- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సహజ వనరులను దోచేస్తున్నరు.. కనబడితే ఖాళీ చేస్తున్నారు..!
జిల్లాలో సహజవనరులైన ఇసుక, మట్టి, మొరం తవ్వకాలు ఏళ్ల తరబడి జరుగుతున్నా.. పట్టించుకున్నవారు లేరు.. ఆపేవారూ అసలే లేరు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతరుల అండ ఉండడంతో మండలస్థాయి అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

దిశ, నందిపేట: జిల్లాలో సహజవనరులైన ఇసుక, మట్టి, మొరం తవ్వకాలు ఏళ్ల తరబడి జరుగుతున్నా.. పట్టించుకున్నవారు లేరు.. ఆపేవారూ అసలే లేరు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతరుల అండ ఉండడంతో మండలస్థాయి అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. వారు కంట్రోల్ చేయకపోవడంతోనే ఇసుక, మట్టి, మొరం తవ్వకాలు ఎక్కువగా చేస్తున్నారు. విలువైన ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు చేస్తూ కోట్ల రూపాయల సంపదను పక్కదారి పట్టిస్తున్నారు. సహజ వనరులు కంటికి కనిపిస్తే చాలు మాయం చేసేందుకు అక్రమార్కులు బరితెగిస్తున్నారు. వాగుల్లో దొరికే ఇసుక, గుట్టల్లో లభ్యమయ్యే మొరం, జలాశయాల్లో కనిపించే నల్లమట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం వందల వాహనాల్లో కళ్లముందే అక్రమ రవాణా జరుగుతున్న సంబంధిత అధికార యంత్రాంగం లో ఇసుమంతైన చలనం ఉండడం లేదు. దీంతో మండలంలో అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది.
మండలంలోని తల్వేద వాగు నుంచి మాత్రం పగలే అక్రమార్కులు అందిన అక్కడికి ఇసుకను తీసి సొమ్ము చేసుకుంటున్నారు. పక్క శివారులోని నాలేశ్వర్ నుంచి కూడా ఇసుక తీస్తూ ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. అలాగే ఇతర జిల్లాల నుంచి అనుమతులు లేకుండా తీసుకొచ్చిన ఇసుకను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరివాహక గ్రామాల శివారులో నిల్వ చేస్తున్నారు. పెద్ద మొత్తంలో డంపులు పెట్టి సీజన్లో ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు అనధికారికంగా నిల్వ లు చేస్తున్నారు. అలాగే నందిపేట ఉమ్మడి మండలంలో గుట్టలు, పట్టా భూములు అని తేడా లేకుండా వ్యాపారులు మొరం దందా నిర్వహిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు పునాది భర్తీ కోసం అంటూ ఇతర అవసరాలకు మోరాన్ని తరలిస్తున్నారు. ఇదంతా గ్రామస్తాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్న అధికారులకు, సిబ్బందికి తెలియని విషయం కాదు. కానీ నిద్రమత్తును నటిస్తూ అక్రమ దందాకు పచ్చ జెండా చూపుతున్నారు. ఇక ఎస్సారెస్పీ శిఖం నుంచి నిత్యం వందలాది ట్రిప్పర్లు, టారస్సులు, డంపర్లు పరిమితికి మించి అతివేగంగా వెళ్తున్న అడ్డుకునే వారు లేరు. వాస్తవానికి రైతుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని పరిమితులకు లోబడి నల్ల మట్టిని వాహనాల్లో ఎక్కించాలని ఓవర్ లోడ్ తో ఓవర్ స్పీడ్ గా వాహనాలను నడిపి ప్రమాదాలకు అవకాశం ఇవ్వవద్దని ఉన్నత అధికారులు సూచించినప్పటికీ సిండికేట్ గా మారిన గుత్తేదారులు పెడచెవిన పెడుతున్నారు. కొన్ని రోజులు మాత్రమే అధికారుల ఆదేశాలు పాటించినట్లు నటించి మళ్లీ యధావిధిగా పరిమితి మించి మట్టిని వాహనాలు ఎక్కించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రశ్నించాల్సిన అధికారులు,
గ్రామ కమిటీలను మచ్చిక చేసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
పోలీసులు దాడులు చేస్తే గాని..
ఇటీవల తల్వేద వాగు నుంచి నాలుగు ట్రాక్టర్లు, నాలేశ్వర్ వాగు నుంచి నాలుగు ట్రాక్టర్లు, ఒక జెసిబి వాహనాన్ని సీజ్ చేశారు. ఇది జిల్లా సిపి సాయి చైతన్య ఆదేశాలతో 'చీతా' టీం దాడులు చేసి పట్టుకున్నారు. కానీ స్థానిక అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరించారు. అలాగే నల్ల మట్టి తరలింపు విషయంలోనూ అధికారుల ఉదాసీనత వల్ల వారానికి నాలుగైదు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రహదారిపై వాహనదారులను, కరెంటు స్తంభాలను ఢీకొట్టడం పరిపాటిగా మారింది. కానీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో సిబ్బంది అధికారులు ప్రేక్షకు పాత్ర వహిస్తున్నారు. నిత్యం రూ. పాతిక లక్షల విలువైన నల్ల మట్టి ని ఇతర ప్రాంతాలకు, ఇటుక బట్టీలకు తరలిస్తున్నప్పటికీ సరైన నిఘా లేకపోవడం విడ్డూరంగా మారింది. అధికారులు ఇలాగే నిద్రమత్తు నటిస్తే మండలంలోని మరిన్ని సహజ వనరులు ఖాళీ అవుతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.






