు ఉన్నఫలంగా కలెక్టరేట్‌కు మార్చి 13 రోజున డిప్యుటేషన్‌పై పంపించారు. అప్పటి నుంచి భీమ్ గల్ తహసీల్దార్‌గా అధికారులు మరెవరినీ నియమించలేదు. తాజాగా డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్‌ను కూడా ప్రమోషన్‌పై ఆసిఫాబాద్‌కు బదిలీ చేశారు. షబ్బీర్ ప్లేస్‌లో రెగ్యులర్ తహసీల్దార్ ఎవరినీ ఇప్పటికీ నియమించకపోవడంతో డిటీ శ్రీనివాస్ ప్రస్తుతం ఇక్కడే కొనసాగుతున్నారు.
భీమ్ గల్ తహసీల్దార్‌గా పనిచేసిన తహసీల్దార్ ప్రతినెలా దాదాపు రూ. 10 లక్షలకు పైగా ఇసుక మాఫియా నుంచి ముడుపులు రూపంలో అందుకుని అడ్డగోలుగా నిబంధనలకు విరుద్ధంగా సహకరించేవారనే ఆరోపణలు ఎక్కువగా వినిపించేవి. ఇవే ఆరోపణలు జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా వెళ్లడంతో ఆయనను ఉన్న ఫలంగా కలెక్టరేట్‌కు డిప్యూటేషన్ వేశారని భీమ్ గల్ తహసీల్ కార్యాలయంలోని సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. తహసీల్దార్ గా పని చేసినన్ని రోజులు ఇసుక మాఫియాకు సహకరిస్తూ అడ్డదారిలో వచ్చే అక్రమ సంపాదనపైనే ఫోకస్ చేసి ప్రజల సమస్యలను గాలికొదిలేశారనే విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా పని చేశారనే ఫిర్యాదులు కూడా ఉన్నతాధికారులకు వెళ్లాయి. ఎన్నో సార్లు ఉన్నతాధికారులు ఆఫ్ ద రికార్డ్ తహసీల్దార్‌ను మందలించారని, అక్రమార్జనకు అలవాటు పడిన అధికారి తన తీరు మార్చుకోకపోవడంతో కలెక్టరేట్‌కు డిప్యుటేషన్ వేశారనే ఆరోపణలతో టాక్ వినిపిస్తోంది.
పడకేసిన ఫైళ్లు..
రెగ్యులర్ తహసీల్దార్ లేకపోవడంతో నెల రోజులకు పైగా ప్రజలను తీవ్రంగా వేధిస్తున్న భూ సమస్య లు, భూమి సరిహద్దుల సమస్యలు వంటి తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించ గలిగే సమస్యల ఫైళ్లన్నీ ఆఫీసులో పెండింగులో పడిపోయాయి. ఇంతకు ముందున్న తహసీల్దార్ హయాంలో పట్టించుకోకుండా పెండింగులో పడిఉన్న ఫైళ్లతో పాటు 40 రోజులుగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదంటూ బాధితులు వాపోతున్నారు.
భీమ్ గల్ కే మళ్లీ రావాలని ప్రయత్నాలు..
భీమ్ గల్ లో ఇసుక మాఫియాతో కుమ్మక్కై అక్రమార్జనకు అలవాటు పడిన అధికారి మళ్లీ భీమ్ గల్ తహసీల్దార్ గా వచ్చేందుకు అవసరమైన ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లాలోని తన సామాజిక వర్గానికి చెందిన ఓ సీనియర్ ప్రజాప్రతినిధితో రెవెన్యూ మినిస్టర్ ను కలిసి తన పోస్టును తిరిగి దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు ప్రభుత్వ పెద్దలను వేర్వేరు వ్యక్తుల ద్వారా కలిసి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నట్లు సమాచారం. మళ్లీ తనకు భీమ్ గల్ తహసీల్దార్ గా అవకాశమిప్పిస్తే రూ. 30 లక్షల వరకు చెల్లిస్తానంటూ మధ్యవర్తుల ద్వారా ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. బదిలీలపై బ్యాన్ ఉన్న కారణంగా కలెక్టరేట్ కు డిప్యుటేషన్ పై వెళ్లిన తహసీల్దార్ ను ఇంకెక్కడా పోస్టింగ్ ఇవ్వడం లేదని, ఇదే అవకాశంగా తీసుకుని తన ఫైరవీని స్‌పీడప్ చేస్తున్నా పని కాకపోవడంతో నిరాశతో ఉన్నట్లు ఆయనకు సన్నిహితంగా ఉన్న ఇసుక మాఫియా వ్యక్తులు చెప్పుకుంటున్నారు.
వేల్పూర్, మోర్తాడ్ లో ఏదో ఒక చోటికి..
డిప్యుటేషన్ పై వెళ్లిన తహసీల్దార్ త్వరలోనే వేల్పూర్, మోర్తాడ్ మండలాల్లోని ఏదో ఒక చోటికి తహసీల్దార్ గా వెళ్‌లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడికి వెళ్లాక భీమ్ గల్ తహసీల్దార్ గా ఇంచార్జి బాధ్యతలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. జగిత్యాల్ జిల్లా కు చెందిన ఓ అధికారి త్వరలోనే భీమ్ గల్ తహసీల్దార్ గా బాధ్యతలు తీసుకోనున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.
మాఫియాకు అడ్డా..!
ఇసుక మాఫియాకు భీమ్ గల్ ప్రాంతం అడ్డాగా పేరుంది. ప్రతినెలా దాదాపు తక్కువలో తక్కువగా రూ. కోటిన్నరకు పైగా అక్రమ ఇసుక వ్యాపారం జరుగుతుంది. ఇందులో అధికారులకు దాదాపు 25 శాతం ముడుపుల రూపంలో అందుతుందని ఇసుక వ్యాపారులు చెప్పే మాట. వారికి అందాల్సిన ముడుపులు అందితేనే ట్రాక్టర్లు వాగులో దిగేందుకు అనుమతులిస్తారని, లేదంటే ఏవేవో కొర్రీలు పెట్టి ఇసుక రవాణాకు బ్రేకులు వేస్తారని ఆరోపణలు ఉన్నాయి. తహసీల్ కార్యాలయం పరిధిలో భీమ్ గల్, బడాభీమ్ గల్, బెజ్జోర, సికింద్రాపూర్, గోనుగొప్పుల్ గ్రామ శివారులోని వాగులో ఇసుక మాఫియా ప్రతి నెలా రూ. కోట్లలో సంపాదించేంతగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తోంది. ఇసుక రవాణాపై ఎన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని జీఓ లు తీసినా, జిల్లా ఉన్నతాధికారులు ఎన్ని ఆంక్షలు విధించినా భీమ్ గల్, బడాభీమ్ గల్, బెజ్జోర శివారులోని వాగు నుండి ఇసుక తరలింపును ఆపే దమ్మున్న అధికారులెవరూ లేరనే ధీమా ఇక్కడి ఇసుక మాఫియాలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తెగింపు వారిలో కనిపించడమే కాదు.. బహిరంగంగా కూడా ఇదే విషయాన్ని మీసం మెలేసి చెప్పే ఇసుక మాఫియాకు ఇక్కడి అధికారులే అండగా నిలిచి వారి అక్రమ దందాకు సెక్యూరిటీ గార్డుల్లా నిలుచుంటారనే మాట ఇసుక మాఫియానే చెపుతుండటం గమనార్హం. వందల సంఖ్యలో ట్రాక్టర్లు అనుమతులు లేకుండానే ఇసుకను రవాణా చేస్తూ నిర్భీతిగా ఎక్కడ పడితే అక్కడ డంపులు వేసి, రాత్రి వేళల్లో ఆర్మూర్, పెర్కిట్, మామిడి పల్లి ప్రాంతాలకు తరలిస్తున్నా అధికారులు ఏం చేయలేక చేష్టలుడిగి చూస్తున్నారనే విమర్శలున్నాయి.
అధికార, ప్రతిపక్ష నాయకులు దోస్తులే..
రాజకీయాల్లోనే విరోధులు.. ఇసుక అక్రమ రవాణాలో అధికార పక్షం, ప్రతిపక్షం అంటూ వ్యత్యాసాలు లేకుండా దోస్తుల మాదిరిగా దందా చేసుకుంటున్నారు. ఎవరికెంతెంత చెల్లించాలో చెల్లిస్తూ చెట్టాపట్టలేసుకున్నట్లుగా ఇసుక దందాను నడిపిస్తున్నారు. భీమ్ గల్ రెవెన్యూ అధికారులకు ఇసుక మాఫియా రిజర్వ్ బ్యాంకులా మారిందని, అధికారులకు ప్రభుత్వం ఇచ్చే వేతనం కన్నా ఇసుక మాఫియా చెల్లించే ముడుపులపైనే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారనే టాక్ రెవెన్యూ వర్గాల్లో వినిపిస్తోంది. ఏది ఏమైనా భీమ్ గల్ కు రెగ్యులర్ తహసీల్దార్ ను ఎవరినో ఒకరిని త్వరగా పోస్టింగ్ ఇస్తే ప్రజల అవస్థలు తీరిపోతాయని, ఉన్నతాధికారులు ఆ దిశగా ఆలోచించాలని మండల ప్రజలు కోరుతున్నారు.






