డబ్బులు ఉంటేనే టిక్కెట్టా..? వారికి విలువే లేదా..?

by Ratna Kumari |

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సాధార‌ణంగా స్థానిక ఎన్నిక‌ల్లో ఎవ్వ‌రికీ టికెట్లు కేటాయిస్తున్నారో అర్థం కానీ ప‌రిస్థితి నెల‌కొంది. ఎన్నో సంవ‌త్స‌రాల

డబ్బులు ఉంటేనే టిక్కెట్టా..? వారికి విలువే లేదా..?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సాధార‌ణంగా స్థానిక ఎన్నిక‌ల్లో ఎవ్వ‌రికీ టికెట్లు కేటాయిస్తున్నారో అర్థం కానీ ప‌రిస్థితి నెల‌కొంది. ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి పార్టీని న‌మ్ముకున్న వారికి టికెట్ రావ‌డం లేద‌ని కొంద‌రూ వాపోతున్నారు. కొంద‌రికీ రిజ‌ర్వేష‌న్ల పుణ్య‌మా అని పోటీ చేసేందుకు అవ‌కాశం ల‌భిస్తే.. డ‌బ్బులు అడ్డుగోడ‌గా మారుతున్నాయి. పార్టీ టికెట్ కోసం నోరు తెరిచి అడిగితే డబ్బులెన్ని డిపాజిట్ చేస్తావ్.. ఎలక్షన్ లో ఎన్ని లక్షలు ఖర్చు చేస్తావని ముఖం మీదే ప్రశ్నిస్తూ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉత్సాహంపై నీళ్లు జల్లుతున్న పరిస్థితి నెల‌కొంది. ముఖ్యంగా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీలో ఎదురవుతోందని కష్టకాలంలో కాంగ్రెస్ జెండాను భుజాన నేసుకుని దించకుండా పార్టీకి సేవ చేసిన కార్యకర్తలు, గ్రామస్థాయి నాయకులు వాపోతున్నారు. డబ్బులుంటేనే పోటీలో నిలబడే ఆలోచన రావాలని.. లేదంటే ఎప్పటిలాగే కార్యకర్తలా ఉండి జెండా మోస్తూ పార్టీ లో కొనసాగాల్సిందేనని తెగేసి చెపుతున్న పరిస్థితిని జిల్లాలోని పలు గ్రామాల్లో కార్యకర్తలు జీర్ణించుకోలేని సమస్యగా మారింది.

ఈ విషయం నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు వెళ్లడంతో బాల్కొండ నియోజకవర్గంలోని ఓ నేత మండల, పట్టణ అధ్యక్షులుగా గట్టిగానే గడ్డి పెట్టినట్లు స‌మాచారం. భీమ్‍ గల్ మండలంలోని ఓ మేజర్ గ్రామపంచాయతీకి చెందిన ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తన గ్రామంలో ఎంపీటీసీ స్థానం తనకు అనుకూలంగా రిజర్వ్ కావడంతో పోటీ చేసేందుకు ఆసక్తిని కనబరిచాడు. టికెట్ కోసం మండల పార్టీ అధ్యక్షుడితో పాటు పార్టీలో యాక్టివ్ గా ఉన్న మరో పట్టణ స్థాయి నాయకుడిని కలిసి టికెట్ కోసం అడిగితే డబ్బులెన్ని ఉన్నాయంటూ చులకనగా ప్రశ్నించడంతో ఆవేధనకు గురైన సదరు కార్యకర్త రాష్ట్రస్థాయిలో ఓ కార్పొరేషన్ కు చైర్మన్ గా ఉన్న నేతకు ఫిర్యాదు చేశారు. భీమ్‍గల్ మండలంలోని ఓ గ్రామంలో దుర్గాదేవి శోభాయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన సదరు నేత పార్టీలో ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకునే అధికారం మీకెవడిచ్చారంటూ మండల కాంగ్రెస్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులపై పలువురు కార్యకర్తలు, నాయకుల ముందే ఫైర్ అయ్యారు. డబ్బులున్నోడే పోటీలో ఉండాలి. వారికే టికెట్ ఇస్తామంటే.. ఇన్నేళ్లు కష్టకాలంలో కూడా పార్టీకి అండగా ఉన్న వారిని కూడా అవకాశం వచ్చినపుడు ఆదరించకపోతే ఎలా ? అంటూ తీవ్ర స్వరంతోనే మందలించారు. డబ్బుల్లేని పార్టీ విధేయులను ఎలా గెలిపించుకోవాలో పార్టీకి తెలుసు అని సదరు నేత గట్టిగానే చెప్పారు. మమ్మల్ని సంప్రదించకుండా, మాకు తెలియకుండా అనవసర రాజకీయాలు చేస్తే తాట తీస్తానన్న రీతిలో హెచ్చరించారు. ఇది పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది.

Next Story