బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కథ కంచికేనా..?

by Nallavelli.Anjaneyulu |

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఆసియా ఖండంలోనే అతి పెద్ద చక్కెర పరిశ్రమగా ప్రసిద్ధి చెందిన బోధన్ షుగర్ ఫ్యాక్టరీ చరిత్ర ఇక కాల గర్భంలో

బోధన్ షుగర్ ఫ్యాక్టరీ  కథ కంచికేనా..?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఆసియా ఖండంలోనే అతి పెద్ద చక్కెర పరిశ్రమగా ప్రసిద్ధి చెందిన బోధన్ షుగర్ ఫ్యాక్టరీ చరిత్ర ఇక కాల గర్భంలో కలిసిపోనుందా? నష్టాల సాకుతో గత పదేళ్లుగా మూత పడిన నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ (ఎన్డీఎస్‍ఎఫ్) ఇక తెరుచుకునే అవకాశం లేదా? వందలాది ఎకరాల్లో ఉన్న ఫ్యాక్టరీ భూములు అన్యాక్రాంతం కావాల్సిందేనా? వందల కోట్ల విలువైన ఫ్యాక్టరీ గత వైభవానికి గుర్తుగా మిగిలిపోవలసిందేనా..? అంటే అవుననే సంకేతాలు క(వి)నిపిస్తున్నాయి. ప్రభుత్వ హయాంలో ఎంపీగా తను గెలిచిన వంద రోజుల్లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని అప్పట్లో కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చినా అప్పటి ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చలేదు. రెండేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్ని దేవుళ్ల మీద ప్రమాణం చేస్తూ జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డిని హామీని నమ్మి బోధన్ ఎమ్మెల్యేగా సుదర్శన్ రెడ్డిని ఇక్కడి ప్రజలు గెలిపించి అసెంబ్లీకి పంపించారు. రెండేళ్లు పూర్తయ్యింది. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ గేట్లు తెరుచుకోలేదు. సరికదా, ఇక ఫ్యాక్టరీని మరిచిపోవాల్సిందేననే సంకేతాలు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు, టీపీసీసీ చీఫ్ ఖరారు చేసిన మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఇస్తున్నారు.

చెరుకు రైతులతో దిశ యాజమాన్యం చెరుకు పండించాలట

పదేళ్ల క్రితం మూత పడిన బోధన్ షుగర్ ఫ్యాక్టరీ అంశంపై ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని దిశ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు నేరుగా స్పందించకుండా దిశ నుద్దేశించి వెటకారంగా మాట్లాడటం వింతగా అనిపించింది. ఫ్యాక్టరీ తెరిపించాలంటే రైతులు చెరుకును పండించాలని, దిశ యాజమాన్యం ముందుకొచ్చి ఇక్కడి రైతులతో చెరుకు పండించేలా చేయాలని మీడియా సమావేశంలో సుదర్శన్ రెడ్డి మాట్లాడారు.

సుదర్శన్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తారనుకుంటే..?

ఎప్పుడెప్పుడా అని ఎదిరి చూస్తున్న బోధన్ చక్కెర ఫ్యాక్టరీ కాంగ్రెస్ ప్రభుత్వంలో తెరుచుకుంటుందని జిల్లా ప్రజలు ఎదిరి చూశారు. ఫ్యాక్టరీ తెరిపించడం ఆయన వల్లే సాధ్యమని అంతా భావించారు. సీనియర్ నేత, వివాద రహితుడిగా పేరున్న సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కాలని జిల్లా ప్రజలు కోరుకున్నారు. ఆయన మంత్రి అయితే బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తారని, చెరుకు రైతుల జీవితాలు బాగుపడతాయని, జిల్లా అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావించారు. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవిని ఇవ్వకుండా రెండేళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి పెద్దాయనను నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారని తప్పు బట్టి సుదర్శన్ రెడ్డికి అండగా నిలిచారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. మంత్రి పదవి విషయంలో సుదర్‌శన్ రెడ్డికి జరుగుతున్న అన్యాయంపై దిశ పత్రిక కూడా పలు మార్లు ప్రజల తరఫున కథనాలు ప్రచురించింది. ఎట్టకేలకు సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు గా పదవిని కట్టబెట్టారు రేవంత్ రెడ్డి. దీంతో ఇక బోధన్ చక్కెర ఫ్యాక్టరీ తెరుచుకుంటుందనే ఆశలకు రెక్కలొచ్చాయి.

చేతులెత్తేసిన పెద్దాయన..

ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పెద్దాయన ఫ్యాక్టరీని తెరిపిస్తారని చెరుకు రైతులు, జిల్లా ప్రజలు భావిస్తే పెద్దసారు వారి ఆశలపై నీళ్లు జల్లినంత పని చేశారు. కొండను తవ్వి ఎలుకను తీసిన చందంగా.. చెరుకు పండించేందుకు రైతులకు సిద్ధంగా లేరని, అందుకే ఫ్యాక్టరీ తెరుచుకోవడం జరగదన్నట్లు సమాధానం చెప్పి నెపాన్ని రైతులపైకి నెట్టేశారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడటం జిల్లా ప్రజలకు మింగుడు పడటం లేదు. షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడం తన వల్ల కావడం లేదని, తను పదవి తెచ్చుకుంది తనకోసమే కాని, ప్రజల కోసం కాదన్నట్లుగా, ఫ్యాక్టరీ తెరిపించేందుకు అసలే కాదన్నట్లుగా సుదర్శన్ రెడ్డి మాట్‌లాడటం విమర్శలకు తావిస్తోంది.

ఫ్యాక్టరీని తెరిపించలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికేనా..?

ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఫ్యాక్టరీని సాధించుకొచ్చే సత్తా తనకు లేదని చెప్పలేక, తన అసమర్ధతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిన సుదర్శన్ రెడ్డి దిశ ప్రతినిధి అడిగిన ప్రశ్నను నేరుగా సమాధానం చెప్పలేక దిశ పై వెటకారపు వ్యాఖ్యలు చేయడం మీడియా గౌరవం పట్ల ఆయన నైజాన్ని స్పష్టం చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాక్టరీని తెరిపించే ఉద్దేశం లేకే నెపాన్ని చెరుకు రైతులపైకి నెట్టేశారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చెరుకును పండించేందుకు రైతులు ముందుకు రావడం లేదని, ఫ్యాక్టరీ తెరింపించడం సాధ్యం కాదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసిన సుదర్శన్ రెడ్డి వ్యవహారం జిల్లా ప్రజలకు మింగుడు పడటం లేదు.

కేసీఆర్ ను తలపించిన వ్యవహారశైలి..

సాధార‌ణంగా మీడియా సమావేశాల్లో మీడియా ప్రతినిధులు కేసీఆర్ ను ఏదైనా మింగుడు పడని ప్రశ్న వేసిన సందర్భంలో అసహనం ప్రదర్శించే విషయం అందరికీ తెలిసిందే. సమావేశంలో అందరి ముందు నీది ఏ పేపర్? ఏ ఛానల్ అంటూ బెదిరించే ధోరణిలో ఎదురు ప్రశ్నించడం రాస్కో... కాస్కో అంటూ వెటకారంగా మాట్లాడటం అందరికీ సుపరిచితమే. అదే తీరులో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కూడా సోమవారం నిజామాబాద్ లోని ఐటీ హబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే అంశంపై ప్రశ్నించిన దిశ ప్రతినిధి ఆడెపు శ్రీనివాస్ పై కూడా వెటకార ధోరణిలో మాట్లాడటంతో మీడియా సమావేశంలో పాల్గొన్న పలు మీడియా సంస్థల ప్రతినిధులు కేసీఆర్ ను గుర్తు చేసుకున్నారు.

Next Story