- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందూరుకు మొండి చెయ్యి
ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే శాసించిన ఉమ్మడి జిల్లాకు ప్రభుత్వంలో పదవులు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక్కడి దమ్మున్న నేతలకు రాజకీయాల్లో కానీ, రాష్ట్ర కేబినెట్ లో కానీ సముచిత గౌరవం దక్కింది. సమర్ధతకు, సత్తాకు తగినట్లుగా కేబినెట్ లో కీలక మంత్రి పదవులు దక్కాయి.

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే శాసించిన ఉమ్మడి జిల్లాకు ప్రభుత్వంలో పదవులు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక్కడి దమ్మున్న నేతలకు రాజకీయాల్లో కానీ, రాష్ట్ర కేబినెట్ లో కానీ సముచిత గౌరవం దక్కింది. సమర్ధతకు, సత్తాకు తగినట్లుగా కేబినెట్ లో కీలక మంత్రి పదవులు దక్కాయి. కానీ, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తరువాత పదేళ్లకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇందూరు ఇజ్జత్ ను పూర్తిగా తీసింది. ఇక్కడి నేతలకు కుక్కకు బొక్కేసిన చందంగా ఏది పడేస్తే అది కుక్కురుమనకుండా తీసుకుని సర్దుకుపోతారనే దిగజారుడు తనం అర్థమైందో ఏమో, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లవుతున్నా ఉమ్మడి జిల్లాకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపారు. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగింటిని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరికి మంత్రి పదవిని ఇవ్వకుండా అన్యాయం చేసింది.
కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలోనే కకావికలమైన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఏర్పాటు తరువాత అటు ఆంధ్రప్రదేశ్ లో, ఇటు తెలంగాణాలో కూడా పూర్తిగా తుడిచికి పెట్టుకుపోయిన పరిస్థితిలోకి వెళ్లింది. కేసీఆర్ ప్రభావంతో దిక్కుతోచని స్‌థితిలోకి వెళ్లిన పార్టీలో మనుగడ కష్టమని భావించిన అనేక మంది గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఉన్నత పదవులు అనుభవించిన వారు సైతం పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. మరెందరో పార్టీలో ఉంటూనే బీఆర్ఎస్ తో అంటకాగారు. రాజకీయంగా ఎంతటి దుర్భర పరిస్థితులెదురైనా, ఏ పదవులు లేకపోయినా, రాజకీయంగా కనుమరుగయ్యే ప్రమాదం ఎదురైనా పార్టీని వీడకుండా, ప్రతి పక్షపార్టీల ప్రలోభాలకు లొంగకుండా పార్టీని అంటి పెట్టుకుని ఉన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని సీనియర్ నేతలకు సైతం కాంగ్రెస్ పార్టీలో తీరని అన్యాయం జరుగుతోందనే విమర్శలు పార్టీలో వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ వేచి చూసే ధోరణిలో ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలు మౌనాన్ని వీడి పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించేందుకు వ్యూహరచన చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
ప్రభుత్వ సలహాదారు పదవులతో ఇద్దరు సీనియర్ నేతలకు చెక్..
ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు సూపర్ సీనియర్ నేతలున్నారు. వారిలో ఒకరు నిజామాబాద్ జిల్లాకు చెందిన బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఒకరు కాగా, కామారెడ్డి జిల్లాకు చెందిన మహ్మద్ షబ్బీర్ అలీ ఒకరు. వీరిద్దరూ కూడా దశాబ్ధాల రాజకీయ చరిత్ర కలిగిన నేతలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన విశేష అనుభవం కలిగిన వారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావడంలో తమ వంతు కృషి చేసిన నాయకులు. దురదృష్టవశాత్తు షబ్బీర్ అలీ తన కామారెడ్డి స్థానాన్ని రేవంత్ రెడ్డి కోసం త్యాగం చేసి, నిజామాబాద్ అర్బన్ లో పోటీ చేసి బీజేపీ అభ్య ర్థి చేతిలో ఓడిపోయారు. కామారెడ్డిలో కూడా బీజేపీ అభ్యర్థి చేతిలోనే రేవంత్ రెడ్డి ఓడిపోయారు. నిజామాబాద్ జిల్లా బోధన్ లో సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ లో డాక్టర్ రేకుల పల్లి భూపతిరెడ్డిలు గెలిచారు. కామారెడ్డి జిల్లాలోని యెల్లారెడ్డి , జుక్కల్ స్థానాల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. వీరందరిలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఒక్కరే సీనియర్ ఎమ్మెల్యే. మిగతా ముగ్గురు మొదటిసారి గెలిచిన వారే. ఏ రకంగా చూసుకున్నా ఉమ్మడి జిల్లా నుండి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కాలి కానీ, రెండేళ్లు గడిచినా మంత్రి పదవి దక్కలేదు. ఆయనను నోరు మూయించడానికి ప్రభుత్వ సలహాదారు పదవితో నోరు మూయించేశారు. ఆయన కూడా అందిన ప్రసాదమే పరమాన్నంగా భావించి సైలెంట్ అయ్యారు.
అజారుద్దీన్ స్థానంలో మైనార్టీ నేత షబ్బీర్ అలీ కనిపించలేదా?
జూబిలీ హిల్స్ ఎన్నికల్లో గట్టెక్కేందుకే అన్నట్లుగా ఆజారుద్దీన్ ను తెరపైకి తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చారు. ఒక వేళ మైనార్టీకే మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే సీఎం రేవంత్ రెడ్డి కోసం తన సీటు త్యాగం చేసిన మైనార్టీకి చెందిన సీనియర్ లీడర్ షబ్బీర్ అలీ ఉండనే ఉన్నారు కదా? మరి ఆయనెందుకు కనిపించలేదన్నది పార్టీలో చర్చనీయాంశమైంది. షబ్బీర్ అలీ ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నారు. అజారుద్దీన్ ఎమ్మెల్సీ ఫైల్ పెండింగులోనే ఉంది. మరి సీఎం కోసం సీటునే త్యాగం చేసిన షబ్బీర్ అలీ ఎందుకు కనిపించలేదో అర్థం కాని పరిస్థితి.
ఏమవుదామనుకున్నారు.. ఏమయ్యారు.. ప్చ్..!
బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిస్థితి తలుచుకుంటే జాలేస్తోంది. తను గెలవగానే కేబినెట్ మంత్రిగా సుదర్శన్ రెడ్డి అను నేను.. అని ప్రమాణ స్వీకారం చేస్తానని కలలు గన్నారు. రెండేళ్లుగా అదే నమ్మకంతో ఉన్నారు. చివరకు ప్రభుత్వ సలహాదారు పదవితో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి దాపురించింది. పార్టీ పట్ల ఆయన అంకిత భావానికి, సీనియారిటీకి, సిన్సియారిటీకి ఏ మాత్రం విలువ లేకుండా నామినేటెడ్ పోస్టుకు పరిమితం చేశారు. సుదర్శన్ రెడ్డి కూడా ప్రస్తుత పరిస్థితులకు తలొగ్గి ఓకే అనేశారు. మంత్రి కావాలని కలలు గన్న ఆయన మంత్రి కాని మంత్రిగా మర్యాదలందుకోవడానికి సిద్ధమయ్యా రు. ఇది ఓ రకంగా ఆయనకు అవమానమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం సుదర్శన్ రెడ్డికి అర్థమైందో కాలేదో.. ఒక వేళ అర్థమైనా ఇంతకు మించి చేసేదేం లేదనే అసహాయ పరిస్థితిలో కాంప్రమైజ్ అయ్యారో ఏందో కానీ, ఇందూరు ఇజ్జత్ మాత్రం పోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లా నేతల అర్హత నామినేటెడ్ పోస్టుల స్థాయికే పరిమితమని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లుంది. అందుకే డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి, ఈరవత్రి అనిల్, తాహెర్ బిన్ హందాన్, అన్‌వేష్ రెడ్డి, గడుగు గంగాధర్ లకు నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టింది. షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డిలకు కూడా నామినేటెడ్ పోస్టులే కట్టబెట్టిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తను ఉన్నత పదవిలో ఉంటే చాలా?
జిల్లాకు చెందిన టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ప్రస్తుతం పార్టీలో చాలా ఉన్నతమైన హోదాలో ఉన్నారు. తను ఉన్నత పదవిలో ఉంటే చాలా? సత్తా ఉన్న నాయకులు, అన్ని అర్హతలుండీ, పార్టీ గడ్డు పరిస్థితుల్లోనూ అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నేతలు మంత్రి వర్గంలో ఉండకూడదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టీపీసీపీ చీఫ్ గా తనుండగా, తన కన్నా సీనియర్ నేత కేబినెట్ లో ఉంటే తన ప్రాధాన్యత ఎక్కడ తగ్గిపోతుందోననే భయంతో రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చి ఉమ్మడి జిల్లాలో అటు షబ్బీర్ కు , ఇటు సుదర్శన్ రెడ్డి కి మంత్రి పదవులు రాకుండా చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.






