- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇమ్మడి గోపి హత్య కేసులో ఏడుగురు నిందితుల అరెస్ట్
జిల్లాలో సంచలనం రేపిన సీనియర్ కాంగ్రెస్ నేత ఇమ్మడి గోపి హత్య కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో సంచలనం రేపిన సీనియర్ కాంగ్రెస్ నేత ఇమ్మడి గోపి హత్య కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి గోపికి సొంత మేనల్లుడు (అక్క కొడుకు) దగ్గి సతీష్ (ఏ1) తో పాటు మరో ఆరుగురు నిందితులు చిన్నరెడ్డి సంతోష్ రెడ్డి (ఏ2) , కొండ శ్రీధర్ (ఏ3), కొండ రవికుమార్ (ఏ4) అల్లకొండ నర్సయ్య (ఏ5), బండోల్ల దేవెందర్ (ఏ6), కొంపల్లి ప్రశాంత్ (ఏ7) లు గోపి హత్య కేసులో నిందితులుగా పోలీసులు నిర్ధారించారు. శనివారం వీరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. జిల్లాలో తీవ్ర సంచలనం రేపిన ఇమ్మడి గోపి హత్య కేసుకు సంబంధించిన వివరాలను ఇందల్వాయి ఎస్ ఐ సందీప్ శనివారం సాయంత్రం ఓ ప్రెస్ నోట్ ద్వారా మీడియాకు వెల్లడించారు. ఆయన వెల్లడించిన ప్రకారం కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
గోపి హత్యకు కారణాలివే..
కేసులో ప్రధాన (ఏ1) నిందితుడు ఇందల్వాయి మండలం గౌరారం గ్రామపంచాయతీ పరిధిలోని శివారు గ్రామం లింగాపూర్ కు చెందిన దగ్గి సతీష్ తన మేనమామ ఇమ్మడి గోపితో కొన్నేళ్లుగా కుటుంబ తగాదాలు, భూ తగాదాలతో పాటు రాజకీయ విభేదాలు కూడా ఉన్నాయి. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల సమయంలో కూడా వీరిద్దరి మధ్య ఉన్న వివాదాలు మరింత తీవ్రరూపం దాల్చాయి. తన స్నేహితులు కొండ శ్రీధర్, కొండ రవికుమార్, బండోళ్ళ దేవేందర్, అల్లకొండ నర్సయ్య, కోమన్ పల్లి ప్రశాంత్ ల విషయాల్లో కూడా తన మేనమామ గోపి జోక్యం చేసుకొని వారిని కూడా ఇబ్బంది పెడుతున్నాడనే అభిప్రాయంతో నిందితుడు దగ్గి సతీష్ తన మామ గోపిని తన స్నేహితులతో కలిసి హతమార్చాలని పథకం వేశాడు. ఈ విషయాన్ని సతీష్ తన స్నేహితులతో చెప్పగా వారు కూడా సతీష్ వేసిన పథకానికి అంగీకరించారు. దీంతో వీరందరూ కలిసి సతీష్ నేతృత్వంలో ఇమ్మడి గోపిని ఎలా చంపాలనే విషయంలో పక్కాగా స్కెచ్ వేశారు.
తనను చంపేస్తాడనే భయంతోనే గోపి హత్యకు పథకం..
తన మేనమామ ఇమ్మడి గోపి తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడంటూ సతీష్ కొన్ని రోజుల క్రితం లింగాపూర్ గ్రామానికి చెందిన చిన్నరెడ్డి సంతోష్ రెడ్డి దగ్గరకు వెళ్లి గోడు వెల్లబోసుకున్నాడు. గోపి తనను చంపక ముందే గోపిని కారుతో గుద్ది తనే చంపేస్తానని, ఏదైనా ఉంటే చూసుకోవాలని సంతోష్ రెడ్డిని సతీష్ కోరాడు. అంతా నేను చూసుకుంటానని సతీష్ కు సంతోష్ రెడ్డి నుండి భరోసా ఇవ్వడంతో తన మేనమామ ఇమ్మడి గోపిని చంపేందుకోసం సతీష్ స్కెచ్ వేశాడు. అవకాశం కోసం ఎదిరి చూస్తున్న సతీష్, అతడి స్నేహితులు ఈ నెల 11 న రాత్రి సమయంలో తమ ప్లాన్ ను పక్కాగా అమలు చేశారు. ఆ రోజు రాత్రి గౌరారం గ్రామ పంచాయతీ వద్ద ఇమ్మడి గోపి కారు కనిపించడంతో నిందితులు అక్కడ కాపు కాశారు. అక్కడి నుండి గోపి తన కారులో బయలు దేరి లింగాపూర్ వైపు వస్తుండగా సతీష్ తన కారుతో ఎదురుగా వెళ్లి గోపి కారును బలంగా ఢీకొట్టాడు. జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టి గోపి కారులో నుండి దిగి పారిపోయేందుకు ప్రయత్నించగా ఈ కేసులో నిందితులైన చిన్నరెడ్డి సంతోష్ రెడ్డి (ఏ2) , కొండ శ్రీధర్ (ఏ3), కొండ రవికుమార్ (ఏ4) అల్లకొండ నర్సయ్య (ఏ5), బండోల్ల దేవెందర్ (ఏ6), కొంపల్లి ప్రశాంత్ (ఏ7) లు గోపిని అడ్డుకుని కత్తులతో దాడి చేశారు. దీంతో గోపికి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన తరువాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారని ఎస్ఐ సందీప్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
నిందితులు ఎలా పట్టుబడ్డారు?
ఇందలవాయి పోలీస్ స్టేషన్ ఎదురుగా నిజామాబాద్ వైపు వెళ్ళే రహదారిపై పోలీస్ సిబ్బంది శనివారం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నిందితులు కారులో నిజామాబాద్ వైపు వెళుతూ పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేశారని, వెంటనే పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారని ఎస్ఐ వివరించారు. పోలీసుల విచారణలో నిందితులు వారు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారన్నారు. తర్వాత నిందితులు చూపించిన ఆధారాల మేరకు హత్యకు ఉపయోగించిన రక్తపు మరకలు ఉన్న ఒక కమ్మ కత్తి , రక్తపు మరకలు అంటిన నిందితుల బట్టలు, నిందితుల కు సంబంధించిన ఏడు సెల్ ఫోన్ లు, ఒక స్ప్లెండర్ ప్లస్ మోటార్ బైక్, నిందితులు హత్యానంతరం పారిపోవడానికి ఉపయోగించిన కారు పంచనామా నిర్వహించి సీజ్ చేసినట్లు ఎస్ఐ సందీప్ పేర్కొన్నారు. అనతరం చట్టపరంగా నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు.






