- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజామాబాద్‌లో ఆపరేషన్ ముస్కాన్–12 ప్రారంభం : అదనపు డీసీపీ
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తప్పిపోయిన చిన్నారులను వారి కుటుంబాలతో కలపడం,

దిశ, నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తప్పిపోయిన చిన్నారులను వారి కుటుంబాలతో కలపడం, నిరాశ్రయ బాలలు, వీధి బాలలు, బాల కార్మికులుగా పనిచేస్తున్న చిన్నారులను గుర్తించి బాల కార్మిక వ్యవస్థ బారిన పడే ప్రమాదం నుండి రక్షించడం తో పాటు వారికి చట్టపరమైన సంరక్షణ కల్పించే లక్ష్యంతో చేపట్టిన "ఆపరేషన్ ముస్కాన్–XII" కార్యక్రమాన్ని అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) మాట్లాడుతూ..
ఈ ప్రత్యేక కార్యక్రమం జూలై 1 నుండి జూలై 31 నెల రోజుల పాటు పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, విద్యాశాఖ, బాలల సంరక్షణ విభాగం, జిల్లా బాలల పరిరక్షణ యూనిట్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, ఇంకా స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మార్కెట్లు, హోటళ్లు, దాబాలు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు, గ్యారేజీలు, వర్క్ షాపులు, నిర్మాణ ప్రాంతాలు, ధార్మిక క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు తదితర ప్రజా ప్రదేశాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి బాల కార్మికులు, నిరాశ్రయ బాలలు, వీధి బాలలు, తప్పిపోయిన చిన్నారులను గుర్తించి సురక్షితంగా రక్షిస్తారన్నారు. వారికి సంబంధిత అధికారుల సమక్షంలో పునరావాసం కల్పించనున్నట్లు తెలిపారు.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు ప్రతి చిన్నారికి విద్య, భద్రత, ఆరోగ్యం, రక్షణ కల్పించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని శుభం ప్రకాష్ పేర్కొన్నారు. చిన్నారులను పనుల్లో నియమించడం చట్టరీత్యా నేరమన్నారు. అలాంటి ఘటనలు ఎక్కడైనా కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు సమాచారం అందించేందుకు అధికారులకు సంబంధించిన కాంటాక్ట్ నెంబర్లను కూడా ఆయన వెల్లడించారు. నిజామాబాద్ డివిజన్ ఇంచార్జి ఎస్‌ఐ – 8712578236, ఆర్మూర్ డివిజన్ ఇంచార్జి ఎస్‌ఐ – 8712659863, బోధన్ డివిజన్ ఇంచార్జి ఎస్‌ఐ – 9985197899 నెంబర్లకు కాల్ చేసి సమాచారాన్ని ఇవ్వొచ్చని ఆయన తెలిపారు.
"ఆపరేషన్ ముస్కాన్–XII" కార్యక్రమాన్ని ప్రజల సహకారంతో విజయవంతం చేసి, ప్రతి చిన్నారిని సురక్షితంగా తన కుటుంబానికి చేరేలా కృషి చేయాలని అదనపు డీసీపీ (అడ్మిన్) సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ పాండే రావు, ఏహెచ్ టీయూ ఇన్‌స్పెక్టర్ ఏ. సురేష్, జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి డి. సౌందర్య, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి చైతన్య, జిల్లా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సీహెచ్. ప్రభుదాస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కల్పన, డీఎంహెచ్‌ఓ కార్యాలయం తరఫున వెంకటేష్, జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి సూపరింటెండెంట్ బి. భాస్కర్, జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుండి బి. బాలకృష్ణారావు తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






