అధికారుల ఒత్తిడితో డిపో ముందు ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

by Bhanu |

బాన్సువాడ ఆర్టీసీ డిపో వద్ద ఘోర ఘటన చోటుచేసుకుంది. గంగాధర్ అనే డ్రైవర్ మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

అధికారుల ఒత్తిడితో డిపో ముందు ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
X

దిశ: బాన్సువాడ : బాన్సువాడ ఆర్టీసీ డిపో వద్ద ఘోర ఘటన చోటుచేసుకుంది. గంగాధర్ అనే డ్రైవర్ మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే సంఘటనను గమనించిన సహచర ఉద్యోగులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి అతన్ని బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స అందుతోంది.డ్రైవర్ గంగాధర్ మాట్లాడుతూ, తన అనారోగ్యం కారణంగా సెలవు తీసుకోవాలని డిపో మేనేజర్‌ను కోరినప్పటికీ, మేనేజర్ సంతకం చేయకపోవడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యానని వివరించాడు. “అనారోగ్యంగా ఉన్నా బలవంతంగా డ్యూటీ చేయడం వల్ల ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉంది. ఒత్తిడిలో విధులు నిర్వహించడం వల్ల తటస్థించలేని పరిణామాలు చోటుచేసుకోవచ్చు” అని అతను వ్యాఖ్యానించాడు. ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని, సహానుభూతితో స్పందించాలని గంగాధర్ కోరాడు.

తీవ్ర అభ్యంతరాలకు లోనవుతున్న మరో అంశం, ఓ టీ.ఐ.2 అప్రెంటిస్ ఉద్యోగిపై పలు ఫిర్యాదులు ఉన్నప్పటికీ అతన్ని కొనసాగించడం. అంతేకాదు, ఓటీ డబ్బులు వచ్చే డ్యూటీలు కేవలం కొందరికి మాత్రమే ఇవ్వడం వల్ల ఇతర ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. "అందరికీ సమాన అవకాశం ఇవ్వాలి" అంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.

డిపో మేనేజర్ స్పందన

ఈ నేపథ్యంలో డిపో మేనేజర్ సరితా దేవి స్పందిస్తూ, “డ్రైవర్ గంగాధర్ సెలవు కావాలని తన దగ్గరకు వచ్చాడు. నేను అతన్ని సెక్షన్ ఇంచార్జ్ దగ్గరకు వెళ్లమని మాత్రమే సూచించాను. అతనికి ఇబ్బంది పెట్టిన ప్రసక్తే లేదు” అని వివరణ ఇచ్చారు.


Next Story