కుళ్లిన ఆహారం.. జర భద్రం

by velandi.Saikiran |   (  Updated:2026-02-24 22:45:50  IST  )

నిజామాబాద్ హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కుళ్లి పోయిన చికెన్, మాంసంతో తయారు చేసిన ఫుడ్ ను కస్టమర్లకు సర్వ్ చేస్తున్నారు.

కుళ్లిన ఆహారం.. జర భద్రం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కుళ్లి పోయిన చికెన్, మాంసంతో తయారు చేసిన ఫుడ్ ను కస్టమర్లకు సర్వ్ చేస్తున్నారు. ఆకలేసి సుష్టుగా బిర్యానీ తిందామని ఏదైనా హోటల్ కు వెళితే నాణ్యమైన, రుచికరమైన భోజనం దొరకడం కష్టంగా మారింది. ఎందుకంటే, నగరంలోని చిన్న, పెద్ద హోటల్స్ అనే తేడా లేకుండా కుళ్లిపోయిన చికెన్, మటన్ తో బిర్యానీ వండి పెడుతున్నారు. రెండు, మూడు రోజుల పాటు ఫ్రీజ్ లలో నిల్వ ఉంచిన మాంసాన్ని వండి వారుస్తున్నారు. ఒక్కోసారి ముక్క తినేటప్పుడు తేడా గమనించిన కొందరు హోటల్ యాజమాన్యాన్ని నిలదీసిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఫుడ్ ఇన్‌ స్పెక్టర్లు నిఘా లేకపోవడం. కార్పొరేషన్ అధికారుల పర్యవేక్షణ కొరవవడం కారణంగా నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో యధేచ్ఛగా నాణ్యత కరువైన బిర్యానీని వండి వడ్డిస్తున్నారు. గతంలో నగరంలోని ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కుళ్లిపోయిన మాంసాన్ని నిల్వ ఉంచిన హోటల్ యజయానులపైనా, వంట గదిలో బొద్దింకలు, ఇతర కీటకాలు ముసురుకోవడం, శుభ్రత పాటించకపోవడాన్ని గమనించిన అధికారులు వాటిపై కూడా కేసులు రాసారు. అయినప్పటికీ వారిలో మార్పు రావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆకలితో వెళ్లి తింటే కక్కుకోవాల్సిన పరిస్థితి..

నగరంలోని కొన్ని ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లలో భోజనం బాగా దొరుకుతుందని, ఆకలితో వెళ్లి తింటే కక్కుకోవాల్సిన పరిస్థితులెదురైన సందర్భాలున్నాయని పలువురు కస్టమర్లు మీడియా ప్రతినిధులకు చెప్పుకున్న దాఖాలాలున్నాయి. కొందరైతే ఏకంగా కార్పొరేషన్ అధికారులకు నేరుగా ఫోన్ చేసి నేరుగా రెస్టారెంట్లకే పిలిపించి అక్కడికక్కడే కేసులు నమోదు చేయించి ఫైన్లు కట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నగరంలోని ప్రముఖ రెస్టారెంట్లు, హోటల్స్ లలో కొంత కాలంగా కుళ్లిపోయిన మాంసాన్ని ఎక్కువగా వాడుతున్న విషయం బహిరంగ రహస్యమే అయినప్పటికీ అధికారుల పర్యవేక్షణ కరువవడం ప్రజలకు శాపంగా మారింది. మొక్కుబడిగా అధికారులు రైడ్ చేసి కేసులు నమోదు చేస్తున్నా, హాటల్ యాజమాన్యం మళ్లీ అధికారులను కలిసి ముడుపులు ముట్టజెప్పి కేసును కొట్టేయించుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఎప్పటి కప్పుడు ఫుడ్ నాణ్యతను పరిశీలించి సర్టిఫై చేయాల్సిన సదరు ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్, రెస్టారెంట్ వ్యాపారులతో కుమ్మక్కై నాణ్యతకు తిలోదకాలిస్తున్నారని, వారి ఉద్యోగ ధర్మాన్ని ముడుపుల సంస్కృతికి తాకట్టు పెడుతున్నారనే విమర్శలున్నాయి. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ప్రధాన పాత్ర పోషించాల్సిన అధికారులే ప్రజారోగ్యాన్ని గాలికొదిలేస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.

నాణ్యమైన ఫుడ్ కోసం అన్వేషించాల్సిందే..

ఇటీవలి కాలంలో దాదాపు ఎక్కువగా హోటళ్లలో నాణ్యమైన మాంసం, చికెన్ తో వండిన వంటకాలు అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది. నాణ్యమైన ఫుడ్ తినాలనే ఆసక్తి ఉన్న వారు ఎక్కువగా ఉన్నారు. డబ్బులు విచ్చల విడిగా ఖర్చు చేసైనా ఎంజాయ్ చేయాలనుకునే వారే ఎక్కువగా ఉన్నారు. ఫ్రీజ్ లో ఎక్‌కువ రోజలు నిల్వ ఉంచిన మాంసాన్నే వండుతున్నారని ఆయా హోటల్స్, రెస్టారెంట్లలో పని చేసే కొంత మంది సిబ్బందే చెపుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఫుడ్ ఇన్ స్పెక్టర్ లు స్థానికంగా లేకపోవడం కారణంగానే హోటల్స్ నిర్వాహకులు ఇష్టారీతిన నాసిరకంచికెన్, మాంసంతో వడ్డి వడ్డిస్తున్నారనే ఆరోపణలున్నాయి..

గతంలో కొన్ని కేసులు..

నగరంలోని ఎన్టీఆర్ బొమ్మ వద్ద ఉన్న ఓ ప్రముఖ రెస్టారెంట్లో కూడా శాఖాహార సంబంధిత ఫుడ్ లో గతంలో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసిన కస్టమర్ కు వెజ్ బిర్యా నీలో మాంసం ముక్కలు కనిపించడంతో ఈ విషయాన్ని సదరు కస్టమర్ మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దాంతో అధికారులు ఆ రెస్టారెంట్ కు వెళ్లి తనిఖీలు నిర్వహించి రెస్టారెంట్ యాజమాన్యానికి అధికారులు ఫైన్ వేశారు. మరోసారి ఇలాగే జరిగితే రెస్టారెంట్ సీజ్ చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా ఇక్కడి పరిస్థితిలో మార్పు రాలేదు. రెస్టారెంట్ పై ఎలాంటి స్‌ట్రాంగ్ చర్యలు కూడా తీసుకోలేరు.

నగరంలో కుళ్లిపోయిన చికెన్ ఫుడ్ మామూలేనట..!

నిజామాబాద్ నగరంలో నాణ్యమైన నాన్ వెజ్ ఫుడ్ దొరకడమంటే కష్టమవుతోందనే అభిప్రాయాలతో పాటు నాసిరకం ఫుడ్ అన్ని చోట్లా మామూలేననే సర్దుబాటు అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన అధికారులే నిమ్మకు నీరెత్తినట్లుంటే ఆకలితో హాటల్స్, రెస్టారెంట్లకు వెళ్లే కస్టమర్ ఇవేమీ ఆలోచించే ఓపిక ఉండదని చెపుతున్నారు. ఆకలి రుచెరగదు.. నిద్ర చోటెరగదన్న చందంగా ఆకలి మంటలో రుచిని మాత్రమే పట్టించుకున్న కస్టమర్ల ఆరోగ్యాలు ప్రమాదంలో ఉన్నాయన్న విషయాన్ని మరిచిపోతున్నారు.

నగరంలోని చాలా హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన దాడుల్లో ఆహార భద్రతా నియమ ఉల్లంఘనలు, నాసిరకం ఆహార పదార్థాల వాడకం వంటివెన్నో అధికారుల తనిఖీలలో గుర్తించిన దాఖలాలున్నాయి. బూజు పట్టిన చికెన్, అధిక మోతాదులో రసాయనాల మిక్సింగ్ చేసి వండిన వంటకాలను అధికారుల తనిఖీలో వెలుగు చూశాయి. అయినప్పటికీ ఏ హోటల్ కానీ, రెస్టారెంట్ కానీ మార్పుకోసం ప్రయత్నించడం లేదంటే డబ్బు సంపాదన కోసం మనిషి ఎంతకు దిగ జారుతున్నాడో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

Next Story