సిద్ధరామేశ్వరాలయం సిబ్బంది చౌర్య ‘సిద్ధుల’యిన సమయం..!

by Bhanu |   (  Updated:2025-04-29 12:59:23  IST  )

భక్తి, భయం, భజనలు… ఇవన్నీ భిక్కనూరులోని సిద్ధరామేశ్వరాలయంలో భక్తులకే. కానీ అక్కడి కొందరు సిబ్బందికి మాత్రం “నోట్ల కట్టలు ఎక్కడున్నాయ్?” అనేదే భక్తి మార్గం..!

సిద్ధరామేశ్వరాలయం సిబ్బంది చౌర్య ‘సిద్ధుల’యిన సమయం..!
X

దిశ, భిక్కనూరు: భక్తి, భయం, భజనలు… ఇవన్నీ భిక్కనూరులోని సిద్ధరామేశ్వరాలయంలో భక్తులకే. కానీ అక్కడి కొందరు సిబ్బందికి మాత్రం “నోట్ల కట్టలు ఎక్కడున్నాయ్?” అనేదే భక్తి మార్గం..! వారం రోజుల క్రితం జరిగిన హుండీ లెక్కింపులో అసలైన “లెక్కలు” బయటపడ్డాయి. ఆలయ సిబ్బందిలోని నారాయణ అనే ఉద్యోగి, లెక్కింపు టేబుల్ పై ఉన్న ఐదు వందల నోట్ల రెండు కట్టల్లో రెండు నోట్లపై ప్రేమ చూపించాడు. జేబులో పెట్టుకునే ముందు గుడిలోనే పవిత్రంగా పనిని పూర్తి చేయాలనుకున్నాడో ఏమో, కానీ ఆ చేతివాటం ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ అందె మహేందర్ రెడ్డి కంట పడింది. వెంటనే వెనక వెళ్లి పట్టుకొని, “ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టి వెళ్లి, మళ్లీ కనిపించకు” అంటూ గట్టిగానే మందలించాడు.

దాంతో మన నారాయణ తను తీసిన నోట్లను తిరిగి టేబుల్ పై ఉంచేశాడు. కాని హుండీ లెక్కింపు పూర్తయ్యేలోపు అక్కడే ఉండొద్దు అంటూ బయటకు పంపారు. ఈ విషయం ఆలయ ఈఓ పద్మ శ్రీధర్ దృష్టికి తీసుకెళ్లగా, నారాయణకి మెమో జారీ చేసి సమాధానం కోరారు. ఇక ఇదంతా చూస్తుంటే... ఆలయంలో "చేతులు జోడించేవారు" కన్నా "చేతులు జేబుల్లో వేసేవారు" ఎక్కువగా కనిపిస్తున్నారు..!

చిన్న దొంగతనం కాదు.. చిత్తరువుగా ధర్మాన్ని కొట్టేస్తున్నారు

ఈ ఆలయంలో ఇదే తొలిసారి కాదు. ఇదే నారాయణకు ముందు సత్యనారాయణ అనే మరో సిబ్బంది హుండీ నుంచి దొంగతనానికి పాల్పడినందుకు సస్పెండ్ అయ్యాడు. ఆలయంలో రాత్రివేళ గల్లా పెట్టెలు బోర్లేసి నగదు తస్కరించడం, అయస్కాంతం వేసి చిల్లర వేట చేయడం వంటి సంఘటనలు ఆలయ చరిత్రలో భాగమైపోయాయి. ఒకసారి ఓ భక్తుడు స్వామివారికి వేసిన నోట్ల హారం కొద్దిసేపటిలో మాయమవ్వడంతో ఆలయం అంతా హాట్ టాపిక్ అయింది. భక్తుడు అక్కడే గొడవ చేసినా… “ఇలా జరిగేది మామూలే” అనే స్వరం వినిపించిందట!

రసీదు బుక్కులు మాయం.. సేవా బుక్కులు జేబులో

ప్రత్యేక పూజల రసీదుల బుక్కులను మాయం చేసి డబ్బులు చమురు బాటిల్ లోపలా దాచినట్లు జేబుల్లో పెట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి. అన్నదానానికి ఇచ్చిన డబ్బులు కూడా నిజమైన అన్నదానంలో కాదు, సిబ్బంది నాన్-వెజ్ విరామాల్లో కనిపిస్తున్నాయట..! దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విచారణలు జరిగినా, సరైన ఆధారాలు లేనివారికి షోకాస్ నోటీసులు, స్పష్టమైన ఆధారాలు ఉన్నవారికి సస్పెన్షన్లు వచ్చాయి. కానీ ఇవన్నీ కూడా పాఠాలు కాకుండా, “ఇంకెప్పుడు పట్టుకుంటారో” అనే ఆటలా మిగిలిపోయాయి.

సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ... చేతులు స్మార్ట్‌గా కదులుతున్నాయి!

ఆలయంలోని సీసీ కెమెరాలు ఉన్నా, దొంగతనానికి అవి అడ్డుకావడం లేదు. చేతుల మాయలో, మనసుల యోచనలో దాగిపోయిన భక్తి ఇప్పుడు కేవలం ఫారాలిటీ. దేవుని ముందు చేతులు జోడించేవాళ్లు, అదే చేతులతో నోట్ల కట్టలు తాకుతున్నారంటే... అది భక్తితో కాదు, ప్రాక్టీస్ తో!


Next Story