- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతా.. సిండికేట్!..పసుపు రైతుల గోడు !
పసుపు రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర దక్కక కన్నీరు కారుస్తున్నారు.

అంతా.. సిండికేట్!
గిట్టుబాటు ధర దక్కించుకోలేక పోతున్న పసుపు రైతు
పెట్టుబడి కూడా దక్కడం లేదని ఆవేదన
ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పసుపు రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర దక్కక కన్నీరు కారుస్తున్నారు.. నెలల తరబడి సాగయ్యే ఈ పసుపు పంటను రైతు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పండిస్తే ఈ పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. మార్కెట్ మాయాజాలానికి, సిండికేటు వ్యాపారుల దెబ్బకు పసుపు రైతు దారుణంగా బలవుతున్నాడు. తెలంగాణలో పసుపుకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతు దీ(మౌ)నంగా రోదిస్తున్నాడు. పసుపు రైతులంతా ప్రతి సీజన్ లో ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారని, మా బాధలు పట్టించుకునే నాయకుడే కనిపించడం లేదని వారు నిందిస్తున్నారు. తమ దుస్థితిని తామే నిందించుకుంటున్నారు. దేశంలోనే పసుపు పండించే ప్రాంతాల్లో నిజామాబాద్ జిల్లా ముందు వరసలో ఉంటుంది. పసుపుకు దేశంలోనే కేరాఫ్ గా నిజామాబాద్ జిల్లా ఉండటంతో జాతీయ పసుపు బోర్డును కూడా కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ లోనే ఏర్పాటు చేసింది.
పసుపు బోర్డు ఏర్పాటుకు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి విశేషంగా కృషి చేశారు. ఆయన వల్లే నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటైంది. ఆ బోర్డుకు చైర్మన్ గా కూడా నిజామాబాద్ జిల్లా వాస్తవ్యుడినే కేంద్రం నియమించింది. ఇంత చేసినా ఎందుకో పసుపు రైతుకు ఆశించిన మేర ప్రయోజనం చేకూరడం లేదన్నది అక్షర సత్యం. ఆశించిన ధర రావడం లేదని రైతు బాధపడుతూనే ఉన్నాడు. విచ్చల విడిగా వ్యాపారులు పసుపు రైతులను ధరల పరంగా దగా చేస్తూనే ఉన్నారు. ప్రతిరోజు సగటున 50 వేల క్వింటాళ్ల పసుపు మార్కెట్ కు వస్తోంది. ఎన్నో ఆశలతో మార్కెట్ యార్డుకు పసుపు పంటను అమ్మకానికి తీసుకొచ్చిన రైతులను ధర తగ్గించి దగా చేసేందుకు వ్యాపారులు, ఏజెంట్లు గోతికాడ గుంటనక్కల్లా కాచుకుని కూర్చుంటున్నారని జగిత్యాల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన పలువురు రైతులు అంటున్నారు.
వ్యవసాయంలో అత్యంత క్లిష్టమైన, కష్టతరమైన పంట పాగు పసుపు పంటేనని, మిగతా పంటలతో పోలిస్తే సాగు కాలపరిమితితో పాటు కూలీల ఖర్చు, ఎరువుల ఖర్చు, ఇతరత్రా ఖర్చులు కూడా ఎక్కువేనని రైతులంటున్నారు. ఎకరా విస్తీర్ణంలో పసుపు పండించాలంటే కనీసం రూ. 80 నుండి రూ. 90 వేలకు పైగానే ఖర్చవుతుందని, పంట వేసింది మొదలు కోసే వరకు ఎనిమిది, తొమ్మిది నెలల పాటు చంటి బడ్డను కాపాడుకున్నట్లు పంటను కాపాడుకోవాల్సి ఉంటుందని రైతులంటున్నారు. ఇంత చేసి పసుపు ను పండించి మార్కెట్ లో పంటను అమ్ముకోవడానికి వెళితే అడ్డగోలు ధరలతో రైతులను నిండా ముంచుతున్నారని వాపోతున్నారు. మార్కెట్లో పసుపుకు దక్కుతున్న ధర ఏ మూలకు సరిపోవడం లేదని, పంటపై పెట్టిన పెట్టుబడి కూడా తిరికి రాబట్టుకునే పరిస్థితులు లేకుండా పోయాయని రైతులు వాపోతున్నారు.
పసుపు ధరల తగ్గుదలకు యుద్ధంతో వ్యాపారుల లింకు..
ఆడలేక మద్దెల ఓడిందన్న చందంగా పసుపు రైతులకు గిట్టుబాటు ధరను అందించే సోయి లేని కొందరు వ్యాపారులు అమాయక రైతులను నిండా ముంచుతున్నారు. పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం పేరు చెప్పి పసుపును అతి తక్కువ ధరకు రైతుల నుండి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయాలనే దురాలోచన చేస్తున్నారు. పసుపు రైతులను నిండా ముంచేసేందుకు పథకం ప్రకారం మార్కెట్ లో అనిశ్చితిని క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పసుపు రాశులతో అలరారుతున్న నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఎక్కడా చూసినా పసుపు కుప్పలు దర్శనమిస్తున్నాయి. గిట్టుబాటు ధర వస్తేనే అమ్ముదామనే ఆశతో కొందరు రైతులు కొద్ది రోజులుగా మార్కెట్ యార్డులోనే పసుపును రాశులుగా పోసి ఉంచారు. మంచి ధర కోసం ఎదిరి చూస్తున్నారు.
రైతులను ఆగం చేస్తున్న వాతావరణంలో మార్పులు..
వాతావరణంలో అనుకోకుండా చోటు చేసుకుంటున్‌న మార్పులు పసుపు రైతులను ఆగం చేస్తున్నాయి. అకాల వర్షం భయం రైతులను వెంటాడుతోంది. మార్కెట్ యార్డులో అమ్మకానికి తీసుకొచ్చి రాశులుగా పోసిన పసుపు కుప్పల పరిస్థితి వర్షం పడితే భారీగా నష్టపోయేలా ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షం భయంతో కొందరు ఎంత ధరొస్తే అంతకు అమ్ముకుంటున్నారు. ఓ పక్క రైతులను సిండికేట్ వ్యాపారులు నిండా ముంచుతుంటే ప్రకృతి కూడా పగబట్టి రైతులపై కక్ష గట్టినట్లుగా ఉందని రైతులంటున్నారు.
తాతల జమానాల పసుపు అమ్మి ఇంటికి బంగారం తెచ్చేవారు..
ఒకప్పుడు తాతలు, తండ్రుల జమానాలో రైతులు పండించిన పసుపు నిజామాబాద్ మర్కెట్ లో అమ్మడానికి తీసుకెళ్లి పసుపు అమ్మగా వచ్చిన డబ్బులతో బంగారం కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లే వారని కొందరు అంటున్నారు. పసుపు డబ్బులతో బంగారాన్ని కొన్నా, ఇంకా పసుపు డబ్బులు పెద్ద వాళ్లు చెపుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే బంగారం కొనుగోలు మాట దేవుడెరుగు ఇంట్లోని డబ్బులు పోగేసినా తులం బంగారం వచ్చే పరిస్థితి అంటారు.
సంప్రదాయ పంటకు సమస్యలే అధికం..
నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పండిస్తున్న పసుపు పంటకు సమస్యలే అధికంగా కనిపిస్తున్నాయి. వాటిని పరిష్కరించే వారు కానీ ఎక్కడా కనిపించడం లేదు. ఎంపీ అర్వింద్ తన బాడీ ఫిట్ గా ఉన్నానా అనే విషయాన్ని ధృవీకరించుకోవాల్సి ఉంది.






