విధుల్లో నిర్ల‌క్ష్యం వ‌హిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు : జిల్లా వైద్యాధికారి రవీందర్ గౌడ్

by Ratna Kumari |

విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని, నిర్లక్ష్యం వహిస్తే ఎటువంటి వారైనా ఉపేక్షించేది లేదని జిల్లా వైద్యాధికారి రవీందర్ గౌడ్ అన్నారు.

విధుల్లో నిర్ల‌క్ష్యం వ‌హిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు : జిల్లా వైద్యాధికారి రవీందర్ గౌడ్
X

దిశ, నిజాంసాగర్ : విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని, నిర్లక్ష్యం వహిస్తే ఎటువంటి వారైనా ఉపేక్షించేది లేదని జిల్లా వైద్యాధికారి రవీందర్ గౌడ్ అన్నారు. శుక్రవారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన ఆయన ఆసుపత్రి పని తీరును సమగ్రంగా పరిశీలించారు. సిబ్బంది హాజరు నమోదు తప్పనిసరిగా పాటించాలని, విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వం సహించబోమని హెచ్చరించారు. ఆసుపత్రిలో నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలు,గర్భిణుల, ప్రసవాల వివరాలను స్థానిక వైద్యాధికారి డాక్టర్ రోహిత్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ముఖ్యంగా అత్యవసర సేవల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు.

బాలికల ఆరోగ్య రక్షణలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ఈ వ్యాక్సిన్ ద్వారా భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్‌ను నివారించవచ్చని చెప్పి, అర్హులైన ప్రతి బాలికకు తప్పనిసరిగా టీకా వేయాలని వైద్య సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆశా వర్కర్లు చురుకుగా పనిచేయాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం మా ప్రథమ కర్తవ్యం. ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్య సేవలు అందాలి. ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకోవడంలో వెనుకాడను అని ఈ సందర్భంగా రవీందర్ గౌడ్ స్పష్టంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, వివిధ గ్రామాలకు చెందిన ఆశా వర్కర్లు పాల్గొని తమ బాధ్యతలను మరింత సమర్థంగా నిర్వహించాలని సంకల్పించారు.

Next Story