సారూ.. మీ వెనకాల ఏం జరుగుతుందో.. జర్రంత సోంచాయించుండ్రి

by Naveena |

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు రెగ్యులర్ కమిషనర్ ఉన్నా.. కమీషన్ రాయుళ్లదే హవా కొనసాగుతోంది. దీంతో కార్పొరేషన్ ఎవరి కంట్రోల్ లో నడుస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సారూ.. మీ వెనకాల ఏం జరుగుతుందో..  జర్రంత సోంచాయించుండ్రి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ మార్చి 05: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు రెగ్యులర్ కమిషనర్ ఉన్నా.. కమీషన్ రాయుళ్లదే హవా కొనసాగుతోంది. దీంతో కార్పొరేషన్ ఎవరి కంట్రోల్ లో నడుస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కార్పొరేషన్ కు బాస్ అనే వారొకరున్నారనే స్పృహ కూడా లేకుండా అంతా తామై వ్యవహరిస్తున్న కొందరు అధికారులు వారి అడుగులకు మడుగులొత్తే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవహార శైలిపై తీవ్‌ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేషన్ లో అవినీతి తిమింగలాల్లా పాతుకుపోయిన కొందరు ముదురు ఆఫీసర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, కమిషనర్ ను ఏమాత్రం లెక్కచేయకుండా ఆయనను డమ్మీని చేసే ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కార్పొరేషన్ ఉద్యోగులు, సిబ్బంది పట్ల మెతకగా వ్యవహరిస్తున్న కమిషనర్ మంచితనాన్ని ఆయన చేతకాని తనంగా భావిస్తూ తమ ఆటలు సాగించుకుంటున్నారని కార్పొరేషన్ లోని కిందిస్థాయి ఉద్యోగులు పలువురు పేర్కొంటున్నారు. బల్దియాలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన కొందరు అధికారులు తమకున్న రాజకీయ అండతో కమిషనర్ ను సైడ్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అధికారులు కార్పొరేషన్ లో ఇష్టారీతిగా వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. కార్పొరేషన్ లోని అన్ని విభాగాల మీద కమిషనర్ కు పూర్తిగా అవగాహన లేదని, అన్నీ తామే చూస్తున్నామని ఓపెన్ గా మాట్లాడుతున్నారని చెప్పుకుంటున్నారు. కమిషనర్ పై పనితీరుపై వ్యతిరేక ప్రచారం చేస్తూ ఆయన స్థాయిని కావాలనే తగ్గిస్తున్నారని చెపుతున్నారు.

తన వెనకేం జరుగుతుందో పట్టించుకోని కమిషనర్..

కార్పొరేషన్ లో తన వెనకాల ఏం జరుగుతుందో పట్టించుకోకుండా కమిషనర్ తన పని తాను చేసుకుంటూ పోతున్నారే తప్ప కార్పొరేషన్ లోని ఏయే విభాగాల్లో ఏం జరుగుతుందో పట్టించుకోవడం లేదని కొంతమంది ఉద్యోగులు చెపుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కమిషనర్ పై అలుసుగా మాట్లాడుతున్నారని తెలుస్తోంది. తన దృష్టికి వచ్చిన కొన్ని విషయాలపై సంబంధిత విభాగాల అధికారులను విచారణ చేసి నివేదిక ఇవ్వాలని పురమాయిస్తున్నా వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. కమిషనర్ ఫాలో అప్ చేయకుండా పూర్తిగా వారిపైనే వదిలేయడంతో ఎవరేం చేస్తున్నారనే విషయాలను పట్టించుకోవట్లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కార్పొరేషన్ లోని అవినీతి అధికారుల ఆటలు కొనసాగుతున్నాయని కార్పొరేషన్ ఉద్యోగులే అంటున్నారు.

ప్రతిరోజు టార్గెట్ రూ. 50 వేలు..

ప్రతిరోజు కనీసం ఓ రూ. 50 వేలైనా టార్గెట్ రీచ్ కానిదే కార్పొరేషన్ గేటు దాటి ఇంటికి వెళ్లకూడదనే లక్ష్యంతో పని చేస్తున్న కొందరు అధికారులు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందిని తమకు అనుకూలంగా మలుచుకున్నట్లు చెపుతున్నారు. వారి దృష్టి అంతా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పనులపై కేంద్రీకృతమైందని అంటున్నారు. వారి అసలు మిషన్ వాటి పైన పని చేయడమేనని తెలుస్తోంది. కమిషనర్ నామ్ కే వాస్తేగా, ఫైళ్లపై సంతకం చేయడానికి మాత్రమే ఉంటాడని, అంతా చేసేది మేమే నంటూ కమిషనర్ స్థాయిని తగ్గించేలా ప్రచారం చేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు.. మమ్మల్ని కాదని క్లయింట్లు నేరుగా కమిషన్ దగ్గరికి వెళితే ఏదో ఒకటి చెప్పి ఆ ఫైల్ ను ముందుకెళ్లకుండా ఆపేస్తామంటూ క్లయింట్లను బెదిరిస్తున్నారని పలువురు వాపోతున్నారు. ఫైరవీ కారులు కూడా పలు మార్లు వీరి వ్యవహారంతో ఇబ్బందులెదుర్కొంటున్నట్లు చెపుతున్నారు.

ఓ వివాదాస్పద ప్రాపర్టీ విషయంలో..

నగరంలోని ఓ వివాదాస్పద ప్రాపర్టీ మ్యుటేషన్ విషయంలో అధికారితో ఇటీవల ఓ క్లయింట్ బేరమాడిన వ్యవహారాన్నంతా అధికారికి తెలియకుండా వీడియో తీసినట్లు సమాచారం. ఈ వీడియోను ఆధారంగా పెట్టి సదరు అధికారిని పులికి కుక్కను మేతగా వేసినట్లు అధికారిని ఏసీబీకి మేతగా వేస్తానని బెదిరించినట్లు కార్పొరేషన్ లో చెప్పుకుంటున్నారు. ఈ విషయం తెలియడంతో బెదిరిపోయిన సదరు అధికారి ఎంతో కాలంగా పెండింగులో ఉన్న ఆ ఫైల్ ను అప్పటి కప్పుడు క్లియర్ చేసి పని పూర్తి చేయించాడని తెలిసింది. ఈ కేసులో పని చేయించుకున్న క్లయింట్ ఇష్టంతో డబ్బులిచ్చినా తీసుకోకుండా రికార్డు చేసిన వీడియోను బతిమాలి తీసుకున్నట్లు సమాచారం. కార్పొరేషన్ లో ఇంతలా వ్యవహారాలు జరుగుతున్నా కమిషనర్ దాకా చేరకుండా కార్పొరేషన్ ఉద్యోగులను సిబ్బందిని మేనేజ్ చేసుకుంటూ వ్యవహారం నడిపిస్తున్నారని గుసగుసలాడుతున్నారు.

ఆదాయం వచ్చే పోస్టులోకి మార్చేందుకు బేరాలు..

కార్పొరేషన్ లో వివిధ విభాగాల్లో పని చేస్తున్న కింది స్థాయి ఉద్యోగుల్లో కొందరు తమకు లాభదాయకంగా ఉండే విభాగాల్లోకి వెళ్లేందుకు సదరు అధికారిని సంప్రదించి బేరాలు మాట్లాడుకుంటున్నట్లు సమాచారం. ఏదోలా చేసి తనను ఫలానా పోస్టులోకి మార్చాలంటూ ఆ అధికారిని వేడుకునే వారు క్యూ కడుతున్నారని తెలుస్తోంది. తను రిటైరయ్యేలోపు అందరి పనులు చేసి పెడతానని హమీ కూడా ఇస్తున్నారని, బేరాలు కూడా ఫిక్స్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఫిక్స్ చేసిన సొమ్ము పూర్తిగా చేతిలో పడనిదే ఆయన ఏ పని చేయడనే విషయం తెలిసిన వారు ముందుగానే మాట్లాడుకున్న బేరం డబ్బులు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. సాయంత్రం 5 గంటలు దాటగానే రాత్రి 9 గంటలైనా ఆఫీసులోనే ఉండి వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. కొద్ది నెలల క్రితం కార్పొరేషన్ రెవెన్యూ అధికారి నరేందర్ భారీ మొత్తంలో అవినీతి సొమ్ముతో ఏసీబీ కి పట్టుబడిన సంఘటనను కూడా కార్పొరేషన్ ఉద్యోగులు, అధికారులు మరిచిపోయినట్లున్నారు. ఎవరిలోనూ ఏసీబీ భయం మచ్చుకు కూడా కనిపించడం లేదు.

Next Story