- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించరూ..!
నష్టాల సాకుతో పదేళ్లుగా లే అవుట్‌తో మూతపడి ఉన్న బోధన్ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెరిపించాలని ఇక్కడి చెరుకు రైతులు, నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్‌రెడ్డికి ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక అధికారాలతో కూడిన ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెట్టారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నష్టాల సాకుతో పదేళ్లుగా లే అవుట్‌తో మూతపడి ఉన్న బోధన్ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెరిపించాలని ఇక్కడి చెరుకు రైతులు, నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్‌రెడ్డికి ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక అధికారాలతో కూడిన ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెట్టారు. కొద్ది రోజుల క్రితమే సచివాలయంలో ఆయన పదవీ బాధ్యతలు కూడా చేపట్టారు. ఇప్పుడు ఆయన చేతిలో మంత్రి పదవి లేకపోయినా, మంత్రికి ఏ మాత్రం తీసిపోని విధంగా మంత్రి వర్గ సమావేశంలో పాల్గొనే అధికారంతో పాటు, ప్రభుత్వ శాఖలపై అజమాయిషీ చేసే అధికారం ఉంది. దీంతో బోధన్ షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించే విషయంలో సుదర్శన్‌రెడ్డి చొరవ తీసుకోవాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు. ఆయన చేసే ప్రయత్నాలు తప్పక సత్ఫలితాలిస్తాయని, సీఎం రేవంత్ కూడా పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతారనే నమ్మకాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.
ముత్యంపేట, మంబోజిపేటలోనూ 2 యూనిట్లు..
బోధన్ షుగర్స్ ఫ్యాక్టరీ పరిధిలోనే జగిత్యాల జిల్లా ముత్యంపేట్, మెదక్ జిల్లా మంబోజి పేటలో కూడా 2 అనుబంధ యూనిట్లున్నాయి. 49 శాతం ప్రైవేట్, 51 శాతం గవర్నమెంట్ భాగస్వామ్యంతో నడుస్తున్న నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని నష్టాల సాకుతో పదేళ్ల క్రితం మూసేశారు. తిరిగి వాటిని తెరిపించేందుకు కాంగ్రెస్ ఎన్నికల హామీ అమల్లో భాగంగా పునరుద్ధరణకు అవసరమైన సిఫార్సుల కోసం జనవరిలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైంది. 2 నెలల్లో సమగ్ర నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది. తొలుత చకచకా అడుగులు పడినా, తర్వాత సవాళ్ల రూపంలో పలు సమస్యలు ఎదురయ్యాయని, వాటి పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు అప్పట్లో కమిటీ సభ్యులు అన్నారు. కానీ, ఇప్పుడు ఈ అంశంపై ఎవరూ మాట్లాడటం లేదు. బోధన్ ఎమ్మెల్యేగా ఎన్నికైన సుదర్శన్‌రెడ్డి కూడా ఈ ఫ్యాక్టరీ విషయం తన పరిధిలోకి రాదన్నట్లుగానే వ్యవహరిస్తున్నారని, ఫ్యాక్టరీ తెరిపించేందుకు తన వైపు నుంచి ఎలాంటి ప్రయత్నాలూ చేయడం లేదని చెరుకు రైతు కార్మిక సంఘం నాయకుడు రవిశంకర్ గౌడ్ విమర్శిస్తున్నారు. ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన సుదర్శన్ రెడ్డి కనీసం ఇప్పుడైనా బోధన్ చక్కెర కర్మాగారంపై సీఎం ఫోకస్ చేసేలా ఒప్పించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
ఈ అంశాలపై తేలాకే..
బోధన్ చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఫ్యాక్టరీలోనే చెరుకు రైతులు, కార్మికులు, ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం పోరాడే నాయకులతో కలిసి ఓ సమావేశం ఏర్పాటు చేసింది. ఫ్యాక్టరీ తెరిపించేందుకు అనుకూల అంశాల గురించి చర్చించారు. కర్మాగారం తిరిగి నిర్వహించేందుకు ప్రైవేటు భాగస్వామి కలిసొచ్చే పరిస్థితులు లేకపోవడంతో ఆయన సెటిల్మెంట్ కోరితే ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందో చూడాలంటున్నారు. దీనిపై ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. యంత్రాలు వినియోగించలేని సందర్భంలో కొత్తవి కొనాలనే ప్రతిపాదన కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. కొత్తగా కొనాలంటే ఒక్కో యూనిట్‌కు రూ.150 కోట్లు అవుతుందన్నారు. మంబోజిపేట యూనిట్‌ను ప్రైవేటుకు అప్పగించే అంశం కూడా అప్పట్లో చర్చకు వచ్చింది. సహకార పద్ధతిలో నడిచే చక్కెర పరిశ్రమల ప్రోత్సాహకానికి కేంద్రం బడ్జెట్లో కేటాయింపులు చేసింది. ఫ్యాక్టరీ నిర్వహణకు ప్రభుత్వం నుంచి నిధులు రావాలంటే సహకార విధానమే మేలని సమావేశంలో ఓ సభ్యుడు కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అధిక దిగుబడినిచ్చే విత్తనం, కొనుగోళ్లపై బైబ్యాక్ ఒప్పందాలు స్పష్టం చేస్తే చెరుకు రైతులు సాగుకు ముందుకొచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికీ ఫ్యాక్టరీకి చెందిన కార్మికుల వేతన బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదు. ఈ అంశం కూడా తేలాల్సిన అవసరం ఉంది.
ఇప్పటికైనా ఫ్యాక్టరీని తెరిపించాలి
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో స్పష్టంగా ఇచ్చిన హామీ మేరకు బోధన్ షుగర్స్ ఫ్యాక్టరీని, దీంతో పాటు అనుబంధంగా ఉన్న మరో రెండు యూనిట్లను ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలి. గత ప్రభుత్వ పెద్దలు కూడా ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చారు. పలాయనం చిత్తగించారు. ఈ సారి రేవంత్‌రెడ్డి దేవుళ్లపై ఒట్టేసి ఇచ్చిన హామీని నెరవేర్చాలి. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి కూడా ప్రస్తుతం ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు.. ఆయన కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని ఫ్యాక్టరీని సాధించాలి.
- రవిశంకర్ గౌడ్, చెరుకు కార్మిక సంఘం నాయకుడు






