- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి..
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించబడిన ఘటన ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన తీవ్రమైన దాడిగా భావిస్తున్నామని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆరోపించారు.

దిశ, కామారెడ్డి: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించబడిన ఘటన ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన తీవ్రమైన దాడిగా భావిస్తున్నామని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్న బీజేపీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే కుట్రలను వరుసగా కొనసాగిస్తోందని విమర్శించారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ఘటన బీజేపీ రాజకీయ కుట్రలకు పరాకాష్టగా నిలిచిందని అన్నారు. ఓటర్ల జాబితాల నుంచి పేర్లు తొలగించడం, దొంగ ఓట్లను నమోదు చేయడం, ప్రజాప్రతినిధులను అక్రమంగా చేర్చుకోవడం వంటి చర్యలు బీజేపీ రాజకీయాల్లో సాధారణంగా మారాయని ఆయన ఆరోపించారు.
తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఆవేదన...
ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ కూడా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందనే అనుమానాలు ప్రజల్లో బలపడుతున్నాయని పేర్కొన్నారు. మొన్నటి వరకు ఓట్లను చోరీ చేసిన బీజేపీ, ఇప్పుడు ఏకంగా రాజ్యసభ సీట్లను కూడా చోరీ చేసే స్థాయికి చేరుకుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారతదేశంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ పరిరక్షకులు, సామాజిక సంస్థలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల హక్కులను హరించే, రాజ్యాంగ వ్యవస్థను బలహీనపరిచే ప్రతి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు తీసుకువెళ్తుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, రాజ్యాంగాన్ని బతికించేందుకు, ప్రజల హక్కులను పరిరక్షించేందుకు మా పోరాటం నిరంతరం కొనసాగుతుందన్నారు. సత్యం, న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ కోసం మా గొంతు ఎప్పటికీ మూగబోదన్నారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశంపై బీజేపీ, ఎన్నికల కమిషన్‌పై కాంగ్రెస్ పార్టీ న్యాయపరమైన పోరాటం కూడా కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.






