రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసి బెదిరించిన వ్యక్తి అరెస్ట్..

by Taduka Kalyani |

నిజామాబాద్ జిల్లా భీమ్‌‌ గల్ శివారులోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం లింబాద్రి గుట్ట కు వచ్చే యువతీ,

రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసి బెదిరించిన వ్యక్తి అరెస్ట్..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా భీమ్‌‌ గల్ శివారులోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం లింబాద్రి గుట్ట కు వచ్చే యువతీ, యువకుల ఫోటోలను రహస్యంగా చిత్రీకరిస్తూ డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అనంతరం ఆ నిందితుడిని రిమాండ్ కు పంపినట్లు భీమ్‌‌గల్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ సీహెచ్. తిరుపతి తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఎస్ హెచ్ ఓ మీడియాకు వెల్లడించిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. భీమ్‌‌గల్ మండలం లింగాపూర్ చౌత్ గ్రామానికి చెందిన గంధం భాస్కర్ (32) అనే యువకుడు అడ్డదారిలో ఈజీగా డబ్బులు సంపాదించాలనే దురాశతో లింబాద్రి గుట్టపైకి జంటలుగా వచ్చే యువతీ, యువకులను టార్గెట్ చేస్తూ మొబైల్ ఫోన్ లో రహస్యంగా వారి ఫోటోలు తీయడం, వీడియోలు చిత్రీకరించడం వంటివి చేసేవాడు. అనంతరం ఆ యువకుడు తీసిన ఫోటోలు, వీడియోలను వారికి చూపించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసే వాడు. అడిగినన్ని డబ్బులివ్వకపోతే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి, వైరల్ చేస్తానని భయపెట్టేవాడు.

తప్పుడు కేసులు పెడతానని కూడా యువతీ యువకులను బెదిరించేవాడు. భయపడిన యువతీ, యువకులు తమ దగ్గర ఉన్న డబ్బులన్నీ నిందితుడికి ఇచ్చి ఫోటోలు, వీడియోలు బయటపెట్టొద్ధని వేడుకునేవారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతోందని, నిందితుడు ఇలాగే కొంత కాలంగా తరచూ లింబాద్రి గుట్టకు వెళ్లి ఏకాంతంగా ఉన్న యువతీ యువకులను వెతికి పట్టుకుని ఫోటోలు, వీడియోలు తీసే వాడని ఎస్ హెచ్‌‌ ఓ తెలిపారు. ఇదే క్రమంలో నాలుగు రోజుల క్రితం ఓ బాధితుడితో పాటు, అతని స్నేహితులను బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయగా, వారు భయంతో తమ దగ్గరున్న రూ. 10 వేలను నిందితుడికి ఇచ్చారు. అయినప్పటికీ ఆ డబ్బుతో సంతృప్తి చెందకుండా అదనంగా మరి కొంత మొత్తంలో డబ్బులివ్వాలని ఒత్తిడి చేయడంతో బాధితులు నేరుగా భీమ్‌‌ గల్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన భీమ్‌‌ గల్ పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని రిమాండ్ చేసినట్లు ఎస్ హెచ్ ఓ తిరుపతి తెలిపారు.

డబ్బుల కోసం బెదిరిస్తే పోలీసులను ఆశ్రయించండి..

ఎవరైనా వ్యక్తులు మీ అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు తీసి బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడొద్దని ఎస్ఐ అన్నారు. వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని, లేదా డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని ఎస్ హెచ్ ఓ ప్రజలకు సూచించారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని ఎస్ హెచ్ ఓ తిరుపతి హెచ్చరించారు.

Next Story