మూడు నెలలు గడుస్తున్నా అందని రైతు భరోసా నిధులు

by velandi.Saikiran |   (  Updated:2026-02-25 22:45:32  IST  )

యాసంగి సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడిచిపోతున్నా ఇప్పటి వరకు రైతు భరోసా నిధులు అందకపోవడంతో రైతన్న ఆందోళన చెందుతున్నాడు.

మూడు నెలలు గడుస్తున్నా అందని రైతు భరోసా నిధులు
X

రైతుకు ఏదీ భరోసా?

మూడు నెలలు గడుస్తున్నా అందని భరోసా నిధులు

డిసెంబర్ లోనే విడుదల కావాల్సిన డబ్బులు..

మున్సిపల్ ఎన్నికలతో జాప్యం...

15రోజులు దాటినా పడని డబ్బులు

ఎదురు చూపులు చూస్తున్న రైతన్న

దిశ, కామారెడ్డి : యాసంగి సీజన్ రైతు భరోసా కోసం అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. యాసంగి సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడిచిపోతున్నా ఇప్పటి వరకు రైతు భరోసా నిధులు అందకపోవడంతో రైతన్న ఆందోళన చెందుతున్నాడు. వాస్తవానికి డిసెంబర్లోనే ఈ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కాలేవు. మునిసిపల్ ఎన్నికల హడావుడిలో ప్రభుత్వం రైతు భరోసా గురించి పట్టించుకోలేదు. అయితే పంచాయతీ ఎన్నికలకు ముందే రైతు భరోసా డబ్బులు అందుతాయని రైతులు ఆశించారు. కానీ వారికి నిరాశే ఎదురైంది. పంచాయతీ ఎన్నికలు ముగిశాయి... అలాగే ఇటీవల మున్సిపల్ ఎన్నికలు కూడా ముగియడంతో ఇప్పటికీ రైతు భరోసా పడలేదు. దీంతో రానున్న మండల, జిల్లా పరిషత్ ఎన్నికల వరకైనా భరోసా నిధులు పడతాయా లేదా అనే చర్చ రైతుల్లో మొదలైంది.

రైతు భరోసా డబ్బులు సకాలంలో ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలు వేయడానికి ముందే గత ప్రభుత్వం పెట్టుబడి సాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేది. దీంతో రైతులు ఆ డబ్బులను డ్రా చేసుకొని పెట్టుబడికి వాడుకునేవారు. దీంతో రైతులకు ఎంతో కొంత పెట్టుబడి సాయం అందడంతో హర్షించేవారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం రెండు సీజన్లలో కూడా సరైన సమయానికి రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పంటలు వేసి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు రైతు భరోసా నిధులు జమ కాకపోవడంతో ప్రభుత్వం పై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

గత సీజన్ లోనూ ఆలస్యమే..

రైతులకు పెట్టుబడి సాయం అందించడంలో ప్రభుత్వం ఎప్పుడూ ఆలస్యమే చేస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏ సీజన్లో నూ సకాలంలో డబ్బులు విడుదల చేయడం లేదు. పెట్టుబడి సాయానికి ఏదో ఒక కారణం ఎదురవుతూనే ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంటలు వేసే సమయానికి ముందే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అయ్యేది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పుడు కూడా పంటలు వేసే ముందు రైతు భరోసానిధులు జమ చేసిన దాఖలాలే లేవని రైతులు అంటున్నారు.

ఎన్నికల సాకులు చెబుతూ దాటవేస్తున్న ప్రభుత్వం...

రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం ఎన్నికల సాకులు చెబుతూ తప్పించుకుంటుందని రైతులు ఆరోపిస్తున్నారు. డిసెంబర్ నెలలోనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయాల్సి ఉన్నప్పటికీ అప్పుడు పంచాయతీ ఎన్నికలను సాకుగా చూపుతూ నిధులు జమ చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత జనవరిలో జమ చేయాల్సి ఉండగా అప్పుడు మున్సిపల్ ఎన్నికలను మళ్లీ సాకుగా చూపుతూ జమ చేయలేదన్నారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు పూర్తయినప్పటికీ ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో భరోసా నిధులు పడకపోవడంతో మళ్లీ రానున్న మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను సాకుగా చూపుతూ ప్రభుత్వం తప్పించుకుంటుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికల కోడ్ అమలులో లేనప్పటికీ నిధులను జమ చేయడానికి ప్రభుత్వం ఎందుకు అలసత్వం వహిస్తుందో చెప్పాల్సిన అవసరం ఉందని రైతులు పేర్కొంటున్నారు.

జమకాని రూ.306కోట్ల భరోసా నిధులు

జిల్లాలో 4,05,000 ఎకరాల భూములు యాసంగి సీజన్లో సాగవుతున్నాయి. ఇందులో 3,03,568 మంది రైతులు వివిధ రకాల పంటలను పండిస్తున్నారు. అయితే వీరికి సుమారు 36కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం జమ చేయనున్న రైతు భరోసా నిధుల కోసం జిల్లాలోని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Next Story