- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్పంచ్ గిరి ముళ్ల కిరీటమే..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తే తప్పా గ్రామపంచాయతీలలో పాలన కొనసాగడం కష్టమే. దాదాపు అన్ని గ్రామ

కామారెడ్డి జిల్లాలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు పంచాయతీల ఆర్థిక పరిస్థితి గడ్డు సవాల్‌గా మారింది. మైనర్ గ్రామ పంచాయతీల్లో ఖజానా ఖాళీగా ఉండడంతో కనీసం ట్రాక్టర్ డీజిల్, వీధిదీపాల వంటి ప్రాథమిక అవసరాలకు కూడా నిధులు లేక బెంబేలెత్తే పరిస్థితి నెలకొన్నది. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి గెలిచిన సర్పంచులు, ఇప్పుడు కార్యాలయ ఫర్నిచర్, భవనాల మరమ్మతుల కోసం మళ్లీ సొంత డబ్బులే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పారిశుధ్య కార్మికుల పాత బకాయిలు, పెండింగ్‌లో ఉన్న రూ.15కోట్ల అభివృద్ధి నిధులు రాకపోవడంతో పదవి ‘ముళ్ల కిరీటం’లా మారిందని వారు ఆవేదన చెందుతున్నారు. పన్నుల వసూళ్లు నామమాత్రంగా ఉండడంతో ప్రభుత్వ ప్రత్యేక నిధులపైనే ఈ కొత్త సర్పంచులు ఆశలు పెట్టుకున్నారు. పారదర్శక పాలన అందిద్దామనుకున్న నేతలకు బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ఆర్థిక ఇబ్బందులు షాక్ గురి చేస్తున్నాయి.
దిశ, భిక్కనూరు : ఉత్సాహంగా ప్రమాణ స్వీకారం చేశా.. చేశాక తెలిసింది. బ్యాలెన్స్ నిల్ అని, ట్రాక్టర్ డీజిల్‌కి కూడా డబ్బులు లేని పరిస్థితి. ఏం చేస్తామో ఎట్లా చేస్తామో అంటూ కుర్చీ ఎక్కిన సర్పంచ్‌లు కొందరు నారాజ్‌గా కనబడిన పరిస్థితి ఇది. మొన్న జరిగిన ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిచామని, తీరా ఇక్కడికి వచ్చి చూస్తే గ్రామపంచాయతీల్లో డబ్బు లేని పరిస్థితి. ఇప్పటికే తోఫ్ తోఫ్ వయ్యా మనుకుంటే ఇక్కడ కూడా జేబులకు చిల్లులు పడుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు, దోమకొండ, మాచారెడ్డి, రాజంపేట, బీబీపేట మండలాల్లోని మైనర్ గ్రామపంచాయతీల్లో తాజాగా నెలకొన్న పరిస్థితి ఇది. కొన్నిచోట్ల భవనాలు కట్టినప్పటికీ, సున్నం రంగులు వేయించకపోవడం, సరైన ఫర్నిచర్ లేకపోవడం వల్ల కొత్తగా కొలువుదీరిన పాలకవర్గ సభ్యులు అప్పటికప్పుడు సొంత డబ్బు ఖర్చుచేసి ఫర్నిచర్ తెప్పించుకున్నారు. కొంతమంది గ్రామ సర్పంచులు ప్రమాణ స్వీకారానికి ముందే గ్రామాల్లో ఉన్న సెక్రెటరీలను కలిసి ఆర్థిక పరిస్థితి గురించి వాకబ్ చేయగా బ్యాలెన్స్ నిల్ అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఎం చేయాలో పాలుపోక కొందరు సర్పంచులు ఇన్ని ఖర్చు పెట్టుకొని ఈ కుర్చీలోకి వచ్చాం, ఇక చేసేదేముందంటూ సొంత డబ్బులు వెచ్చించి కావాల్సిన ఫర్నిచర్‌ను కార్యాలయానికి తెప్పించుకున్నారు. అంతే కాకుండా విద్యుత్ దీపాలను కూడా గ్రామాల్లో ఏర్పాటు చేయించారు. కొన్ని భవనాలకు సున్నం రంగులు వేయించి అందంగా ముస్తాబు చేయించి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత తెలిసింది పూల పాన్పు కాదు ఇప్పటికైతే ఈ పదవి ముళ్ల కిరీటమేనని... పన్నులు సరిగ్గా వసూల్లు కాక, ఆదాయం సరిగ్గా లేక ఐదేళ్లు ఎలా నెట్టుకొస్తామోనంటూ సర్పంచులు కొందరు వ్యాఖ్యానించడం కొసమెరుపు.
నిధుల మంజూరుపైనే ఆశలు...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తే తప్పా గ్రామపంచాయతీలలో పాలన కొనసాగడం కష్టమే. దాదాపు అన్ని గ్రామ పంచాయతీలలో సమస్యలు విలయతాండవం చేస్తుండడం, ముఖ్యంగా కోతుల నివారణ, దెబ్బతిన్న డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, కొత్తగా డ్రైనేజీ వ్యవస్థను నిర్మించడం, తాగునీటి ఎద్దడి నెలకొన్న ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి నెలకొన్నది. అంతేకాకుండా చాలా గ్రామాల్లోని కాలనీలలో తక్షణం వీధి దీపాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కొన్ని గ్రామాల్లో పేరుకుపోయిన మురుగును తొలగించేందుకు పారిశుధ్య కార్మికులు అవసరం ఉండడం, జీతాలు చెల్లించక పని మానేసిన కార్మికులకు బకాయిలు తిరిగి చెల్లించి విధుల్లో చేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పాత బకాయిలకే దిక్కులేదు...
పాలకవర్గాలకు రావాల్సిన పాత బకాయిలకే దిక్కులేదు. కొత్త సర్పంచులకు నిధులు మంజూరవుతాయన్న నమ్మకం లేకుండా పోయింది. 15వ ఫైనాన్స్, జనరల్ ఫండ్స్, ఎస్ఎఫ్‌సీ, మన ఊరు మన బడి కింద చేపట్టిన పనులకు సంబంధించి సుమారు రూ.15కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నాయి. ఈ మేరకు కొద్ది రోజుల కింద పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్‌ను కలిసి బకాయిల గురించి మాజీ సర్పంచులు అడిగారు. త్వరలోనే విడతల వారీగా పాత బకాయిలకు సంబంధించి నిధులు విడుదల చేస్తామని చెప్పారు. అప్పటినుంచి పాత బకాయిలు వస్తాయనే ఆశతో ఉన్న మాజీ సర్పంచులకు నేటి వరకు కూడా బకాయిలు రాలేదు.






