పెండింగ్ డబ్బులు చెల్లిస్తేనే లెప్రసీ సర్వే : సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్

by Ratna Kumari |

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వైద్య రంగంలో పనిచేస్తున్న ఆశావర్కర్లకు గతంలో నిర్వహించిన లెప్రసీ సర్వేకు డబ్బులు చెల్లించకుండా

పెండింగ్ డబ్బులు చెల్లిస్తేనే లెప్రసీ సర్వే :  సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వైద్య రంగంలో పనిచేస్తున్న ఆశావర్కర్లకు గతంలో నిర్వహించిన లెప్రసీ సర్వేకు డబ్బులు చెల్లించకుండా మళ్ళీ సర్వే నిర్వహించాలని అధికారులు ఒత్తిడి చేయడం సరైన నిర్ణయం కాదని, పాత డబ్బులు చెల్లిస్తేనే సర్వే కొనసాగిస్తామని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ పేర్కొన్నారు. జిల్లా వైద్య అధికారి డాక్టర్ విద్యకు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేసినట్లు చెప్పారు. గత ఏడాది నిర్వహించిన లెప్రసీ సర్వేకు ఇప్పటివరకు డబ్బులు చెల్లించకుండా అధికారులు మళ్లీ సర్వే నిర్వహించాలని పీహెచ్ సీ ల వారీగా ఆశాలపై ఒత్తిడి చేయడం సరైన నిర్ణయం కాదని, డబ్బులు చెల్లిస్తేనే సర్వే కొనసాగిస్తామన్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డ్యూటీలు నిర్వహిస్తే ఇంతవరకు డబ్బులు చెల్లించకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని, ఈ నెలలో 11, 14, 17 తేదీలలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఆశావర్కర్లు విధులు నిర్వహిస్తే ఇప్పటివరకు ఒక రూపాయి చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నిర్వహించిన పల్స్ పోలియో డబ్బులు కూడా చెల్లించ లేదని ఆయన అన్నారు. ఏఎన్సీ టీబీ టార్గెట్ రద్దు చేయాలని, సబ్ సెంటర్ లో ఓపి డ్యూటీలను రద్దు చేసి ప్రతినెల ఆశా బిల్లు పేపర్స్ కు, సర్వేకు సంబంధించిన సామాగ్రి అధికారులు ఇవ్వాలని, ప్రతీ నెల ఆశా బిల్ పేపర్స్ అధికారులు ఇవ్వకుండా ఆశలతో తెప్పిస్తున్నారని, క్వాలిటీతో కూడిన యూనిఫామ్స్ ఇవ్వాలని కోరారు. ఆశా డే సందర్భంగా ఆశా వ‌ర్క‌ర్ల‌కు ఇచ్చే వ్యాక్సిన్ ని సబ్ సెంటర్లు వారిగా డోర్ డెలివరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి డబ్బులు చెల్లిస్తేనే సర్వే కొనసాగిస్తామని, లేదంటే సర్వేను పూర్తిగా బహిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కీసరి ఇందిరా, లత, మంజుల, మమత, రాజమణి పాల్గొన్నారు.

Next Story