- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జోరులేని స్థానికం.. ఆసక్తి చూపని నాయకులు
సాధారణంగా ఎన్నికలంటే ఎన్నడూ లేనంత కోలాహలం.. ఓ రకమైన హంగామా.. ఉండటం సహజం.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సాధారణంగా ఎన్నికలంటే ఎన్నడూ లేనంత కోలాహలం.. ఓ రకమైన హంగామా.. ఉండటం సహజం. అదీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనైతే మరింత జోరుగా కనిపిస్తుంది. కానీ, ఈ సారి జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మామూలుగా ఉండే హడావిడి ఏమీ కనిపించడం లేదు. ఎన్నికలపై సాధారణ జనంలో ఉన్న ఆసక్తి నాయకుల్లో కనిపించడం లేదు. ఒక్క అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు, గ్రామ స్థాయి నాయకుల్లో తప్ప మిగతా మరే పార్టీలోనూ అంతటి ఉత్సాహం, ఊపు కనిపించడం లేదు. ప్రచారంలో పస తగ్గింది. అంతా చప్పగా సాగుతోంది. గతంలో ఎన్నడూ కనిపించని ఈ పరిస్థితి ఈ సారి కనిపించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే జిల్లాలో రెండు విడతల ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. మొదటి విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కూడా పూర్తయింది. ఇక మిగిలింది మూడో విడత నామినేషన్ల ప్రక్రియ. ఇదంతా షెడ్యూల్ ప్రకారం జరుగుతోంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులు లేకుండా నిర్వహించేవి అయినప్పటికీ రాజకీయ పార్టీల మద్ధతు లేకుండా రాజకీయ రంగుపూసుకోకుండా మాత్రం జరగవనేది జగమెరిగిన సత్యం. రాజకీయ పార్టీలన్నీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా నిరూపించుకోవడానికి స్కెచ్ వేస్తాయి. గెలుపు గుర్రాల ఎంపిక చేసి పోటీలో నిలబెడతాయి. అన్ని శక్తులూ ఉపయోగించి తమ మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థులను గెలిపించుకొని పార్టీ జెండాలను రెపరెపలాడిస్తాయి.
అధికార పార్టీకే విజయావకాశాలు.. ఇతరులు గెలిచినా జెండా మార్చుడే..
సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన అభ్యర్థులకే విజయావకాశాలెక్కువగా ఉంటాయి. ముఖ్యంగా గ్రామ పంచాయతీ పాలక వర్గాలు అధికార పార్టీకి చెందినవి అయితేనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని, వాటి కోసం ప్రభుత్వం నుండి నిధులు భారీగా వస్తాయనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. దీంతో సాధారణంగా ప్రజలు గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అధికార పార్టీ మద్ధతుతో పోటీలో ఉన్న అభ్‌యర్థి వైపే మొగ్గు చూపడం జరుగుతుంది. మరో పక్క ప్రతిపక్ష పార్టీకి బలమైన అభ్యర్థులుంటేనో, స్థానికంగా ఆ అభ్యర్థిపై ప్రజల్లో పూర్తి నమ్మకం ఉంటేనో ఆ అభ్యర్థికి విజయావకాశాలుండవు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజల్లో ఉన్న వ్యక్తిగత ఇమేజ్ తో గెలిచే ఇండిపెండెంట్అభ్యర్థులు, వివిధ పార్టీల మద్ధతుతో గెలిచిన అభ్యర్థులు కూడా వెనువెంటనే అభివృద్ధి నినాదంతో అధికార పార్టీ కండువా కప్పుకుని అంతా అదే గుంపులో కలిసిపోవడం కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్వసాధారణం.
వద్దంటున్నా వినరే.. ఇష్టం లేదని వదిలేసినా వదలరే..
బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్ గల్ మండలం బడాభీమ్‍గల్ గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా జరిగేలా ఉన్నాయి. ఇక్కడ సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో ముందు నుండి తామే అనుకున్న ఆశావహులంతా భార్యల వైపు ఫోకస్ చేశారు. ఎలాగూ వెనకుండి నడిపేదంతా తామే అనే ధీమాతో భార్యలను పోటీకి ఒప్పించి బరిలో నిలిపేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాచకొండ శంకర్ గౌడ్ అనే వ్యక్తి చాలా కాలంగా పార్టీలో యాక్టివ్ గా ఉంటూ స్థానిక సంస్థల్లో అవకాశం వస్తే తను పోటీలో ఉంటానని చాలా కాలంగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. సర్పంచ్ ఎన్నికలకు సైరన్ మోగుతుందన్న ప్రతిసారీ గ్రామంలో దావత్ ల పేరుతో వేలకు వేలు ఖర్చు చేసుకున్నాడు. తీరా బడాభీమ్ గల్ సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో పోటీకి వెనక్కు తగ్గాడు. తను బీసీ వర్గానికే చెందిన వాడైనప్పటికీ తన భార్యను సర్పంచ్ ను చేసి తను యాక్టివ్ రోల్ ప్లే చేయడం ఇష్టం లేక తనకు తానుగా పోటీ నుండి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని గ్రామంలో కూడా అందరికీ ప్రచారం చేశారు. ఇక అధికార పార్టీకి చెందిన ఆశావహులకు బీఆర్ఎస్ నుండి బలమైన అభ్యర్థే స్వయంగా పోటీ నుండి తప్పుకోవడం, ఆ పార్టీ నుంచి మరో అభ్‌యర్థి ఎవరూ సుముఖంగా లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ విజయం ఇక నల్లేరుపై నడకేనని సంబర పడ్డారు. కానీ, బీఆర్ఎస్ పార్టీలో పోటీ చేయడానికి ఎవరూ ఆసక్తిని కనబరచకపోవడంతో ఆ పార్టీకి అభ్యర్థే కరువయ్యే దుస్థితి దాపురించింది. దీంతో మేజర్ గ్రామపంచాయతీ, అందులోనూ ఒకప్పుడు బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న బడాభీమ్‍గల్ లో బీఆర్ఎస్ కు అభ్యర్థే కరువయ్యారంటే ఇజ్జత్ పోతుందనే ఉద్దేశంతో పోటీ వద్దనుకున్న రాచకొండ శంకర్ గౌడ్ నే బుజ్జగించి ఆయన భార్య చేత నామినేషన్ వేయించేందుకు ఒప్పించారు. దీంతో వద్దనుకున్నా వదలకుండా తననే బరిలో దింపుతున్నారని శంకర్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో అన్నట్లు తెలుస్తోంది.
ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో పార్టీలు..
బీఆర్ఎస్, బీజేపీ లకు బలమైన అభ్యర్థులు లేక ఎవరిని బరిలో నిలపాలో తేల్చుకోలేక పోతున్నట్లు సమాచారం. బరిలో నిలపకపోతే పార్టీ పరువు పోతుందని, ఒకవేళ ప్రజాదరణ లేని వ్యక్తిని బరిలో నిలిపి డిపాజిట్ దక్కకుండా ఓడిపోతే ఉన్న పరువు కాస్తా బ్యాలెట్ బాక్సులో కలిసిపోతుందనే భయం ఆ పార్టీలను పట్టి పీడిస్‌తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ పరిస్థితి ఇంతో అంతో కాస్త మెరుగ్గానే ఉన్నప్పటికీ, బీజేపీ పరిస్థితి మాత్రం దారుణంగా ఉన్నట్లు పలు గ్రామాల్లో పరిస్థితిని అర్థమవుతోంది. బీజేపీ ని అభిమానించే యువత, జనాలు వందలు వేలల్లో ఉన్నప్పటికీ ఎలక్షన్ ల దగ్గరకొచ్చేసరికి వారి ఆలోచనలు వేరే విధంగా మారిపోతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బీజేపీ కి బలమైన అభ్యర్థుల మాట దేవుడెరుగు.. కనీసం అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి నెలకొంది.






