ఏటీఎం దొంగల అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా అరెస్ట్

by Ratna Kumari |

వివిధ ప్రాంతాల్లో ఏటీఎం లను ధ్వంసం చేసి లక్షలాది రూపాయలు దోచుకున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

ఏటీఎం దొంగల అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా అరెస్ట్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : వివిధ ప్రాంతాల్లో ఏటీఎం లను ధ్వంసం చేసి లక్షలాది రూపాయలు దోచుకున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సీసీ ఫుటేజీతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకుని పలు ఆధారాలను సేకరించిన పోలీసులు ఏటీఎం దొంగలను ఎట్టకేలకు పట్టుకున్నారు. నిజామాబాద్ నగరంలో ఏటీఎంలను ధ్వంసం చేసి లక్షల సొత్తును దోచుకున్న దోపిడీ దొంగలు అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఆ ముఠాకు చెందిన ఐదుగురు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును ఎస్ హెచ్ ఓ బి. రఘుపతి నేతృత్వంలో దర్యాప్తు జరిపి కేసును చేధించినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. ఈ కేసు వివరాలను శుక్రవారం పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య మీడియాకు వెల్లడించారు

బ్లూ కోల్ట్ విధులు నిర్వహించే ఉద్యోగి ఫిర్యాదుతో దర్యాప్తు

డిసెంబర్ 31 న రాత్రి సుమారు 2.19 గంటలకు ఎవరో ఐదుగురు గుర్తు తెలియని దుండగులు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏటీఎం ను ధ్వంసం చేసి గ్యాస్ కట్టర్ తో కాల్చి డబ్బులు దొంగిలించే ప్రయత్నం చేశారని బ్లూ కోల్ట్ విధులు నిర్వహించే న్యాలకంటి లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సీపీ ఆదేశాలతో ప్రత్యేక బృందం ఏర్పాటు..

నిజామాబాద్ సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కేసును చేధించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నేరస్థులను గుర్తించారు. అనంతరం నేరస్తుల గురించి గాలింపు మొదలెట్టారు. ఈనెల 8న నిఖిల్ సాయి ఎక్స్ రోడ్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా నేరస్తులు ప్రయాణిస్తున్న B.No AP 20 AB 1617 బొలోరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా కారులో కర్రలు, రాళ్లు పెట్టుకొని వస్తున్నట్లు గుర్తించినట్లు సీపీ తెలిపారు.

పోలీసులు అరెస్ట్ చేసింది వీరినే..

ఏటీఎం లను ధ్వంసం చేసి లక్షల రూపాయలు దోచుకునే అంతర్రాష్ట్ర దొంగల ముఠాలోని ఐదుగురు సభ్యులను అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఏ 1 నిందితుడు హర్యానా లోని నూహ్ జిల్లా పన్హానా తాలూకా, బండ్లి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ అబ్దుల్లా ఖాన్, ఏ 2 నిందితుడు ముంబైలోని అంధేరీ (వెస్ట్), సాగర్ సిటీ టవర్ లో నివాసముంటున్న హైదరాబాద్ వాస్తవ్యుడు మొహమ్మద్ అమీర్ అన్సారీ , ఏ 3 నిందితుడు హర్యానాకు చెందిన నూహ్ జిల్లా బాదన్ గాక గ్రామానికి చెందిన వాజీబ్ ఖాన్, ఏ 4 నిందితుడు హర్యానాలోని నూహ్ జిల్లా గాజార్పూర్ కు చెందిన మొహమ్మద్ అజీబ్ అలియాస్ నత్తు, ఏ 5 నిందితుడు హర్యానా లోని పల్వాల్ జిల్లా అతీం తాలూకా, కిల్లోకా గ్రామానికి చెందిన శామోద్దిన్ అలియాస్ ఇక్రామ్ లను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో అందరూ నేర చరితులేనని , వీరిపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదై ఉన్నాయన్నారు. జైలు శిక్ష కూడా అనుభవించారని సీపీ అన్నారు.

పోలీసులు స్వాధీనపర్చుకున్న సొత్తు వివరాలు..

దోపిడీ ముఠా సభ్యుల నుండి బి నెం. ఏపీ 20 ఏబీ 1617 బొలెరో వెహికిల్, బి నెం. హెచ్ఆర్ 72 కె 8670 బాలెనో వెహికిల్, ఒక చిన్న ఆక్సిజన్ సిలిండర్, ఒక చిన్న ఎల్పీజీ సిలిండర్, ఎరుపు, బ్లూ కలర్ పైపులతో గ్యాస్ కట్టర్, రెండు జతల సర్జికల్ గ్లౌస్ లు, ఆబ్రో కంపెనీ కి చెందిన స్ప్రే బాటిల్, ఒక చిన్న ఇనుప రాడ్ , బ్లూ కలర్ ప్లాస్టిక్ పిడి కలిగిన ఒక మాస్టర్ కీ , ఒక కటింగ్ ప్లేయ ర్, కర్రలను నిందితుల నుండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఏటీఎం ల దొంగతనంలో సిద్ధహస్తులు

పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితులు ఏటీఎం లను కొల్లగొట్టి లక్షలాది రూపాయలను దోచుకోవడం వంటి దొంగతనాల్లో సిద్ధహస్తులని పోలీసులు పేర్కొన్నారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎం ను ధ్వంసం చేసి రూ. 48 లక్షలు దొంగిలించారు. జహీరాబాద్ పీఎస్ పరిధిలో బొలోరో వాహనం దొంగతనం, సంగారెడ్‌డి జిల్లా పటాన్ చెరు పీఎస్ పరిధిలో, నిజామాబాద్ వన్ టౌన్ పీఎస్ పరిధిలో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏటీఎం, జక్రాన్ పల్లి మండలం అర్గుల్ గ్రామంలోని ఏటీఎం దొంగతనాల కేసులు, జహీరాబాద్ టోల్ ప్లాజా సమీపంలో హుందాయ్ సాంత్రో కారును దొంగిలించిన కేసుల్లో కూడా వీరు నిందితులని, వీరిపై ఆయా పోలీస్‌ స్టేషన్లలో కేసులు కూడా నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

Next Story