- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్నారుల భద్రతకు భరోసా లేని ప్లే స్కూళ్లు!
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండానే ప్లే స్కూళ్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో నిర్వాహకులు నిబంధనలను ఇష్టారాజ్యంగా తుంగలో తొక్కుతున్నారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండానే ప్లే స్కూళ్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో నిర్వాహకులు నిబంధనలను ఇష్టారాజ్యంగా తుంగలో తొక్కుతున్నారు. ఇంటర్నేషనల్ ప్రమాణాల పేరుతో రూ.10వేల అడ్మిషన్ ఫీజు, రూ.6వేల నెలవారీ ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎన్‌సీపీసీఆర్ నిబంధనలకు విరుద్ధంగా మూడేళ్లలోపు చిన్నారులను కూడా స్కూళ్లలో చేర్చుకుంటున్నారు. 60మంది పిల్లలకు కేవలం ఇద్దరు ముగ్గురు ఆయాలను ఉంచి, కనీస అర్హతల్లేని టీచర్లతో బోధిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోనే నడపాల్సిన స్కూళ్లను అపార్ట్‌మెంట్లలోని 3, 4 అంతస్తుల్లో ప్రమాదకరంగా నిర్వహిస్తున్నారు. భద్రతకు అవసరమైన సీసీ కెమెరాలు, కనీస సౌకర్యాలు లేకపోయినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి నిబంధనలు ఉల్లంఘించిన ప్లే స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
- దిశ, కామారెడ్డి
దిశ, కామారెడ్డి : విద్యాశాఖ అనుమతులు లేకుండానే కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్లే స్కూల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. గల్లీకొకటి చొప్పున నిబంధనలకు విరుద్ధంగా ఇవి నడుస్తున్నా సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపించింది. దీంతో నిర్వాహకుల ఆగడాలకు అంతులేకుండా పోయింది. యాజమాన్యాలు అడిగినంత ఫీజులు తల్లిదండ్రులు చెల్లిస్తున్నారే తప్ప, చిన్నారుల భద్రతపై ఎలాంటి భరోసా కల్పిస్తున్నారో అడగడం లేదు. ఒక్కో పాఠశాలలో సుమారు 50 నుంచి 60మంది చిన్నారులను చేర్చుకొని, వారి అలనా పాలన చూసేందుకు కేవలం ఇద్దరో ముగ్గురో ఆయాలను నియమించి చేతులు దులుపుకుంటున్నారు. కనీస విద్యార్హతలు లేని ఉపాధ్యాయులతో విద్యాబోధన చేస్తుండడంతో పసిబిడ్డలకు అందుతున్న సౌకర్యాలు అంతంతా మాత్రమే.
నిబంధనలు తుంగలోకి...
నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, 2010 ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం ఈ ప్లే స్కూల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఎక్కడా ఈ నిబంధనలు పాటించడం లేదు. ఒక పిల్లవాడు మూడు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నట్లయితే సదరు బాలుడు ప్లే స్కూల్‌కి వెళ్లడం ఎన్‌సీపీసీఆర్ నిబంధనల ప్రకారం విరుద్ధం. మూడేళ్ల లోపు వారికి విద్యను అందించడం ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించడమే. మూడు నుంచి ఆరు సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలను చేర్చుకునే పాఠశాలలను నియంత్రించడానికి కమిషన్ ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందిస్తుంది.
అనుమతులు లేకుండానే వసూళ్లు...
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే జిల్లాలో కొత్త ప్లే స్కూళ్లు పుట్టుకొస్తున్నా, విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ శూన్యం. కొన్ని పాఠశాలలు తల్లిదండ్రులను ఆకర్షించేందుకు భవనాలకు రంగురంగుల బొమ్మలు వేసి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. తమ పాఠశాలలు అంతర్జాతీయ ప్రమాణాలతో నడుస్తున్నాయని ప్రచారం కల్పిస్తూ అడ్మిషన్ ఫీజులను సుమారు రూ.10వేల వరకు, నెలవారీ ఫీజులను రూ.6వేల వరకు ముక్కు పిండి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
భద్రత గాలికి..
నిబంధనల ప్రకారం ప్లే స్కూళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, అదేమీ పట్టించుకోవడం లేదు. ఇవన్నీ సౌకర్యాలు ఉన్నాయా లేదా అని ఆలోచించకుండానే కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలాంటి భద్రత లేని చోట చేర్పిస్తున్నారు. వీటిని కేవలం మొదటి ఫ్లోర్ లేదా గ్రౌండ్ ఫ్లోర్లలో మాత్రమే ఏర్పాటు చేయాల్సి ఉండగా, కొన్ని చోట్ల అపార్ట్‌మెంట్లలో మూడు, నాలుగు అంతస్తుల్లో నిర్వహిస్తున్నారు. దీంతో చిన్నారులు ప్రమాదకర పరిస్థితుల్లో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇకనైనా తప్పనిసరిగా ప్రమాణాలు పాటించే పాఠశాలలకే అనుమతులు మంజూరు చేసేలా, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించేలా జిల్లా కలెక్టర్ ప్రత్యేక తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.






