- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేతులెత్తేసిన ‘పెద్దాయన’!
ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీగా ఉన్న బోధన్ నిజాం దక్కన్ షుగర్స్ కథ ముగిసినట్టేనా? నష్టాల సాకుతో పదేళ్లుగా మూతపడ్డ పరిశ్రమ ఇక తెరుచుకునే అవకాశం లేదా? వందల ఎకరాల్లో ఉన్న ఫ్యాక్టరీ భూములు అన్యాక్రాంతం కావలసిందేనా?

దిశ, నిజామాబాద్ ప్రతినిధి: ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీగా ఉన్న బోధన్ నిజాం దక్కన్ షుగర్స్ కథ ముగిసినట్టేనా? నష్టాల సాకుతో పదేళ్లుగా మూతపడ్డ పరిశ్రమ ఇక తెరుచుకునే అవకాశం లేదా? వందల ఎకరాల్లో ఉన్న ఫ్యాక్టరీ భూములు అన్యాక్రాంతం కావలసిందేనా? అంటే ఇప్పుడు అలాంటి సంకేతాలే ఇస్తున్నారు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. ఎంపీగా గెలిపిస్తే వంద రోజుల్లో ఫ్యాక్టరీ తెరిపిస్తానని కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చి విఫలమయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీని తెరిపిస్తానని రెండేళ్ల క్రితం సాక్ష్యాత్తు ప్రస్తుత సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ప్రమాణం చేశారు. ఆ హామీని నమ్మిన ప్రజలు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని బోధన్ ఎమ్మెల్యేగా గెలిపించారు. కానీ ఫ్యాక్టరీని తెరిపించడంలో విఫలమైన పెద్దాయన.. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రైతులపైనే భారం వేయడం చర్చనీయాంశంగా మారింది.
జిల్లా ప్రజల ఆశలపై నీళ్లు
సుదర్శన్ రెడ్డి విజయం సాధించాక ఆయనకు మంత్రి పదవి దక్కాలని జిల్లా ప్రజలు కోరుకున్నారు. ఆయన మంత్రి అయితే షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తారని భావించారు. ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడంపై ‘దిశ’ సైతం పలుమార్లు కథనాలను ప్రచురించింది. ప్రజల ఒత్తిడితో ప్రభుత్వం సుదర్శన్ రెడ్డికి సలహాదారు పదవిని కట్టబెట్టింది. దీంతో షుగర్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ పై ప్రజల్లో ఆశలు చిగురించాయి. అయితే సోమవారం నిజామాబాద్ లోని ఐటీ హబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుదర్శన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజల ఆశలపై నీళ్లు చల్లాయి. చెరుకు పండించేందుకు రైతులకు సిద్ధంగా లేరని, అందుకే ఫ్యాక్టరీ తెరుచుకోవడం సాధ్యం కాదనట్టు ఆయన చేసిన వ్యాఖ్యలు రైతులపై నెపాన్ని నెట్టేలా ఉన్నాయని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఫ్యాక్టరీని సాధించుకునే సత్తా తనకు లేదని చెప్పలేక, తన అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
----------------------బాక్స్--------------------
‘దిశ’ ప్రశ్నలకు వెటకారపు సమాధానాలు
బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడంపై ‘దిశ’ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పని సుదర్శన్ రెడ్డి.. వెటకారంగా మాట్లాడారు. ఫ్యాక్టరీని తెరిపించాలంటే రైతులు చెరుకును పండించాల్సి ఉంటుందని, ‘దిశ’ యాజమాన్యం ముందుకొచ్చి ఇక్కడి రైతులతో చెరుకు పండించేలా చేయాలని పేర్కొన్నారు. అయితే మీడియా సమావేశంలో సుదర్శన్ రెడ్డి వ్యవహారశైలి కేసీఆర్ ను తలపించిందని మీటింగ్ లో పాల్గొన్న జర్నలిస్టులు చర్చించుకుంటున్నారు. గతంలో మింగుడుపడని ప్రశ్నలు వేస్తే కేసీఆర్ ‘నీది ఏ పేపర్? ఏ చానల్?.. రాస్కో.. కాస్కో’ అనేలా మాట్లాడేవారు. ఇప్పుడు అదే తరహాలో ‘దిశ’ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు.. సుదర్శన్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తూ.. వెటకారంగా మాట్లాడారని మీడియా సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు.






