పోతంగల్ మండల ఏర్పాటుకు నోటిఫికేషన్

by Disha Web Desk 20 |
పోతంగల్ మండల ఏర్పాటుకు నోటిఫికేషన్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో కోటగిరి మండలంలోని 14 గ్రామాలను విడదీసి కొత్త మండలం ఏర్పాటు దిశగా అడుగులు పడ్డాయి. రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గంలో కొత్త మండలం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 314 జీవో విడుదల చేసింది. బుధవారం ఈమెరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కోటగిరి మండలంలోని పోతంగల్ మండల కేంద్రంగా కొత్త మండల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేశారు.

పోతంగల్ మండల కేంద్రంగా హంగర్గా, కల్లూర్, కోడిచెర్ల, సుంకిని, జల్లేపల్లి, హెగ్డలి, సోంపూర్, కారేగాం, కొల్లూరు, తిరుమలాపూర్, హుమ్నాపూర్, టాక్లి దోమలేడిగి గ్రామాలను కలుపుతూ కొత్త మండలం ఏర్పాటు చేశారు. కొత్త మండల ఏర్పాటుపై ముసాయిదా జాబితాను బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో రెవెన్యూ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి 15 రోజులపాటు ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, వినతులు, ఫిర్యాదులను స్వీకరించి పోతంగల్ మండలం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మంగళవారం నిజామాబాద్ జిల్లాలో కొత్తగా సాలూర, డొంకేశ్వర్, ఆలూరు మండలాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా పరిపాలన సౌలభ్యం కోసం కొత్త మండలాలు ఏర్పాటును ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను విడదీసిన తర్వాత కొత్తగా తొమ్మిది మండలాలు ఏర్పాటు చేయగా మంగళవారం వరకు తాజాగా మూడు మండలాల ఏర్పాటు పూర్తయింది. పోతంగల్ మండలం ఏర్పాటుతో జిల్లాలో మండలాల ఏర్పాటు కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చినట్లు అయింది.


Next Story