బోధన్ బరిలో కల్వకుంట్ల కవిత..?

by Nallavelli.Anjaneyulu |

నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో కీలక మలుపుకు దారితీసే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.

బోధన్ బరిలో కల్వకుంట్ల కవిత..?
X

దిశ, బోధన్ : నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో కీలక మలుపుకు దారితీసే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బోధన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చలు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. సొంత గడ్డపై తన పార్టీ రాజకీయ పునరాగమనానికి శ్రీకారం చుట్టే దిశగా కవిత ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జాగృతి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.

రాజకీయ ప్రస్థానంలో కొత్త మలుపు

శ్రీరామ నవమి సందర్భంగా నిజామాబాద్ పర్యటనలోనే కవిత తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశముందన్న ఊహాగానాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా తన అత్తగారి ఇంటి ప్రాంతమైన బోధన్ నుంచే పోటీ చేసి, తన ప్రజాదరణను మళ్లీ నిరూపించుకోవాలని కవిత భావిస్తున్నట్లు సమాచారం. ‘తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ’ పేరుతో కొత్త రాజకీయ వేదికను నిజామాబాద్ నుంచే ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ఉహాగానాలు వస్తున్నాయి

బోధన్‌పై బలమైన పట్టు

కల్వకుంట్ల కవిత కు బోధన్ నియోజకవర్గంతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. ఆమె సొంత ఊరు నవీపేట్ మండలం పోతంగల్ కావడం వల్ల ఈ ప్రాంతంలో ఆమెకు సహజంగానే బలమైన పట్టుంది. ఎంపీగా పనిచేసిన సమయంలో ‘మన ఊరు – మన ఎంపీ’ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కార దిశగా చర్యలు చేపట్టారు. రెంజల్ మండలంలోని ప్రసిద్ధ కందకుర్తి గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా స్థానికుల మన్ననలు పొందారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా తన ఎంపీ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గణనీయమైన నిధులను సమీకరించి పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారు. అదనంగా సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలను అందించారు.

తగ్గని ప్రజాదరణ.. పెరుగుతున్న అంచనాలు

బోధన్ నియోజకవర్గంలో కల్వకుంట్ల కవిత కు ఇప్పటికీ విశేష అభిమాన వర్గం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బిఆర్ఎస్‌కు చెందిన నాయకులు, ద్వితీయ శ్రేణి కార్యకర్తలు ఆమెకు అనుకూలంగా ఉన్నారని, కవిత పోటీ చేస్తే బహిరంగ మద్దతు ప్రకటించే అవకాశముందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కవిత బోధన్ బరిలో దిగితే నియోజకవర్గ రాజకీయాలు కొత్త మలుపు తిరిగే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సొంత గడ్డపై తన బలం ఏంటో మరోసారి నిరూపించుకోవాలనే సంకల్పంతో కవిత ముందడుగు వేస్తారా? లేదా ఇవన్నీ కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోతాయా? అన్నది స్పష్టత రానుంది.

Next Story