- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాల్య వివాహాలు అరికట్టడానికి పంచాయతీ కార్యదర్శులు కీలక పాత్ర పోషించాలి : హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ పి. సామ్ కోషి
బాల్యవివాహాలు అరికట్టడానికి పంచాయతీ కార్యదర్శులు ముఖ్యపాత్ర వహించాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, సర్వీసెస్ అథారిటీ కార్యనిర్వాహక చైర్మన్ జస్టిస్ పి.సామ్ కోషి పేర్కొన్నారు.

దిశ, కామారెడ్డి : బాల్యవివాహాలు అరికట్టడానికి పంచాయతీ కార్యదర్శులు ముఖ్యపాత్ర వహించాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, సర్వీసెస్ అథారిటీ కార్యనిర్వాహక చైర్మన్ జస్టిస్ పి.సామ్ కోషి పేర్కొన్నారు. గ్రామ ప్రజలతో మమేకమైన పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు, సెల్ఫ్ అండ్ హెల్ప్ గ్రూప్ సభ్యులు బాల్య వివాహాలు అరికట్టడం, చిన్నారులకు పోషకాహారం అందించడం, అవగాహన కల్పించడంలో ముఖ్యపాత్ర వహించాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్య నిర్వాహక చైర్మన్ జస్టిస్ పి.సామ్ కోషీ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి లో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కామారెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆద్వర్యంలో మహిళలు, పిల్లల రక్షణ-సామాజిక బాధ్యత అనే అంశంపై గ్రామ సెక్రటరీలు, కమ్యూనిటీ పెద్దలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. బాల్య వివాహాలు సమాజానికి శాపంగా మారాయని, ఇవి చట్టరీత్యా నేరమన్నారు. బాల్య వివాహాల వల్ల బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్ తీవ్రంగా దెబ్బతింటుందని తెలిపారు. 18 సంవత్సరాలు నిండని బాలికకు, 21 సంవత్సరాలు నిండని బాలుడికి వివాహం చేయడం చట్ట విరుద్ధమని, దీనికి పాల్పడిన తల్లిదండ్రులు, పెద్దలు, మధ్యవర్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బాల్య వివాహాలను అడ్డుకోవడంలో ప్రతి పౌరుడు బాధ్యత వహించాలని, ఇలాంటి ఘటనలు గమనించిన వెంటనే చైల్డ్ లైన్ 1098 లేదా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. బాలికల హక్కులను కాపాడటానికి, వారి విద్యను ప్రోత్సహించడానికి సమాజం మొత్తం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
పోష్ చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టాల అమలులో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజల సహకారం అత్యంత అవసరమని పేర్కొన్నారు. మహిళలు, పిల్లల హక్కుల పరిరక్షణలో న్యాయ సేవల సంస్థలు అందిస్తున్న సేవలను వివరించారు. ఈ సందర్భంగా మళ్ళీ వచ్చే ఏడాది సమావేశం లో కామారెడ్డి జిల్లాలో ఎలాంటి కేసులు ఉండకుండా జిల్లాను ముందుంచాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పోష్ చట్టం, బాల్య వివాహాల నిషేధంపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. బాల్య వివాహాల నుంచి రక్షించబడిన పిల్లలు (3), కేజీబీవీ పాఠశాలల ప్రత్యేక అధికారులు (6), బాన్సువాడ కమ్యూనిటీ మధ్యవర్తిత్వ వాలంటీర్లు (5), సోషల్ మీడియా అవగాహన కార్యక్రమాల్లో కృషి చేసిన ఉపాధ్యాయుడికి ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇద్దరు వృద్ధులకు వీల్ చైర్లు, పీపుల్ ఫర్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ అనే ఎన్‌జీఓ ద్వారా ఐదుగురు మహిళా లబ్ధిదారులకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. పోలీస్ కలాజాత బృందం మహిళలు, పిల్లల రక్షణపై అవగాహన కలిగించే స్కిట్‌ను ప్రదర్శించింది. చివరగా సీనియర్ సివిల్ జడ్జి డా.సుర సుమలత వందన సమర్పణ అనంతరం న్యాయ సేవా కార్యాలయంలో మధర్ ఫీడింగ్ క్యాబిన్ ప్రారంభించి, బార్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ నర్సింగ్ రావు నందికొండ, జూనియర్ సివిల్ జడ్జి ఎం.సుష్మ, ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి డా.సి.వి.ఆర్.ఆర్. వరప్రసాద్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు జిల్లా కలెక్టర్ వి.విక్టర్ పాల్గొన్నారు.






