భిక్కనూరు క్యాంపస్‌లో ర్యాగింగ్ కల్చర్

by velandi.Saikiran |   (  Updated:2026-03-06 22:30:22  IST  )

భిక్కనూరు మండలంలోని బీటీఎస్ చౌరస్తాలో ఉన్న కాలేజ్ క్యాంపస్‌లో 'మందు కల్చర్', ర్యాగింగ్ పరాకాష్టకు చేరాయి.

భిక్కనూరు క్యాంపస్‌లో ర్యాగింగ్ కల్చర్
X

భిక్కనూరు మండలంలోని బీటీఎస్ చౌరస్తాలో ఉన్న కాలేజ్ క్యాంపస్‌లో 'మందు కల్చర్', ర్యాగింగ్ పరాకాష్టకు చేరాయి. తాగి మత్తులో సీనియర్ విద్యార్థులు చేసిన దాడిలో జూనియర్ విద్యార్థి రాజు తలకు తీవ్ర గాయమైంది. చాలా కాలంగా సీనియర్లు జూనియర్లపై పెత్తనం చేస్తూ, భౌతిక దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం. జూనియర్లు పలుమార్లు ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లినా, ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్యాంపస్‌కు చెందిన కొంతమంది విద్యార్థుల కనుసన్నల్లోనే ప్రిన్సిపాల్‌తో సహా సిబ్బంది పనిచేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఘటన తీవ్రం కావడంతో జూనియర్ విద్యార్థులు క్యాంపస్‌లో పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్, వార్డెన్ల బాధ్యతారహిత్యం, బయట వ్యక్తుల ప్రవేశంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాత్రి వేళల్లో అర్ధరాత్రి వరకు జరుగుతున్న పార్టీలే ఈ అక్రమాలకు కారణమని, అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

దిశ, భిక్కనూరు : భిక్కనూరు మండలంలోని బీటీఎస్ చౌరస్తాలో ఉన్న కాలేజ్ క్యాంపస్‌లో కొంతకాలంగా జరుగుతున్న ర్యాగింగ్ భూతానికి సంబంధించి వికృత చేష్టలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. సీనియర్ విద్యార్థులు కొందరు జూనియర్స్ పై ఘర్షణకు దిగిన నేపథ్యంలో ఈ దారుణమైన పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. చాలాకాలంగా సీనియర్ విద్యార్థులు జూనియర్లపై పెత్తనం చెలాయించడమే కాకుండా, వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఈ విషయాన్ని జూనియర్లు పలుమార్లు ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే నిన్నటి ఘటనకు పరాకాష్టగా మారిందన్న ప్రచారం జరుగుతోంది. క్యాంపస్‌కు చెందిన కొంతమంది విద్యార్థుల కనుసన్నల్లోనే ప్రిన్సిపాల్‌తో సహా స్టాఫ్ మొత్తం పనిచేస్తున్నారని, వారు చెప్పిందే వేదం అనే విధంగా ఇన్నాళ్లు గోప్యంగా వ్యవహారం నడిచినట్లు తెలుస్తోంది.

మందు, కల్లుకు అడిక్ట్ అయ్యారా?

క్యాంపస్‌లో సీనియర్ విద్యార్థులు చేసిన రచ్చరంబోలా వల్ల జూనియర్ విద్యార్థి రాజు తలకు తీవ్రగాయమైంది. తాగిన మత్తులోనే ఈ దాడులకు పాల్పడినట్లు సమాచారం. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జూనియర్ విద్యార్థులు క్యాంపస్‌లో పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో ఈ విషయం పొక్కడంతో క్యాంపస్‌లో జరుగుతున్న బాగోతం అంతా వెలుగులోకి వచ్చింది. క్యాంపస్‌లోని వసతి గృహం నుంచి సీనియర్ విద్యార్థులు కొందరు ఎందుకు బయటకు వెళ్తున్నారని అడిగే నాథుడే కరువయ్యాడు. వాళ్లు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఏ రాత్రికి క్యాంపస్‌కు వచ్చినా వారి కోసం మెస్‌లో భోజనం ఉంచడం పరిపాటిగా మారింది. సమీపంలో ఉన్న జంగంపల్లికి వెళ్లి బెల్ట్ షాపులో మందు కొనుగోలు చేసుకొని వస్తున్నారా...? లేక కల్లుకు అడిక్ట్ అయి ఆ విధంగా చేస్తున్నారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. భిక్కనూరు చేరుకొని మందు కొనుగోలు చేసుకొని వచ్చి చెట్ల కింద కూర్చొని తాగుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తిం అవుతున్నాయి.

ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం.. బయట వ్యక్తుల ప్రవేశం..

మందు కల్చర్ క్యాంపస్‌లో పాతుకుపోతుంటే ప్రిన్సిపాల్, వార్డెన్‌తోపాటు స్టాఫ్, నైట్ వాచ్మెన్ లు ఏం చేస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. కొందరు విద్యార్థులు చేస్తున్న వికృత చేష్టల గురించి అందరికీ తెలిసినప్పటికీ ‘మనకెందుకులే’ అని నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే జూనియర్ విద్యార్థులపై భౌతిక దాడులకు దిగేదాకా వచ్చిందనే వాస్తవం నిన్న జరిగిన ఘటనతో వెలుగులోకి వచ్చింది. పైగా బయట వ్యక్తులు క్యాంపస్‌లో తిరుగుతుంటే పట్టించుకునే వారే కరువయ్యారు. వాళ్లే ఏమైనా మందుకు సంబంధించి సరంజామా అందించి వెళ్తున్నారా అన్న ప్రచారం క్యాంపస్ విద్యార్థుల్లో అనుమానం నెలకొంది. క్యాంపస్ లో జరుగుతున్న ఈ అక్రమాలు అన్ని తెలిసి కూడా అధికారులు నిర్లక్ష్యంగా ఉండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రాత్రి జరిగే పార్టీలే కారణమా?

క్యాంపస్‌లో జరిగే ప్రెషర్ పార్టీతో సహా విద్యార్థులు చేసుకొనే ఏ పార్టీ అయినా డే టైంలో కాకుండా నైట్ టైంలోనే జరుగుతున్నాయి. ఇదివరకు మధ్యాహ్నం ప్రారంభమై సాయంత్రం వరకు జరిగే పార్టీలు, ప్రస్తుతం రాత్రి మొదలై అర్ధరాత్రి వరకు జరుగుతున్నాయి. ఈ విధంగా పార్టీలు నిర్వహించడం వలన, ఏం జరిగినా బయటకు పొక్కదన్న భావనతో ఫేర్‌వెల్ పార్టీలతో సహా ప్రతి పార్టీని అర్ధరాత్రి వరకు నిర్వహిస్తుండడం కూడా క్యాంపస్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా చేస్తుందన్న ప్రచారం జరుగుతుంది. ఈ రాత్రి పార్టీల వల్లనే మందు, కల్లు కల్చర్ క్యాంపస్‌లో పెరుగుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story