ఆశావహుల్లో బీ-ఫామ్ ఉత్కంఠ.. ఆర్మూర్ మున్సిపల్ పీఠంపై ఆసక్తికర చర్చ

by Ajay Maddhiboyina |

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల రాజకీయం ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగింది.

ఆశావహుల్లో బీ-ఫామ్ ఉత్కంఠ.. ఆర్మూర్ మున్సిపల్ పీఠంపై ఆసక్తికర చర్చ
X

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల రాజకీయం ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌లలో బీ-ఫామ్స్ ఎవరికి దక్కుతాయోనన్న ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. ముఖ్యంగా ఆర్మూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం కోసం కాంగ్రెస్ సీనియర్ నేత ఏబీ శ్రీనివాస్ సతీమణి శ్రీదేవి బరిలోకి దిగడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మెజారిటీ వార్డుల్లో ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో వారిని బుజ్జగించడం నాయకులకు తలనొప్పిగా మారింది. పార్టీలు అధికారికంగా ఎవరికి మద్దతు తెలుపుతాయో తెలియక అభ్యర్థులు టెన్షన్‌లో ఉండగా, రెబల్ అభ్యర్థులు వెనక్కి తగ్గకపోవడం సమీకరణాలను మారుస్తోంది. బుజ్జగింపులు ఫలించకపోతే స్వతంత్రులుగానైనా పోటీ చేస్తామని పలువురు ఆశావహులు భీష్మించుకుంటున్నారు. గడువు ముగిసిన తర్వాతే అసలైన అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆర్మూర్ పట్టణమంతా ఎన్నికల వ్యూహాలు, బీ-ఫామ్స్ లెక్కలతో అట్టుడుకుతోంది.

- దిశ, ఆర్మూర్

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ కార్పొరేషన్‌తోపాటు ఆర్మూర్, భీంగల్, బోధన్ మున్సిపాలిటీల్లో ఎన్నికల రాజకీయం ముదిరింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు సమీపిస్తుండడంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల బీ-ఫామ్స్ ఎవరికి దక్కుతాయోనన్న టెన్షన్ అభ్యర్థుల్లో టెన్షన్ పెంచుతోంది. ఒక్కో డివిజన్, వార్డులో ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉండడంతో టికెట్ల కేటాయింపు నేతలకు సవాలుగా మారింది.

బుజ్జగింపులకు లొంగని ఆశావహులు..

టికెట్ ఖరారైన అభ్యర్థులకు నాయకులు రహస్యంగా సమాచారం అందిస్తూ మిగిలిన వారిని బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పరిస్థితి అధికార కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా కనిపిస్తోంది. అయితే, మెజారిటీ వార్డుల్లో ఆశావహులు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని భీష్మించుకోవడంతో నాయకులకు రెబల్స్ భయం పట్టుకుంది. విత్ డ్రా చేయించేందుకు ముఖ్య నేతలు చేస్తున్న ప్రయత్నాలు ప్రస్తుతానికి ఫలించడం లేదు.

ఆర్మూర్ చైర్మన్ పీఠంపై ప్రత్యేక ఫోకస్...

ఆర్మూర్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పీఠం ఈసారి జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఏ.బి శ్రీనివాస్ సతీమణి ఏ.బి శ్రీదేవి నామినేషన్ వేయడంతో ఈసారి ఆమెకే చైర్‌పర్సన్ పదవి దక్కనుందనే ఊహాగానాలు గుప్పుమంటున్నాయి. చివరి నిమిషంలో ఆమె నామినేషన్ దాఖలు చేయడం వెనుక పక్కా వ్యూహం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి ఉపసంహరణ గడువు ముగిస్తే తప్ప ఏ పార్టీ నుంచి ఎవరు అధికారికంగా బరిలో ఉంటారో తేలేలా లేదు.

Next Story