- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేట్ ఫీజుల గుప్పిటి నుంచి సర్కారు బడి వైపు.. ఈ ఒక్క ఏడాదే 145 మందికి పైగా
తాడ్వాయి మండలం కన్కల్ గ్రామం సర్కారు బడిలో ఊహించని విధంగా విద్యార్థుల సంఖ్య పెరిగింది.

దిశ, తాడ్వాయి: ఈ రోజుల్లో పిల్లవాడికి ఎల్కేజీ సీటు కావాలన్నా వేలాది రూపాయలు కుమ్మరించాల్సిందే. పుస్తకాలు, యూనిఫామ్స్,వ్యాన్ ఫీజులంటూ ప్రైవేట్ పాఠశాలలు సాగించే దోపిడీ అంతా ఇంతా కాదు. కానీ ,తాడ్వాయి మండలం కన్కల్ గ్రామం ఈ ట్రెండ్‌కు గట్టి ఎదురుదెబ్బ కొట్టింది. రూపాయి ఫీజు లేకుండా కార్పొరేట్ స్థాయి చదువు మా ఊరి బడిలోనే అందిస్తాం.. విద్యార్థులను తీర్చిదిద్దేందుకు అనుభవజ్ఞులైన ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు అంటూ గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చారు. ఆ గ్రామ సర్పంచ్ మైలారం రవీందర్ రెడ్డి నేతృత్వంలో గ్రామస్తులు, ఉపాధ్యాయులు కలిసికట్టుగా అడుగులు వేసి తీసుకున్న ఒకే ఒక్క దృఢ సంకల్పం.. ఆ ఊరి ప్రభుత్వ పాఠశాలను నవశకంలోకి నడిపించింది.
ప్రైవేట్‌కు దీటుగా వసతులు.. రాజీ పడేదే లేదు
కేవలం మాటలతో సరిపెట్టకుండా, ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ఈ ప్రభుత్వ పాఠశాలలో వసతులను మెరుగుపరిచారు.కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా సౌకర్యాలు కల్పించడంలో ఎక్కడా కాంప్రమైజ్ అయ్యేదే లేదని సర్పంచ్ మైలారం రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు.పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం,నాణ్యమైన విద్యా ప్రమాణాలను కల్పించడంతో తల్లిదండ్రుల్లో నమ్మకం రెట్టింపయింది. ఫలితంగా, ప్రైవేట్ బళ్ల తళుకుబెళుకులు చూసి మోసపోవద్దనే పెద్దల మాటను ఊరంతా తూచా తప్పకుండా పాటించింది.
108 నుంచి 253 కి పెరిగిన విద్యార్థులు.. సరికొత్త రికార్డు
ఈ విప్లవాత్మక మార్పుకు నిదర్శనంగా ఈ విద్యాసంవత్సరం కన్కల్ బడి సరికొత్త రికార్డును నమోదు చేసింది. గతంలో ఈ పాఠశాలలో కేవలం 108 మంది విద్యార్థులు మాత్రమే ఉండగా, గ్రామస్తుల సమిష్టి కృషితో ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 253 కు చేరింది.ఈ ఒక్క ఏడాదిలోనే ప్రీ-ప్రైమరీ (ఎల్కేజీ, యూకేజీ)నుంచి మొదలుకొని పదవ తరగతి వరకు ఏకంగా 145మందికి పైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు గుడ్ బై చెప్పి, కన్కల్ ప్రభుత్వ పాఠశాల వైపు అడుగులు వేశారు. చిన్న పిల్లల తరగతుల నుండి హైస్కూల్ వరకు ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు ఒకేసారి ప్రభుత్వ బడిలో చేరడం మండలంలోనే అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. కన్కల్ గ్రామస్తులు విద్యా వ్యవస్థపై ఎంత కట్టుబడి ఉన్నారో ఈ సంఖ్యను బట్టే అర్థం చేసుకోవచ్చు.
15 మందితో పర్యవేక్షణ కమిటీ..
పాఠశాల అభివృద్ధి కేవలం అడ్మిషన్లతోనే ఆగిపోకుండా, నిరంతరం నాణ్యమైన విద్య అందేలా చూసేందుకు గ్రామస్తులు సరికొత్త అడుగు వేశారు.బడి నిర్వహణను,ఉపాధ్యాయుల బోధనను, విద్యార్థుల ప్రగతిని నిత్యం పర్యవేక్షించేందుకు 15 మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ తెలిపారు.ఈ కమిటీ ప్రతిరోజూ పాఠశాల తీరుతెన్నులను పర్యవేక్షిస్తూ,అవసరమైన వసతులను సమకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఏదేమైనా ప్రైవేట్ పాఠశాలల రంగుల బోర్డులు చూసి పరుగెత్తే ఈ రోజుల్లో, కన్కల్ గ్రామం సాధించిన విజయం ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత పెంచింది.ఊరంతా అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని నిరూపించిన కన్కల్ గ్రామం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచింది
గ్రామమే ఒక కుటుంబంగా మారి సాధించిన విజయం..
విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడంలో నో కాంప్రమైజ్... మైలారం రవీందర్ రెడ్డి,(కన్కల్ గ్రామ సర్పంచ్)
ఫీజుల భారంతో నలిగిపోతున్న తల్లిదండ్రులకు మెరుగైన ప్రత్యామ్నాయం చూపించడమే మా లక్ష్యం. ప్రైవేట్ పాఠశాలల కంటే దీటుగా సౌకర్యాలు మెరుగుపరచడంలో మేము ఎక్కడా రాజీ పడబోం. మా గ్రామం మరిన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది. గ్రామస్తులంతా కలిసికట్టుగా తీసుకున్న ఈ నిర్ణయం వల్లనే ఈ రోజు విద్యార్థుల సంఖ్య 253 కు చేరింది. మా నమ్మకాన్ని నిలబెట్టిన ఉపాధ్యాయులకు, నమ్మిన గ్రామస్తులకు ధన్యవాదాలు. కన్కల్ బడిని రాష్ట్రంలోనే ఒక మోడల్ బడిగా తీర్చిదిద్దుతాం.






