ఇద్దరు సీఎంలను ఓడించాననే గర్హం తప్ప చేసిందేమీ లేదు

by Nallavelli.Anjaneyulu |

కామారెడ్డిలో ఇద్దరు సీఎంలను ఓడించాననే గర్హం తప్ప ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చేసిందేమీ లేదని మంత్రి అజహారుద్దీన్ విమర్శించారు.

ఇద్దరు సీఎంలను ఓడించాననే గర్హం తప్ప చేసిందేమీ లేదు
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డిలో ఇద్దరు సీఎంలను ఓడించాననే గర్హం తప్ప ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చేసిందేమీ లేదని మంత్రి అజహారుద్దీన్ విమర్శించారు. కామారెడ్డిలోని 19, 20, 21, 22, 23, 24, 25 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహారుద్దీన్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..​అహంకారం వీడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని స్థానిక ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు.​ఎమ్మెల్యేగా వెంకటరమణారెడ్డి గెలిచినప్పటి నుండి ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. ఇప్పటి వరకు ఏమీ చేయని వ్యక్తి రేపు చేస్తాడనే నమ్మకం ప్రజలకు అసలే లేదన్నారు. అధికార అహం నెత్తికెక్కితే చిన్న, పెద్ద అనే వ్యత్యాసం ఉండదన్నారు. కేసీఆర్ అంతటి వాడే తన అహంకారంతో నేడు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని గుర్తుంచుకోవాలన్నారు. ​ప్రజా సేవకులే గెలవాలని, ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులు మృధు స్వభావులై ఉండాలన్నారు. వార్డులోని ప్రతి సమస్యను తమ ఇంటి సమస్యగా భావించి పరిష్కరించే వారికే ప్రజలు పట్టం కట్టాలని సూచించారు. ​రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ స్వర్ణయుగంగా మారుతుందన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తోందన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తున్నారన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద మాట్లాడుతూ..నాడు ఇందిరమ్మ పాలనలో మహిళలకు అండగా ఉన్నది కాంగ్రెస్ పార్టీనే నన్నారు. గ్యారంటీల ద్వారా మహిళా సాధికారతకు బాటలు వేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మన ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో మహిళల ఆర్థిక, సామాజిక భద్రతను చాటుతోందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story