- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భిక్కనూరులో ప్రకృతి పగ.. వడగండ్ల వానకు 820 ఎకరాల్లో పంట నష్టం
భిక్కనూరు మండలంలో అకాల వడగండ్ల వానకు 820 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. పాత బకాయిలే అందలేదని రైతులు ఆందోళన చెందుతుండగా, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

భిక్కనూరు మండలంలో అకాల వడగండ్ల వానలు అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లాయి. గత మూడేళ్లుగా సరిగ్గా కోతల సమయంలోనే వర్షాలు కురుస్తుండడంతో రైతులు కోలుకోలేక పోతున్నారు. తాజా సర్వే ప్రకారం మండలంలోని వివిధ గ్రామాల్లో 820 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వరితో పాటు మొక్కజొన్న, మామిడి సాగు చేసిన రైతులు కూడా భారీగా నష్టపోయారు. నెల రోజుల కింద జరిగిన నష్టానికే పరిహారం అందలేదని రైతులు రైతు వేదిక వద్ద ఆందోళన చేపట్టారు. పెట్టుబడి కోసం చేసిన లక్షలాది రూపాయల అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు వాపోతున్నారు. అధికారులు నివేదికలు పంపడం తప్ప క్షేత్రస్థాయిలో సహాయం అందడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు ఆర్థిక భరోసా కల్పించాలని రైతులు కోరుతున్నారు.
దిశ, భిక్కనూరు : చీడపీడల నుంచి పంటలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న రైతులకు ప్రకృతి వికృత రూపం శాపంగా మారింది. కోతకు వచ్చి చేతికి అందుతాయనుకున్న సమయంలో అకాల వర్షాలు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. గత మూడేళ్లుగా భిక్కనూరు బెల్టుపైనే ప్రకృతి పగబట్టినట్లుగా, సరిగ్గా పంటలు చేతికి వచ్చే సమయానికే వానలు కురుస్తుండడంతో రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతింటున్నారు. సాగు కోసం చేసిన అప్పులు, పెట్టుబడి ఖర్చులు ఎలా తీర్చాలో తెలియక అన్నదాతలు లబోదిబోమంటున్నారు.
820 ఎకరాల్లో పంట నష్టం..
తాజాగా కురిసిన వడగండ్ల వానకు భిక్కనూరు మండలంలో భారీగా పంట నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖ అధికారులు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రాథమికంగా 820 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా భిక్కనూరులో 250 ఎకరాలు, మల్లుపల్లిలో 150, లక్ష్మీదేవునిపల్లిలో 120, రామేశ్వర్ పల్లిలో 110 ఎకరాల తో పాటు కంచర్ల, పెద్ద మల్లారెడ్డి, కాచాపూర్ గ్రామాల్లో పంటలు నేలపాలయ్యాయి. వరితోపాటు మొక్కజొన్న, మామిడి, బొప్పాయి, కూరగాయల తోటలు కూడా దెబ్బతినడంతో బాధిత రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
పరిహారం అందక ధర్నాలు..
నెల రోజుల కింద మండలంలోని పెద్ద మల్లారెడ్డి, కంచర్ల గ్రామాల్లో కురిసిన వర్షాలకు సుమారు 600 ఎకరాల్లో పంట నీట మునిగింది. అప్పట్లో అధికారులు సర్వే నిర్వహించి నివేదికలు పంపినప్పటికీ, ఇంతవరకు రైతులకు ఎలాంటి నష్టపరిహారం అందలేదు. దీంతో ఆగ్రహించిన బాధితులు మూడు రోజుల కింద పెద్ద మల్లారెడ్డి రైతు వేదిక వద్ద ధర్నాకు దిగారు. మూడు లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని, ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన జరిగిన కొద్ది రోజులకే మళ్లీ వడగండ్ల వాన పడడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ప్రభుత్వమే ఆదుకోవాలి!
మరో రెండు రోజులు వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందన్న ప్రచారంతో ధాన్యం రైతులు భయం భయంగా గడుపుతున్నారు. పంటలు కోయాలా లేక ఉన్న ధాన్యాన్ని కాపాడుకోవాలా అని సతమతమవుతున్నారు. ప్రభుత్వం కేవలం నివేదికలతో కాలయాపన చేయకుండా, తక్షణమే నష్టపరిహారం అందించి తమను అప్పుల ఊబి నుంచి గట్టెక్కించాలని భిక్కనూరు మండల రైతులు వేడుకుంటున్నారు.






