సొసైటీలకు నామినేటెడ్ పాలకవర్గాలు?..

by I. Sairam |

రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (సొసైటీలకు) ఇకమీదట ఎన్నికలు నిర్వహించకుండా, నామినేటెడ్ పద్ధతిలోనే పాలకవర్గాలను నియమించాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సొసైటీలకు నామినేటెడ్ పాలకవర్గాలు?..
X

రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (సొసైటీలకు) ఇకమీదట ఎన్నికలు నిర్వహించకుండా, నామినేటెడ్ పద్ధతిలోనే పాలకవర్గాలను నియమించాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పాత పాలకవర్గాలను రద్దు చేసిన సర్కార్, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ఆలయ కమిటీల తరహాలో రాజకీయ నియామకాలు చేపట్టాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనివల్ల సొసైటీల నిర్వహణలో రైతుల ప్రత్యక్ష ప్రమేయం తగ్గి, కేవలం రాజకీయ నేతల ప్రాబల్యం పెరుగుతుందనే ఆందోళన పల్లెల్లో వ్యక్తమవుతోంది. ఓటు ద్వారా ఎన్నికైనప్పుడు పాలకవర్గాలు రైతులకు జవాబుదారీగా ఉండేవారని, నామినేటెడ్ పద్ధతి వస్తే ఆ పరిస్థితి ఉండదని రైతులు చర్చించుకుంటున్నారు. మరోవైపు పదవుల కోసం ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పటి నుంచే కాంగ్రెస్ పెద్దల చుట్టూ పైరవీలు మొదలుపెట్టారు. ఈ విధానం వల్ల విత్తనాలు, ఎరువుల పంపిణీలో రైతులకు సరైన సేవలు అందుతాయా లేదా అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి. ఎన్నికల సందడి లేకపోయినా, రాజకీయ భజనతో సొసైటీల ముఖచిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం కనిపిస్తోంది. రైతాంగ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ఈ నిర్ణయం పెద్దపీట వేయనుందని విమర్శలు వినిపిస్తున్నాయి.

దిశ, ఆర్మూర్ : రైతుల అవసరాలు తీర్చేందుకు దశాబ్దాల కింద రూపొందించిన సొసైటీల ఎన్నికల విధానానికి స్వస్తి పలికి, నామినేటెడ్ పద్ధతిలో పాలకవర్గాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ఆలయ కమిటీల తరహాలో సొసైటీలకు కూడా నేరుగా నియామకాలు చేపట్టేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రస్తుత పాలకవర్గాలను రద్దు చేయడంతో ఈ ఊహగానాలకు మరింత బలం చేకూరింది. ఈ నిర్ణయంపై అటు కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల్లో, ఇటు రైతుల్లో జోరుగా చర్చ సాగుతోంది.

తగ్గనున్న రైతుల ప్రాబల్యం...

సొసైటీ ఎన్నికలు పల్లెల్లో గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల తరహాలోనే ఎంతో రంజుగా క్యాంపు రాజకీయాల మధ్య జరుగుతుంటాయి. డైరెక్టర్ల నుంచి డీసీసీబీ చైర్మన్ల వరకు రైతుల ఓట్లతోనే ఎన్నికయ్యే వారు. అయితే, నామినేటెడ్ పద్ధతి వస్తే సొసైటీల్లో రైతుల ప్రాబల్యం పూర్తిగా తగ్గనుంది. గతంలో ఎన్నికల భయంతో పాలకవర్గ సభ్యులు రైతులతో సత్సంబంధాలు కలిగి ఉండేవారు. కానీ నామినేటెడ్ సభ్యులు వస్తే రైతులకు జవాబుదారీతనం తక్కువగా ఉంటుందని రైతాంగం ఆందోళన చెందుతోంది.

రైతులకు సౌకర్యాలు అందేనా.?..

ఇప్పటికే మెజారిటీ సొసైటీల్లో కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ఎరువులు, విత్తనాల సరఫరాలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా కమిషన్ల కోసం నకిలీ ఎరువులను రైతులకు అంటగడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఎన్నికైన పాలకవర్గాలే ఇలా ఉంటే, ఇక నామినేటెడ్ సభ్యుల పనితీరు ఎలా ఉంటుందోనని రైతులు సందేహిస్తున్నారు. కాగా, నియామకాలు ఖరారు కాకముందే పదవుల కోసం ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్ పెద్దల చుట్టూ పైరవీలు మొదలుపెట్టారు. ఈ మార్పు వల్ల సొసైటీల ద్వారా రైతులకు అందాల్సిన కనీస సౌకర్యాలు అందుతాయా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Next Story