కళ్లెదుటే నేరాలు..!

by velandi.Saikiran |

కళ్లెదుటే నేరాలు..!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : యువతలో నేర ప్రవృత్తి రోజురోజుకూ పెరిగిపోతుంది. సిగరేట్ దమ్ము కొట్టినంత ఈజీగా కత్తులతో పొడిచేస్తున్నారు. అమాయక ప్రాణాలు తోడేస్తున్నారు. గ్యాంగులు మెయింటేన్ చేస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అడ్డు వచ్చిన వారితో గొడవలు పడుతూ గ్యాంగ్ వార్ ను క్రియేట్ చేస్తున్నారు. సమాజంలోని ప్రశాంతతకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నారు. మద్యం, మత్తు, మాదక ద్రవ్యాల వంటి వాటితో కొందరు నేర ప్రవృత్తిలోకి అడుగు పెడుతుంటే, మరి కొందరు యువత ఈజీమనీకి అలవాటుపడి వివిధ రకాల దొంగతనాలు, దోపిడీలు, వాహన చోరీలు, చైన్ స్నాచింగ్స్, సైబర్ నేరాల వంటి నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో పోలీసుల నుండి తప్పించుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. ఒక్కోసారి నేరాలు చేసే క్రమంలో సాధారణ జనానికి ప్రాణహాని తలపెడుతున్న నేరగాళ్లు పోలీసులను కూడా వదలడం లేదు. అడ్డు తొలగించుకుని తాము సేఫ్ గా పారిపోవడానికి పోలీసులను కూడా చంపేస్తున్నారు. తాజాగా నిజామాబాద్ నగరంలో శుక్రవారం సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను వివిధ నేరాల్లో నిందితుడిగా ఉన్న ఓ పాత నేరస్తుడు కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేసి పరారవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన పోలీసుల ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయిందనే అనే సందేహాలు లేవనెత్తేలా చేసింది.

ప్రజల రక్షణే పోలీసుల బాధ్యత... పోలీసుల ప్రాణాలకు..?

ప్రజల ధన, మాన ప్రాణాలను కాపాడేందుకు అహర్నిషలు 247 పోలీసులు పాటు పడుతున్నారు. ఎక్కడ ఏ చిన్న నేరం జరిగినా జనానికి గుర్తుకొచ్చేది పోలీసులే. పిలిస్తే పలికే దైవంగా పోలీసులు వెంటనే వచ్చి కాపాడుతున్నారు. కానీ, పోలీసులకే బహిరంగంగా ప్రాణాపాయం ఎదురైనప్పుడు సాధారణ జనం ఎందుకు కాపాడేందుకు ముందుకెళ్లడం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్నలా మారింది. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ ప్రాంతంలో దొంగతనాలు, దోపిడీలు, హత్యానేరం వంటి కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ పాత నేరస్థుడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొస్తున్న క్రమంలో ఆ నేరస్థుడు సీసీఎస్ కానిస్టేబుల్ ను విచక్షణా రహితంగా కత్తితో పొడిచి గాయపరిచాడు. ఈ దృశ్యాన్ని జనం అంతా ప్రత్యక్షంగా చూశారే తప్ప ఎవరూ ఆ దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని, గాయపడిన పోలీసు కానిస్టేబుల్ కు సాయం పట్టి హాస్పిటల్ కు చేర్చేందుకు కూడా ఎవరూ సహకరించలేదని స్వయాన పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ఈ ఘటన పోలీసులకు ప్రమాదమెదురైతే ఎవరు దిక్కనే ప్రశ్న తలెత్తేలా చేసిందని సీపీ చెప్పకనే చెప్పారు.

పోలీసులు సివిల్ డ్రెస్ లో ఉండటం వల్లే..

సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ పై నేరస్తుడు షేక్ రియాజ్ కత్తి దాడి చేస్తున్నప్పుడు సీసీఎస్ పోలీసులు సివిల్ డ్రెస్ లో ఉన్నారని, ఏదో గ్యాంగ్ వార్ అనుకుని నగర పౌరులెవరూ ఆ దాడిని అడ్డుకోలేదని, దాడిలో గాయ పడ్ని బాధితుడికి సాయమందించలేదనేది స్థానికులు చెపుతున్న మాట. పైగా అడ్డుకుంటే తమనేమో చేస్తారనే భయంతో పాటు, దాడిలో గాయపడిని వారికి సాయమందిస్తే పోలీసు కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందన్న భయం కూడా ఉండటంతో ఎవరూ సాహసం చేయలేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసే సమాజాన్ని పోలీసులు పైకి ఏమనకపోయినా క్షమిస్తారనుకోవచ్చా?.

Next Story