పోలీసుల సమిష్టి కృషితో నేరాల నివారణ

by Nallavelli.Anjaneyulu |

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణ పట్ల అంకితభావం, ప్రభుత్వ విభాగాల సమన్వయం, ప్రజల సహకారంతో నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య తెలిపారు.

పోలీసుల సమిష్టి కృషితో  నేరాల నివారణ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణ పట్ల అంకితభావం, ప్రభుత్వ విభాగాల సమన్వయం, ప్రజల సహకారంతో నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంగళవారం మధ్మాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో 2025 వార్షిక క్రైమ్ రిపోర్ట్ ను సీపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్య మీడియా సమావేశంలో క్రైం వివరాలను వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే కమిషనరేట్ పరిధిలో ఓవరాల్ గా క్రైమ్ రేటు 4 శాతం తగ్గినట్టు సీపీ సాయిచైతన్య తెలిపారు. గతేడాది వివిధ నేరాల సంఖ్య 8983 నమోదు కాగా, 2025 లో నమోదైన కేసుల సంఖ్య 8624 కు తగ్గినట్టు తెలిపారు. పిల్లలపై జరిగే నేరాల సంఖ్య 120 నుంచి 168కి పెరిగినట్టు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీస్ శాఖ తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చినట్టు సీపీ తెలిపారు.

బ్లాక్ స్పార్‌ట్స్ గుర్తించి ఆయా చోట్ల రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలతో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గినట్టు తెలిపారు. గతేడాది మొత్తం 857 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా 353 మంది మృతిచెందారని, 782 మంది గాయపడ్డారన్నారు. 2025 లో 780 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా 276 మంది మృతిచెందినట్టు సీపీ తెలిపారు. ప్రమాదాలను తగ్గించడంతో పాటు మృతుల సంఖ్యను కూడా తగ్గించగలిగినట్టు ఆయన తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పై ఉక్కుపాదం మోపే చర్యల్లో భాగంగా నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టిన తనిఖీలతో మంచి ఫలితాలు వస్తున్నట్టు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో సైతం ఈ తనిఖీలు దోహదం చేస్తున్నట్టు సీపీ తెలిపారు. గతేడాది జిల్లాలో 8410 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా, ఈసారి పోలీసుల విస్తృత తనిఖీలతో ఆ సంఖ్య 17,627 కు చేరిందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం కారణంగా వారితో పాటు ఎదుటి వారికి కూడా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మధ్యం తాగి వాహనాలు నడిపే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని సీపీ సాయిచైతన్య స్పష్టం చేశారు.

డ్రగ్స్ మహమ్మారిపై ఇక యుద్ధమే..

యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ పై ఇక యుద్ధమేనని సీపీ సాయిచైతన్య స్పష్టం చేశారు. రానున్న సంవత్సరంలో ఈ డ్రగ్స్ విషయంలో కొన్ని లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నట్టు సీపీ తెలిపారు. ప్రధానంగా డ్రగ్స్ పై యుద్ధం చేయనున్నామని తెలిపారు. ఇది వరకే కళాశాలల్లో, గ్రామాల్లో పలు చోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, దీన్ని మరింతగా విస్తరించనున్నట్టు తెలిపారు.

జాతీయ రహదారులను ఆనుకుని ఉండటంతో..

నిజామాబాద్ జిల్లా ప్రధానంగా జాతీయ రహదారులను ఆనుకొని ఉండటంతో అంతరరాష్ట్ర దొంగలు దోపిడీలకు పాల్పడుతున్నారని సీపీ అన్నారు. ఈ దొంగ తనాలను, దోపిడీలను నివారించడం కోసం డైనమిక్ గా పెట్రోలింగ్ చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించినట్టు తెలిపారు. వరదలతో వెంటనే సాయం చేసేందుకు వీలుగా డీడీఆర్ఎఫ్ ఫోర్స్ ను పోలీస్ శాఖ నుంచే సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ ఫోర్స్ తక్షణం రెస్పాండ్ అయ్యేందుకు అవకాశం ఉంటుందని సీపీ తెలిపారు. అమాయకులను ఆర్థిక నష్టాలకు గురిచేస్తున్న సైబర్ నేరాలపై ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నామని సీపీ వెల్లడించారు.

న్యూ ఇయర్ వేడుకలు తాము అడ్డంకి కాదు..

జిల్లా ప్రజలు జరుపుకునే న్యూ ఇయర్ వేడుకలకు పోలీస్ శాఖ అడ్డంకి కాదని, కానీ వేడుకల పేరుతో హద్దు మీరొద్దని సీపీ సాయిచైతన్య జిల్లా ప్రజలకు సూచించారు. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే విషయంలో సీపీ పలు సూచనలు చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మరింత విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. మద్యం తాగి రోడ్లమీద వాహనాలు నడిపిస్తే రూ.10 వేలకు మించిన జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడనున్నట్టు సీపీ సాయిచైతన్య హెచ్చరించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) జి. బస్వా రెడ్డి , నిజామాబాదు ఏసీపీ ఎల్. రాజా వెంకటరెడ్డి, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ , సైబర్ క్రైమ్ ఏసీపీ వై. వెంకటేశ్వర్ రావ్, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీశైలం, సీఐలు ఎస్ఐలు సీ సీఆర్ బి సీఐ వీరయ్య , ఐటీ కోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story