- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్రీయ విద్యాలయం చుట్టూ రాజకీయం..!
జగిత్యాల జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు అంశం రాజకీయ వేడిని మరింత పెంచుతోంది.

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు అంశం రాజకీయ వేడిని మరింత పెంచుతోంది. విద్యా సంస్థ ఏర్పాటు కంటే ఇప్పుడు స్థల ఎంపిక చుట్టూనే అధికార కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య తీవ్ర విమర్శలు, ఆరోపణలు చోటు చేసుకుంటున్నాయి. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మధ్య మాటల యుద్ధంగా మారిన ఈ వివాదం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రీయ విద్యాలయం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జగిత్యాల రూరల్ మండలం పరిధిలోని చల్‌గల్ వాలంతరీ సెంటర్ ఆధీనంలో ఉన్న రెండు ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో వివాదానికి తెరలేచింది. అయితే కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం కనీసం ఐదు ఎకరాల భూమి అవసరమని నిబంధనలు ఉన్న నేపథ్యంలో కేవలం రెండు ఎకరాల స్థలం కేటాయించడం ఏమిటని ఎంపీ అరవింద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని ఎంపీ అరవింద్ ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. ఐదు ఎకరాలు అవసరమని తెలిసినా ఉద్దేశపూర్వకంగానే రెండు ఎకరాల ప్రతిపాదన పంపించి కేంద్రీయ విద్యాలయ ప్రతిపాదన తిరస్కరణకు గురయ్యేలా చేశారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కనీస రోడ్డు సౌకర్యాలు కూడా సరిగా లేని ప్రాంతాన్ని ఎంపిక చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయని విమర్శించారు. మరోవైపు ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కొందరు నాయకులు నర్సింగాపూర్ శివారులో ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడం కూడా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నుంచి సస్పెండ్ అయిన కొంతమంది నాయకులు కూడా ఈ వ్యవహారంలో చురుగ్గా పాల్గొనడం రాజకీయంగా మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇదే సమయంలో చల్‌గల్ గ్రామ శివారులోని వాలంతరీ సెంటర్ పరిధిలో ఉన్న పూర్తి ఐదు ఎకరాల భూమినే కేంద్రీయ విద్యాలయానికి కేటాయించాలని కోరుతూ ఎంపీ ధర్మపురి అరవింద్ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనకు అనుకూలంగా ఉన్న భూముల విలువ పెరిగేలా నర్సింగాపూర్ ఐటీఐ కళాశాల పరిసర ప్రాంతాన్ని ముందుకు తెస్తున్నారని ఎంపీ ఆరోపించడం మరోసారి వివాదానికి దారితీసింది. మరోవైపు ఎమ్మెల్యే వర్గం మాత్రం విద్యార్థులకు రాకపోకలకు అనువైన ప్రాంతంలోనే కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెబుతోంది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఈ స్థల వివాదం ఇప్పుడు పూర్తిగా రాజకీయ రంగు పులుముకోవడంతో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు ఎప్పుడు పూర్తవుతుందో అనే సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. విద్యాసంస్థ ఏర్పాటు కంటే రాజకీయ ఆధిపత్య పోరాటమే ముందుకు వస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.






