యథేచ్ఛగా మొరం దందా.. మాయం అవుతున్న మట్టి గుట్టలు

by Ramesh Goud |

మున్సిపల్ పరిధిలోని గుట్టలన్నీ అక్రమ మైనింగ్ వ్యాపారులకు కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి.

యథేచ్ఛగా మొరం దందా.. మాయం అవుతున్న మట్టి గుట్టలు
X

అక్రమార్కుల తాకిడికి గుట్టలు కనుమరుగవుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లోనే కాకుండా మున్సిపల్ పరిధిలో ఉండే గుట్టలను, కొండలను మొరం తవ్వకాలతో యథేచ్ఛగా తవ్వేస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. అభివృద్ధి మాటున అక్రమార్కులు మొరం మట్టిని తరలించుకుపోతున్నారు. గుట్టలు, ప్రభుత్వ భూములు ఆనవాళ్లు కోల్పోతున్నా.. సంబంధిత అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. తవ్వకాలు జరుగుతుండంతో పకృతి సంపదకు చెందిన విలువైన గుట్టలు మాయం అవుతున్నాయి. ఈ తవ్వకాలకు ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. విలువైన ప్రకృతి సంపదను అడ్డగోలుగా అక్రమార్కులు కొల్లగొడుతుండడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి సైతం గండి కొడుతున్నారు. ఆర్మూర్ ఏరియాలో జరిగిన వెంచర్లతో పాటు భారీ ఎత్తున బ్రిడ్జిల ఏరియాల్లో మొరం అడ్డగోలుగా తరలించుకు పోవడంతో దశలవారీగా కొటార్మూర్ ఏరియాలోని పెద్దగుట్ట, చిన్న గుట్టలు పూర్తిగా కరిగిపోయే పరిస్థితి తయారైంది. గుట్టల ప్రాంతాల్లో పెద్దపెద్ద బండరాళ్లతో పాటు భారీ స్థాయిలో లోతైన గుంతలు దర్శనమిస్తున్నాయి. ఈ రెండు గుట్టల ఏరియాల్లో కనుచూపుమేర చూసినా ప్రస్తుతం సొంత ఇల్లు నిర్మించుకునేందుకు ప్రజలకు తట్టెడు మట్టి సైతం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, ఆర్మూర్: మున్సిపల్ పరిధిలోని గుట్టలన్నీ అక్రమ మైనింగ్ వ్యాపారులకు కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. కొందరు అక్రమ వ్యాపారులు దర్జాగా చట్టాన్ని ఉల్లంఘిస్తూ అడ్డగోలుగా మొరాన్ని తవ్వుకుంటూ మార్కెట్ లో దర్జాగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ప్రకృతి వనరులను కాపాడాల్సిన సంబంధిత అధికారులు తమ బాధ్యతను మరిచిపోయి, అక్రమార్కులకు బ్యాక్ డోర్ లో సహకారం అందిస్తూ తమ వంతు సహకారం అందిస్తున్నారు. విలువైన వనరులను కొల్లగొడుతూ అక్రమార్కులు రూ. కోట్లు దండుకున్నారు. ఈ ఏరియాలోని సర్వ సమాజ్, గ్రామాభివృద్ధి కమిటీలకు నయానో భయానో ట్రిప్పుకు రూ. 100 నుంచి 200 లు చెల్లిస్తూ వారి నోరు మూయించేస్తున్నారు. మొరం కోసం ఏకంగా గుట్టలను తవ్వడానికి జేసీబీలను ఉపయోగిస్తూ ఎడతెరిపి లేకుండా మొరం తరలిస్తున్నారు. కొటార్మూర్ ప్రాంతంలోని గుట్ట ప్రాంతం నుంచి అభివృద్ధి పనుల ముసుగులో మొరాన్ని అక్రమ వ్యాపారులు తరలించుకు పోతున్నారని ఆ ప్రాంత ప్రజలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఎర్ర మట్టికి ఒక్కో టాక్టర్ కు రూ. 3 వేల నుంచి రూ. 5 వేల వరకు డిమాండును బట్టి ఒక్కోసారి అదనంగా కూడా వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. కొటార్మూర్ ఏరియాలోని పెద్దగుట్ట, చిన్నగుట్ట రెండు ప్రాంతాల్లో గత ఐదారు సంవత్సరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వానికి నయాపైసా రాయల్టీలు చెల్లించకుండా విచ్చలవిడిగా అక్రమంగా మొరంను తరలించి వ్యాపారులు దండిగా సంపాదించు కున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. జేసీబీలతో గుట్ట ప్రాంతంలో మొరం మొత్తం తవ్వకాలు జరిపి గుట్టనే మాయం చేశారని ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు.

గుట్టలు మాయం చేసిన వారిపై చర్యలు ఉండవా..?

అక్రమ పద్ధతిలో ఆర్మూర్ ప్రాంతంలోని మొరం తరలింపుతో గుట్టలను మాయం చేసిన సదరు అక్రమ వ్యాపారులపై రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమ మొరం వ్యాపారులపై చర్యలు తీసుకునే విషయంలో అధికారులు మీనమేషాలు లెక్కించడంపై ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క అక్రమార్కులు గుట్టలను తవ్వుకుంటూ మొరాన్ని తరలిస్తుంటే అడ్డుకోవాల్సింది పోయి, ఆ మార్గంలోకి వెళ్లకుండా ఉండేందుకు అధికారులు మొరం కుప్పలను అడ్డంగా రోడ్డుపై పోస్తున్నారనే విమర్శలున్నాయి. మొరం వ్యాపారులకు లోపాయికారిగా సహకారమందించేలా అధికారుల చర్యలున్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చేపడుతున్న ఈ చర్యలు వింతగొలుపుతున్నాయని ఆర్మూర్ జనం కోడై కూస్తోంది.

అక్రమ మొరం వ్యాపారులపై పగలు, రాత్రి నిఘా పెట్టాం.. రాజా గౌడ్, ఆర్డీవో, ఆర్మూర్

ప్రాంతంలో అక్రమంగా మొరం తరలించే వ్యాపారులపై పగలు రాత్రి పటిష్‌ఠ మైన నిఘా పెట్టాం. అక్రమంగా మొరం తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. రెవెన్యూ అధికారులతో పాటు, పోలీస్ అధికారులు కూడా రాత్రివేళల్లో నిఘా టీంలతో పర్యవేక్షిస్తున్నాయి. గత 15 రోజులుగా మొరం తరలించే గుట్టల వద్ద వాహనాలు వెళ్లకుండా ట్రెంచ్ కటింగ్ చేయించి రాత్రి సమయాల్లో పర్యవేక్షిస్తున్నాం. అడ్డగోలుగా మొరం తవ్వకాలపై మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వానికి వచ్చిన రాయల్టీ, తరలి వెళ్లిన మొరంలపై లెక్కలు తీయిస్తాం. రాయల్టీ వివరాల లెక్కల కోసం మైనింగ్ అధికారులకు విన్నవిస్తాం.

Next Story